గురువారం, డిసెంబర్ 05, 2019
ఆర్టీసీ ఐకాస నాయకుల కట్టడి
సంఘీభావం తెలిపిన పార్టీలు
ఇందూరు సిటీ, నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్‌టుడే
విద్యార్థి సంఘం నాయకుడిని అరెస్టు చేస్తున్న పోలీసులు
ఆర్టీసీ ఐకాస నాయకులకు మద్దతుగా పలు పార్టీలు చేపట్టిన నిరసనలతో నిజామాబాద్ ధర్నాచౌక్ హోరెత్తింది. శుక్రవారం ఉదయం నుంచి ఐకాస నాయకులతో పాటు వివిధ పార్టీలు కార్మికులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. వీరిందరినీ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. నిరసనలో పాల్గొన్న వారందరిని కూడా పోలీసు వాహనాల్లో ఎక్కించి ఠాణాలకు తరలించారు.
* ధర్నాలో కూర్చొన్న ఆర్టీసీ ఐకాస, వామపక్షాల నాయకులు సుమారుగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
* వీరికి మద్దతుగా ఐఎఫ్టీయూ, పీడీఎస్‌యూ ఇతర సంఘాల నాయకులు ర్యాలీగా అక్కడికి వచ్చారు. వీరిని కూడా అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు.
* ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కార్మికులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు తాము పూర్తి అండగా ఉంటామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
* ఆర్టీసీ నాయకుల అరెస్టుని నిరసిస్తు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వాహనం ముందు బైఠాయించారు. మోహన్‌రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
* నిరసనలతో ధర్నాచౌక్ కిక్కిరిసి పోయింది. అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇరువైపులా దారిని మూసివేసి నిరసనకారులను కట్టడి చేశారు. దీక్ష చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాలుగో ఠాణాకు తరలించారు. తర్వాత ఆర్టీసీ మహిళా కార్మికులు దీక్షా శిబిరం వద్ద ధర్నాకు కూర్చున్నారు. కొద్దిసేపటికే మహిళా పోలీసులు వచ్చి వారిని బలవంతంగా వాహనం ఎక్కించి ఠాణాలకు తరలించారు. తోపులాటలో ఇద్దరూ మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
మహిళా ఉద్యోగిని అరెస్టు చేస్తున్న పోలీసులు
మా అమ్మను వదిలేయండి
ధర్నాలో పాల్గొన్న ఓ మహిళా ఆర్టీసీ కార్మికురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కార్మికురాలి కూతురు కూడా వెంట ఉంది. వాహనం వరకు వెళ్లాక.. యువతి కార్మికురాలు కాదని పోలీసు సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆ యువతి బోరున విలపించసాగింది. వాహనంలో ఎక్కించిన తన తల్లిని వదిలేయాలని ఏడ్చింది. అక్కడే ఉన్న మహిళా పోలీసు సిబ్బంది యువతిని పక్కకు తీసుకెళ్లి ఓదార్చారు.
అరెస్టుల తీరుపై ఆగ్రహం
ఆర్టీసీ ఐకాస, వామపక్షాలు, వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. మిలియన్ మార్చ్‌ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే అరెస్టులు చేశారని విమర్శించారు.
తల్లిని విడుదల చేయాలని రోదిస్తున్న యువతి
బీడీ కార్మికుల ర్యాలీ..అడ్డుకున్న పోలీసులు
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి నాయకులు, మహిళలు ర్యాలీతో వస్తుండగా వారిని అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్దకు రాగానే నాయకులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు