close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

సాధన సేయరా డింభకా.. సరికోత్తగా మెరవోచ్చిక..

విభిన్న అంశాల్లో అద్భుతాలు
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వీరులు

సుద్ద పిక్క.. ఇనుప ముక్క.. మునికాళ్లపై పరుగులు.. సూక్ష్మ బొమ్మలు.. అదరగొట్టే నృత్యాలు...  నోరూరించే లడ్డూలు. అబ్బురపరిచే చిచ్చర పిడుగులు.. ప్రతి ఒక్కరిలో ఎన్నో ప్రత్యేకతలు. ఔరా.. ఈ పిల్లాడిలో ఇంత జ్ఞాపక శక్తి ఉందా అనేంతటి అశ్చర్యం.. ఔనా.. మనోడు ఇంత కళాకారుడా! అంటూ  పదిమందికీ నచ్చేలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఊరి సరిహద్దులు దాటి.. జిల్లా..రాష్ట్రం.. దేశం.. యావత్‌ ప్రపంచానికి తెలిసేలా మెరిశారు.  రివార్డులు.. రికార్డులు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు.. ఫలానా వ్యక్తి గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించాడంటే అబ్బో..అనుకునేవాళ్లు.  ఇప్పుడు మనూరు పిల్లవాడే..ఆ రికార్డుల్లోకి ఎక్కాడంటే.. ఆనందోత్సాహాలతో ఎగిరి గంతేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని తెలుగు వాకిళ్లలో.. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న సృజనశీలురు..  ప్రయత్నం చేయరా డింభకా.. మెరుపులు సృష్టించవచ్చంటూ సాటి వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఆ ముచ్చట్లు.. మీకోసం...

- ఈనాడు, హైదరాబాద్‌

* వ్యాపకంతో మొదలు.. మెరుగైన భవితకు వీలు..
* తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు
* జీవితంలో పైమెట్టు ఎక్కేందుకు 
* నలుగురిలో గుర్తింపు, ప్రత్యేకత కోసం
* ఇతరులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచేందుకు
* సాధించే క్రమంలో..
* ముందుగా వారిని వారు జయిస్తారు
* క్రమశిక్షణ, పట్టుదల, అకుంఠిత దీక్షతో సాధన
* గెలుపు దక్కేవరకు ఆపని ప్రయత్నం

గిన్నిస్‌ లడ్డూ కేరాఫ్‌ తాపేశ్వరం

మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని భక్తాంజనేయ సంస్థ యజమాని సలాది వేంకటేశ్వరరావు (శ్రీను బాబు) 2011 నుంచి 2014 వరకు తన ఘనతను తానే అధిగమించి లడ్డూల తయారీలో వరుసగా నాలుగు సార్లు గిన్నిస్‌ రికార్డులు సాధించారు. చివరిసారి 7,858 కిలోల లడ్డూ తయారు చేశారు.

మునివేళ్లపై  పరుగుతో... 

లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు కరీంనగర్‌కు చెందిన యువకుడు. పదేళ్ల సుదీర్ఘ ప్రయత్నాన్ని పూర్తి చేసుకొని నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు రాపెల్లి శ్రీనివాస్‌. కరీంనగర్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో వ్యాపారి శ్రీనివాస్‌ చిన్నతనం నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌లో పట్టు సాధించాడు. అంతర్జాతీయ స్థాయి కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్‌ పోటీల్లో  అనేక పతకాలను సాధించాడు. పదేళ్ల కిందట గిన్నిస్‌ బుక్‌లో నమోదయ్యేందుకు కృషి మొదలెట్టాడు.. కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో కాలి మునివేళ్లపై పరుగెత్తడం ప్రారంభించాడు. గిన్నిస్‌ రికార్డు కోసం శ్రమించాడు. ప్రముఖుల సమక్షంలో తన సాహసాన్ని ప్రదర్శించాడు. ఒక నిమిషం వ్యవధిలో 137.1 మీటర్లు కాలి మునివేళ్లపై పరుగెత్తాడు. వీడియోలో రికార్డు చేసి ఆన్‌లైన్‌ ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌తో పాటు పలు సంస్థలకు పంపించాడు. శ్రీనివాస్‌ సాహసాన్ని గుర్తించిన ఆయా సంస్థల వారు అవార్డులతో సన్మానించారు. ఇటీవల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు ఇతని పేరు నమోదు చేసి అర్హత పత్రం, పతకాన్ని పోస్టు ద్వారా పంపించారు.
నా కుమార్తె  ప్రశ్నతో.. విజయపథం
- స్క్వాడ్రన్‌ లీడర్‌ జయసింహ, అధ్యక్షుడు, ప్రపంచ మెమరీ కౌన్సిల్‌-ఇండియా 
ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డే అత్యుత్తమం. మన దేశంలో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రముఖమైనవి. ఈ రెండింటికి నేను జడ్జిగా ఉన్నాను. మన వాళ్లు  యూఎస్‌, యూకేలలో ఎలాంటి రికార్డులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. రికార్డు సాధించడానికి ఆ వ్యక్తి  కఠోర సాధన చేసే క్రమంలో ఎంతో ఎదుగుతాడు. 
* కొందరు తక్కువ శ్రమతో రికార్డులు అందుకుంటే,మరికొందరు తీవ్రంగా శ్రమిస్తుంటారు.నావల్ల కాదనుకుని వదిలేసేవారు 10 శాతమే. 90 శాతం మంది తిరిగి ప్రయత్నిస్తారు.  అంతిమంగా రికార్డు తమ పేరున లిఖించుకుంటారు. 
* నేను స్క్వాడ్రన్‌ లీడర్‌ నుంచి మోటివేషనల్‌, మెమరీ వైపు వచ్చాక మా పాప ఒకసారి ఒక ప్రశ్న అడిగింది. మీ రంగంలో మీరు నంబర్‌వన్‌ అయితే గిన్నిస్‌ రికార్డులో పేరు ఉండాలి కదా అని అడిగింది. అంతే అలా మొదలైన నా గిన్నిస్‌ రికార్డులు ప్రస్తుతం 14కు చేరాయి.

శభాష్‌.. సుభాష్‌ 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మొగిలి సుభాష్‌ (35) ప్రైవేటు బీమా సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తూనే  దూర విద్యలో బీఏ, తర్వాత ఎంఏ (ఆంగ్లం) పూర్తి చేసి ఎంఏ సైకాలజీ చేశారు. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టారు. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరులో శిక్షణ పొందారు. బోర్డుపై రాసిన అంకెలను ఒకసారి చూడడం, వినడం.. తర్వాత వాటిని తిరిగి చూడకుండా అతి తక్కువ సమయంలో చెప్పగలగడంలో సుభాష్‌ ప్రావీణ్యం సంపాదించాడు. ఈయన ప్రతిభను గుర్తించి నేషనల్‌ మెమరీ ఛాంపియన్‌షిప్‌నకు ఆర్బిటర్‌గా ఎంపిక చేశారు. గతజూన్‌లో చైనాలో నిర్వహించిన జ్ఞాపకశక్తి ప్రదర్శనలో 360 సంఖ్యలను ఒకసారి విన్న తర్వాత వాటిని చూడకుండా 4 నిమిషాల 10 సెకన్లలో చెప్పడంతో పాటు, 170 రకాల రంగులను ఒకసారి చూసి 2 నిమిషాల 45 సెకన్లలో చెప్పడం ద్వారా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకు ఎంపికయ్యారు.  2015లో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు,  2016లో వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు, 2017లో లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డుతో పాటూ మరో ఐదు ప్రత్యేకతలను తన ఖాతాలో వేసుకున్నారు. 

గిరిజన ప్రాంత విద్యార్థి... ప్రపంచ స్థాయి గుర్తింపు

విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం జి.మాడుగుల. వెనకబడిన చోటునుంచి వచ్చినా మెట్రోప్రాంత విద్యార్థుల కన్నా మెరుగైన ప్రతిభ చూపి ప్రపంచ రికార్డును సాధించాడు కాతా తేజ. చోడవరం మండలం గాంధీగ్రామం ఆడమ్స్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న తేజ రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను పూరించడంలో దిట్ట. అతనిలో దాగున్న ప్రతిభను గుర్తించిన పాఠశాల సంచాలకుడు బద్రీమహంతి వెంకటరావు ఈ అంశంలో తర్ఫీదు ఇచ్చారు. గతంలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన విద్యార్థి తరుణ్‌ అగర్వాల్‌ ఆవర్తన పట్టికను 79 సెకన్లులో పూరించి ప్రపంచ రికార్డు స్థాపించాడు. అతనికన్నా తక్కువ వ్యవధిలో పూరించాలనే తపనతో కొన్ని నెలలు సాధన చేశాడు. 65 సెకండ్లలో పట్టికను వేసి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో  స్థానం సంపాదించాడు.

సూక్ష్మ కళ భళా..

ఆర్కిటెక్చర్‌ చదువుతున్న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేష్‌ ఇప్పటి వరకు వందల సంఖ్యలో సూక్ష్మ రూపాలను మలిచి, పదుల సంఖ్యలో అవార్డులు, సన్మానాలు పొందాడు. 2011 నుంచి మైక్రో ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు ముందడుగు వేశాడు. పాఠశాల స్థాయిలో ఉండగానే వ్యర్థాలతో చిన్నచిన్న బొమ్మలు, సూక్ష్మ రూపాలను తయారు చేశారు. గురువు లేకుండానే స్వీయ సాధనతో ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. అగ్గిపుల్లలపై ఆంగ్ల పదాలు, నంబర్లు, పెన్సిల్‌ ముల్లుపై తల్లీబిడ్డలు, దేవతామూర్తుల బొమ్మలు చెక్కారు. 2017లో టూత్‌పిక్‌ను ఉపయోగించి 17 మిల్లీమీటర్ల ఎత్తు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ను 21 నిమిషాల్లో తయారు చేసి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. వెంకటేష్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ గత ఏడాది ఆగస్టులో తన వద్దకు పిలిపించుకుని సత్కరించారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, వరల్డ్‌ రికార్డు ఇండియాలలో స్థానం సంపాదించారు. 

‘అభి’నయం.. అదిరే 

నృత్యం చేయడంలో అదుర్స్‌..ఆదరగొట్టే స్టెప్పులు వేయటంలో క్లాస్‌.. నృత్యంలో ప్రముఖ హీరోలను సులభంగా అనుకరిస్తూ ఔరా అనిపించుకున్నారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన ఐరేని హరికృష్ణగౌడ్‌ (అభినయకృష్ణ). సినిమాలు, టీవీ షోలలో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2010లో హైదరాబాద్‌లోని హొటల్‌ తాజ్‌ దక్కన్‌లో జరిగిన నృత్య కార్యక్రమంలో పాల్గొని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించారు. 3 నిమిషాల 56 సెకన్లలో 24 మంది తెలుగు, హిందీ హీరోలను అనుకరిస్తూ నృత్యం చేశారు. దీంతో మొదట్లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డును, తర్వాత ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును కైవసం చేసుకున్నారు. హరికృష్ణగౌడ్‌ నృత్యాన్ని చూసిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అతని పేరును అభినయకృష్ణగా మార్చారు. ఈశ్వర్‌, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించారు. బాహుబలిలో ఇతని పాత్ర 30 సెకన్లు ఉంది. ‘ఈటీవీ’లో వస్తున్న కామెడీ షో జబర్దస్త్‌లోఇతని పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. 

అతి చిన్న ఆంగ్ల కాలమానిని రూపకల్పన

విజయవాడ మాంటిస్సోరి విద్యాసంస్థ ఫైన్‌ఆర్ట్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ నడిపల్లి రవికుమార్‌ సూక్ష్మ కళలో గిన్నిస్‌ బుక్‌తో సహా 18 ప్రపంచ రికార్డులను సాధించారు. ప్రపంచంలోనే అతి చిన్న ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ 10 మి.మీ.లో యూకేకు చెందిన వాళ్లు చేస్తే.. దానిని 7 మి.మీ.లో 2018లో రవికుమార్‌ చేసి.. ఏడు రికార్డులు బద్దలు కొట్టారు. సుద్దముక్కలతో 33 అక్షరాలతో 20 నిమిషాల్లో ‘విజయవాడ పుస్తక మహోత్సవం నగరానికి వెండి పండుగ’ అని తయారు చేశారు. దీనికి ఏకంగా 11 ప్రపంచ రికార్డులు వచ్చాయి. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటూ ఎవరెస్ట్‌ వరల్డ్‌, యునిక్‌ వరల్డ్‌, వరల్డ్‌ అమేజింగ్‌, ఇండియా బుక్‌, వండర్‌ బుక్‌, రెండుసార్లు హైరేంజ్‌ బుక్‌ తదితరాలు సాధించారు. ప్రస్తుతం మహాభారతాన్ని 10శ్రీ10 మి.మీ.పుస్తకంలో రాస్తున్నారు. 

- ఈనాడు అమరావత

తైక్వాండోలో పలుసార్లు గిన్నిస్‌ రికార్డులు

తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ముషీరాబాద్‌కు చెందిన కొండా సహదేవ్‌ పలుసార్లు గిన్నిస్‌ రికార్డులను సాధించారు. 2007లో ఒక్కొక్కటి 6 టన్నుల బరువు గల పది బస్సులను ఒక నిమిషం 20 సెకన్లలో చేతి వేళ్లపైనుంచి పోనిచ్చి గిన్నిస్‌ రికార్డు సాధించారు. 2008లో 1850 కిలోల బరువు గల క్వాలిస్‌ వాహనాన్ని చిటికెన వేలుకి కట్టిన తాడుతో కిలోమీటర్‌ దూరం లాగి గిన్నిస్‌ బుక్‌ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. 2016లో 2700 కిలోల బరువుండే టాటా వింగర్‌ వాహనాన్ని 1.610 కి.మీ. దూరానికి 11 నిమిషాల 39 సెకన్లలో నెట్టి మరోసారి గిన్నిస్‌కు ఎక్కారు. తైక్వాండో పూంసే ఈవెంట్‌లో 13 నిమిషాలలో 782 మూమెంట్లు చేసి మరోటి..ఇలా 2015 వరకు అనేక రికార్డులు నమోదు చేశారు.

- ముషీరాబాద్‌ (హైదరాబాద్‌)

పర్యావరణ హితం.. ఆయన అభిమతం

పర్యావరణహిత వస్తువులను ఉపయోగించి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బొరివంకకి చెందిన కళాకారుడు బి.తిరుపతిరావు. 10వ తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల అనకాపల్లి వెళ్లి విగ్రహాల తయారీని నేర్చుకున్నారు. అందులో ప్రావీణ్యం సంపాదించి స్వగ్రామం తిరిగి వచ్చి రకరకాల విగ్రహాలను తయారుచేస్తూ గుర్తింపు తెచ్చుకొన్నారు. 2014లో వరినారుతో తయారుచేసిన విగ్రహానికి ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్సులో, 2017లో గోధుమనారుతో రూపొందించిన దానికి హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో చోటు దక్కింది.ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా 3500 సుద్దముక్కలతో ‘లేఖిని రూప కాణిపాక గణపతి’ ప్రతిమ రూపొందించారు. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటుకు పోటీపడుతోంది.  ప్రతీసుద్దముక్కపై కాణిపాక వినాయక విగ్రహాన్ని చెక్కడం దీని ప్రత్యేకత. ‘ఈనాడు, ఈటీవీ’లలో పర్యావరణానికి మద్దతుగా వచ్చిన కథనాలతో తాను స్ఫూర్తిపొందినట్లు పేర్కొన్నారు.

- బొరివంక (కవిటి)

నిర్విరామ గానం.. ఇనుమడించిన కీర్తి


శ్రీకాకుళంకి చెందిన డా.రాజేశ్వరీ చంద్రజ సాంస్కృతిక రంగంలో 7 రికార్డులు సాధించారు. 14 గంటల పాటు భక్తి గీతాలను, 14 గంటల పాటు యుగళ గీతాలను పాడినందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆమె పేరు 2సార్లు నమోదైంది.మనసు అంశంపై 6 కథా సంకలనాలు రాసినందుకు తెలుగుబుక్‌ ఆఫ్‌రికార్డ్సులో తొలిసారిగా స్థానం దక్కింది. 270 నిమిషాల్లో 61 సినీ గీతాలను ఆలపించినందుకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో, గాయని పి.సుశీల ఆలపించిన పాటలు నిర్విరామంగా పాడినందుకు జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటుదక్కింది. 

- శ్రీకాకుళం సాంస్కృతికం

ఒకే ఏడాదిలో 42 పరిశోధనాత్మక వ్యాసాలు 

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలానికి చెందిన శ్రీనివాసరావు ఆంగ్ల భాషపై ఒక్క విద్యా సంవత్సరంలో రాసిన 42 పరిశోధనాత్మక వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆయనకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది.  శ్రీనివాసపురంలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన సత్యనారాయణ, జోగమ్మ దంపతుల చిన్న కుమారుడైన శ్రీనివాసరావు ఉస్మానియా వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఎడ్‌, ఎంఫిల్‌ చేశారు. ఆంగ్ల భాషపై 10 పుస్తకాలను ప్రచురించారు. సౌదీ అరేబియాలోని కింగ్‌ ఫైసల్‌ యూనివర్సిటీ, అల్‌-హస కింగ్‌డమ్‌ఆఫ్‌ సౌదీ అరేబియాలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సెంటర్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు ఆంగ్లభాషపై అవగాహన పెంపొందించడంలో కృషి చేస్తున్నారు.

- శ్రీనివాసపురం(హుజూర్‌నగర్‌ గ్రామీణం)

ఇందూరు చిన్నారి.. రికార్డుల బరి

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉండే చిట్టిమిల్ల సహస్ర(8) అమోఘమైన జ్ఞాపకశక్తితో రికార్డులకు ఎక్కింది. తండ్రి డాక్టర్‌ సంతోష్‌ ఆమెకు తగిన తర్ఫీదు ఇచ్చారు. సహస్ర మూడోతరగతి చదువుతోంది.ఆరేళ్ల వయస్సులో 2018 సెప్టెంబరులో 51 సెకన్లలో 50 ప్రశ్నలకు జవాబులు చెప్పి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 2018 నవంబరులో 49.5 సెకండ్లలో 50 దేశాల కరెన్సీ పేర్లను చెప్పి సూపర్‌ కిడ్‌ అవార్డు అందుకుంది. 2019 జూన్‌ 3లో 3:50 నిమిషాల్లో 20 ప్రశ్నలకు,118 పీరియాడిక్‌ టేబుల్‌ మూలకాలను చెప్పి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదైంది.గతఅక్టోబరు 23న 3:48 నిమిషాల్లో 100అబ్రివేషన్లను చెప్పి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం పొందింది.

- నిజామాబాద్‌ విద్యావిభాగం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.