పల్లె ప్రగతి స్ఫూర్తి నిరంతరం కొనసాగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లెకో ట్రాక్టరు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ వనరులున్న పంచాయతీలు కొనుగోలుకు ముందుకొచ్చినా.. చిన్న పల్లెలు విముఖత చూపిస్తున్నాయి. ధర తక్కువగా ఉండే బ్యాటరీ ట్రాక్టరు కొనుగోలు చేయాలని నిబంధనల్లో సడలింపు ఇచ్చినా నిర్వహణ భారంగా మారనుంది.
నిర్వహణ కష్టతరమే...
* జిల్లా వ్యాప్తంగా 208 పంచాయతీల్లో జనాభా తొమ్మిది వందల కంటే తక్కువగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ఆధారంగానే నిధులు విడుదల చేస్తుంటాయి.
* చిన్న పంచాయతీలకు నెలకు రూ.30 వేల నుంచి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి.
* విద్యుత్తు బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు సాధారణ పనులు చేపట్టడానికి ఇవి సరిపోవడం లేదు.
* కొనుగోలు అనంతరం వాటి నిర్వహణ, ఇంధనం సమకూర్చడం సమస్యగా మారనుందని సర్పంచులతో పాటు కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రగతి పనుల సంగతేంటి..?
* పల్లెకో ట్రాక్టరు కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. * ప్రభుత్వం విడుదల చేసే నిధులు బ్యాంకు రుణం, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకే సరిపోనున్నాయి. ఇక పల్లెల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ● నెల నెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే బ్యాంకు రుణం చెల్లింపుల ప్రక్రియ సజావుగా సాగనుంది.
పెద్ద పంచాయతీలకు అవసరమే
* ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలు బ్యాంకుల నుంచి రుణం తీసుకోకుండా వందశాతం చెల్లింపులు చేసి 42 హెచ్పీ సామర్థ్యం ట్రాక్టరు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే 15 పంచాయతీల పాలకవర్గాలు కొనుగోలుకు ముందుకొచ్చాయి.
* ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలు 50 శాతం రుణంతో 24 హెచ్పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఐదు వందల లోపు జనాభా ఉన్నవి బ్యాటరీ ట్రాక్టర్లు తీసుకోవాలని సూచించారు.
ప్రగతి దిశగా పయనించేందుకు
నరేష్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముప్పై రోజుల ప్రణాళిక చేపట్టింది. ఈ స్ఫూర్తి నిరంతరం కొనసాగించేందుకే ప్రభుత్వం పల్లెకో ట్రాక్టరు కొనుగోలు చేయాలని నిర్దేశించింది. పాలకవర్గాల అంగీకారంతో రుణం అందించడానికి బ్యాంకులు ముందుకొచ్చాయి. చిన్న పంచాయతీలు బ్యాటరీ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు.
జనాభా ఆధారంగా పంచాయతీలు
మొత్తం పంచాయతీలు : 526
500లోపు : 26
500-600 మధ్య : 62
600-700 మధ్య : 39
700-800 మధ్య : 40
800-900 మధ్య : 41
900 పైన : 318
ప్రభుత్వం విడుదల చేసిన నిధులు
సెప్టెంబరులో విడుదలైన నిధులు : రూ. 13,64,65,900
అక్టోబరులో విడుదలైన నిధులు : రూ. 13,55,77,100