close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

సమస్యలతోనే కుస్తీ

వసతులు లేని నర్సింగ్‌ పాఠశాల

ఐదేళ్లుగా తాత్కాలిక భవనంలోనే..

సిబ్బంది లేక అరకొరగా చదువులు

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్‌ ప్రభుత్వ పాఠశాల సమస్యలతో కుస్తీ పడుతోంది. వైద్యకళాశాలకు అనుమతి రావడంతో గతంలో ఉన్న నర్సింగ్‌ పాఠశాల, వసతి గృహాలను కూల్చివేశారు. వైద్యకళాశాలకు కొత్తభవనాలు నిర్మించిన తర్వాత హౌజ్‌సర్జన్ల కోసం నిర్మించిన భవనంలోకి పాఠశాలను మార్చారు. గత ఐదేళ్లుగా అరకొర సౌకర్యాలతో ఈ తాత్కాలిక భవనంలోనే కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితం హౌజ్‌సర్జన్లు ఉండే గదిలో దొంగతనం జరగడంతో మళ్లీ ఈ నర్సింగ్‌ పాఠశాల కథ తెరపైకి వచ్చింది.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

మాక్లూర్‌ చౌరస్తాలో నర్సింగ్‌ పాఠశాలకు సొంత భవనం నిర్మించారు. దాదాపు భవన నిర్మాణం పనులు పూర్తయినా అందులోకి మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగరం నడిబొడ్డులో ఉండడంతో సిబ్బంది ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్తున్నారు. పాఠశాల సొంత భవనంలోకి వెళ్తే ఈ సౌకర్యం ఉండదని కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది.

ఇన్‌ఛార్జి పాలన

నర్సింగ్‌ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఇన్‌ఛార్జి పాలనలో కొనసాగుతోంది. ప్రిన్సిపల్‌ నుంచి మొదలుకొని పాఠాలు చెప్పే సిబ్బంది వరకు అందరూ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 12 మంది సిబ్బంది ఉండాలి కానీ ఒక్కరు లేరు. ఈ పరిస్థితిని చూడలేక సూపరింటెండెంట్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్‌ సిబ్బందిలో నుంచి ఏడుగురిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

విద్యార్థినులే పని చేసుకుంటున్నారు

ఈనెల 10 నుంచి నర్సింగ్‌ పాఠశాల ప్రవేశాలు ప్రారంభించనున్నారు. త్వరలో కొత్త విద్యార్థులు చేరుతారు. కొత్తగా చేరే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. చేసేదేమి లేక ప్రైవేటుగా విద్యార్థులే డబ్బులు ఇచ్చి ఇద్దరు పని మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. మరో ఇద్దరు సహాయకులు అవసరమున్నా అంత డబ్బు ఇవ్వలేక విద్యార్థినులు వంతుల వారీగా కూరగాయలు కోసి వంటకు సహకరిస్తున్నారు. ప్రతి విద్యార్థి నెలకు రూ.1200 జమ చేసి భోజనాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకుంటున్నారు. పేరుకే ప్రభుత్వ నర్సింగ్‌ పాఠశాల కానీ ఖర్చులు విద్యార్థులే భరిస్తున్నారు.

నీటికి కటకట

నర్సింగ్‌ పాఠశాల పైఅంతస్తులో 90 మంది విద్యార్థినులు ఉంటారు. నీటి కొరత ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లకు, స్నానాల గదులకు చుక్కనీరు రావడం లేదు. కొన్ని సార్లు స్నానాలు చేయడానికి సైతం నీరు లేని దుస్థితి ఏర్పడుతుందని విద్యార్థినులు చెబుతున్నారు. నీరు ఉన్నప్పుడే పనులు చేసుకోక తప్పడం లేదు. ఇక తాగునీటికి సైతం ఇబ్బందులున్నాయి. శవపరీక్ష గదికి సరఫరా చేసే పైప్‌లైన్‌ను నర్సింగ్‌పాఠశాలకు కలిపారు. శవపరీక్షకు అవసరమైన సమయంలో నీటిని సరఫరా చేసి మిగిలిన సమయంలో బోరు నిలిపివేయడంతో నర్సింగ్‌పాఠశాలకు సరిపోయినంత నీరు రావడం లేదు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ప్రతినెల ఇచ్చే ఉపకారవేతనం కూరగాయలు, బియ్యం, పప్పులు, ఉప్పులు, మంచినీరు, పని మనుషులకు ఇవ్వడానికే సరిపోతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.