close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

మాటల్లోనే ప్రయోగం

పూర్తికాని సిలబస్‌

తరుముకొస్తున్న పరీక్షలు

వేధిస్తున్న వసతులు

వరండాలోనే ప్రయోగాలు

రామారెడ్డి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 256 మంది విద్యార్థులున్నారు. ప్రయోగశాలలో  తరగతి గదులు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు వరండాలో అధ్యాపకులు ప్రయోగాలు చేయిస్తున్నారు.

ప్రయోగం.. ప్రయాస

కామారెడ్డి విద్యావిభాగం: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 98 మంది విద్యార్థులున్నారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలలో తెలుగు, ఉర్దూ మాధ్యమ థియరీ తరగతుల నిర్వహణ నిర్దిష్ట గడువులోగా పాఠ్యాంశాల బోధనకు కష్టతరమవుతోంది.

ప్రయోగాలతో విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకోవచ్ఛు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. అంతేకాక నూతన ఆవిష్కరణలకు అవి దోహదం చేస్తాయి. విద్యాశాఖ ఇంటర్‌ స్థాయి నుంచి సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగాలకు మార్కులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగశాలలకు గదులు, రసాయనాలు, సామగ్రి కొరత అధ్యాపకులు, విద్యార్థులను వేధిస్తోంది. పరికరాలు లేక తరగతులు బోధించక ప్రయోగ పాఠాలను మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏటా ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం సిలబస్‌ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

అతిథి అధ్యాపకులతో బోధన

లింగంపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 329 మంది విద్యార్థులున్నారు. కళాశాలలో భౌతిక శాస్త్రానికి అధ్యాపకుడు లేక అతిథి అధ్యాపకురాలితో బోధన చేపడుతున్నారు.

విడతల వారీగా...

బాన్సువాడ: పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో 200ల మందికి పైగా విద్యార్థులున్నారు. శిథిలావస్థకు చేరిన గదులు కూల్చివేశారు. ఉర్దూ, తెలుగు మాధ్యమ తరగతులు విడతల(షిఫ్టింగ్‌) వారీగా నిర్వహిస్తున్నారు. తరగతి గదుల్లోనే ప్రయోగాలు చేయించాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

నిజామాబాద్‌ 15

కామారెడ్డి 16
ప్రయోగశాలల్లో అన్ని వసతులు

ఉమ్మడి జిల్లాలో సైన్స్‌ విద్యార్థులకు సరిపడా ప్రయోగశాలలున్నాయి. గతేడాది వాటికి సంబంధించిన నిధులు వచ్చాయి. రసాయనాలు అందుబాటులో ఉంచాం. దాదాపు 75శాతం ప్రయోగ తరగతులు పూర్తయ్యాయి. సెలవుల కారణంగా కొంత ఆలస్యమైన ప్రయోగ పరీక్షల కంటే ముందే పూర్తి చేయాలని అధ్యాపకులకు సూచించాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- దాసరి ఒడ్డెన్న, డీఐఈవో

ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు

మొదటి సంవత్సరం : 10,356

రెండో సంవత్సరం : 11,444

ప్రదర్శనకే పరిమితం

దోమకొండ: మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో 91 మంది విద్యార్థులున్నారు తరగతి గదుల్లోనే ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఆమ్లాల కొరత కారణంగా రసాయన శాస్త్రంలో ప్రయోగాలే ఆరంభించలేదు. వృక్షశాస్త్రానికి సంబంధించి సామగ్రి కొరత ఉంది.

ఒక గది నాలుగు విభాగాలుగా..

తాడ్వాయి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 200ల మందికి పైగా విద్యార్థులున్నారు. ప్రయోగ పరికరాలకు స్థలం అందుబాటులో ఉన్నా గదులు లేవు. ఒక గదిని నాలుగు విభాగాలుగా (ప్రయోగశాల, తరగతి గది, సామగ్రి నిల్వ ) చేశారు. విధి లేక ఆరుబయట తాత్కాలిక బల్లలు ఏర్పాటు చేసి ప్రయోగాలు చేయిస్తున్నారు.

ప్రయోగం అంటే ఏంటో తెలియదు

మద్నూర్‌: మద్నూర్‌ మండల కేంద్రంలోని కళాశాలలో 174 మంది విద్యార్థులున్నారు. ప్రయోగాలు చేయించలేదు. విద్యార్థులకు ప్రయోగాలు అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది. కేవలం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ప్రయోగాలు చేయిస్తున్నారు.

కాలం చెల్లిన రసాయనాలు

మీన, బైపీసీ, ద్వితీయ సంవత్సరం, పిట్లం

పిట్లం: ప్రయోగాలకు సంబంధించి అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. కొన్ని రసాయనాలు కాలం చెల్లాయి. చర్యలు సరిగ్గా చూపించడం లేదు.

విద్యుత్తు, నీటి సౌకర్యం లేదు

ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 222 మంది విద్యార్థులున్నారు. గదులు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యుత్తు, నీటి సౌకర్యం లేదు. పెచ్చులు పడటంతో వస్తువులు ధ్వంసమయ్యాయి.

ఒకే గదిలో రెండు

బిచ్కుంద: బిచ్కుందలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 277 మంది విద్యార్థులున్నారు. వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రానికి సంబంధించిన ప్రయోగశాలలు ఇరుకు గదిలో, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం ప్రయోగశాలలు ఒక గదిలోనే ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

విద్యార్థులెక్కువ గదులు తక్కువ

ఆర్మూర్‌ పట్టణం: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో 452 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్యానుగుణంగా గదులు లేవు. తరగతి గదిలోనే ప్రయోగాలు చేయిస్తున్నారు.

షాదీఖానాలోనే

కోటగిరి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 190 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు షాదీఖానాలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రయోగ శాలలకు ప్రత్యేక గదులు లేకపోవడంతో తరగతి గదులలోనే కొనసాగిస్తున్నారు.

తరగతులే నిర్వహణ

నిత్విక, బైపీసీ, ప్రథమ సంవత్సరం, బాన్సువాడ

బాన్సువాడ: ఇప్పటి వరకు ప్రయోగం చేయించలేదు. ప్రస్తుతానికి తరగతులే నిర్వహిస్తున్నారు. వృక్షశాస్త్రం అధ్యాపకురాలు అనారోగ్యంతో రాకపోవడంతో ఇతర అధ్యాపకుడితో చెప్పిస్తున్నారు.

ఇక్కడ చాలా తక్కువ

కళాశాల సబ్జెక్టు పూర్తి అయిన సిలబస్‌ (శాతాల్లో)

కో-ఎడ్యుకేషన్‌ కళాశాల(ఆర్మూర్‌) జంతుశాస్త్రం 00

కో-ఎడ్యుకేషన్‌ కళాశాల(ఆర్మూర్‌) వృక్షశాస్త్రం 30

బాలికల కళాశాల(ఆర్మూర్‌) జంతు, వృక్ష శాస్త్రం 40

బాలుర కళాశాల(బాన్సువాడ) వృక్ష శాస్త్రం 00

బాలుర కళాశాల(బాన్సువాడ) భౌతిక, రసాయన శాస్త్రం 40

జూనియర్‌ కళాశాల(దోమకొండ) రసాయన శాస్త్రం 3

జూనియర్‌ కళాశాల(దోమకొండ) భౌతిక శాస్త్రం 25

జూనియర్‌ కళాశాల(లింగంపేట) రసాయన శాస్త్రం 43

జూనియర్‌ కళాశాల(రామారెడ్డి) రసాయనశాస్త్రం 10

జూనియర్‌ కళాశాల(రామారెడ్డి) జంతుశాస్త్రం 30

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.