close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నాణ్యత గాలికి నిధులు జేబుకి

నాసిరకంగా రహదారుల మరమ్మతులు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే

చిన్నకడబూరు వద్ద వారానికే లేచిపోయిన ప్యాచ్‌ పనులు

పది కాలాల పాటు పటిష్టంగా ఉండాల్సిన రహదారులు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. భారీ గోతులతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండుమూడు ప్రమాదాలు కేవలం గోతుల కారణంగానే చోటుచేసుకుని, ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం, పనులు చేపట్టడంతో అందరూ సంతోషించారు. ఈ ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవని దుస్థితి నెలకొంది. గోతులు పడిన చోట, తారు లేచిన ప్రాంతాల్లో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. గొయ్యి తీసి.. శుభ్రం చేసి కంకర, తారు వేసి రోలింగ్‌ చేస్తే కొంత కాలం మన్నిక ఉంటుంది. ఇవేమీ చేయకుండా గోతుల్లో పైపూతగా తారు వేసి పనులు చేస్తుండడంతో వారం పదిరోజులకే సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి.

రహదారుల మరమ్మతుల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చిస్తోంది. దానిలో భాగంగా ఈ ఏడాది ఆదోని డివిజన్‌ పరిధిలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని తాలుకాల పరిధిలోని రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల్లో సాధారణ మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం రూ.4.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అధికారులు రహదారులకు ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించాల్సి ఉంది. రహదారుల్లో ఏర్పడిన గోతులను పూడ్చడం, అధిక వర్షాలతో కోతకు గురైన రహదారులకు మట్టికట్టలు వేయడం, వంతెనల వద్ద గోడలకు సున్నం వేయడం, వేగ నిరోధకాలు ఏర్పాటు చేయడం, కిలోమీటరు రాళ్లు, సూచికలు ఏర్పాటు చేయాలి. సింగిల్‌ రోడ్డుకు కిలోమీటరుకు రూ.40 వేలు, డబుల్‌ రోడ్డుకు రూ.50 వేల చొప్పున నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.

నిబంధనలు గాలికి

పనులు నాణ్యంగా చేయాల్సిన గుత్తేదారులు పనులకు పాతర వేస్తున్నారు. నాసిరకంగా వేస్తూ సొమ్ముతో జేబులు నింపుకొంటున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపంతో వారం రోజులు తిరగకుండానే ప్యాచ్‌లు లేచిపోతున్నాయి. మరమ్మతు చేసేటప్పుడు దీర్ఘ చతురస్రాకారంలో గొయ్యి తీయాలి. దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేయాలి. డస్ట్‌తో కూడిన కంకర వేయాలి. కొన్నిచోట్ల మట్టి, కంకర వేయకుండా వాడడంతో రహదారులు పాడవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పెద్దకడబూరు మండలంలోని ఆదోని బైచిగేరి క్రాస్‌ రహదారి నుంచి చిన్నతుంబళం వరకు ప్యాచ్‌ పనులు చేస్తున్నారు. చిన్నకడబూరు వద్ద చేసిన పనులు వారం రోజులు తిరగకుండానే లేచిపోయాయి. కనీసం నెల రోజులు కూడా గడవకనే ప్యాచ్‌లు లేచిపోతే ఎలా అంటూ ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరుకు వెళ్లే రహదారిలో ప్యాచ్‌లు లేచిపోయాయి. ఎమ్మిగనూరు నుంచి కోసిగికి వెళ్లే రహదారిలో మాలపల్లి వద్ద పనులు నాసిరకంగా జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదోని నుంచి మాధవరం వెళ్లే రహదారిలో చేసిన మరమ్మతు పనులు నాసిరకంగా ఉన్నాయంటూ స్థానికులు వాపోతున్నారు.

పనులు నాణ్యతగా చేపట్టాలి

- వెంకటేశ్లరు, ఆటో డ్రైవర్‌, పెద్దకడబూరు

రహదారుల్లో ప్యాచ్‌ పనులు నాణ్యతగా చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఆదోని వద్ద బైచిగేరి క్రాస్‌ రోడ్డు నుంచి కల్లుకుంట వరకు పనులు జరుగుతున్నాయి. చిన్నకడబూరు వద్ద చేసిన పనులు వారం రోజులు తిరగకుండానే పాడయ్యాయి. పనులు నాణ్యతగా చేపట్టాలి.

నాణ్యంగా జరిగేలా చూస్తాం

- శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ, ఆదోని

ఆదోని డివిజన్‌లోని రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులకు సంవత్సర సాధారణ మరమ్మతులకు రూ.4.20 కోట్లతో పనులు చేపట్టాం. రాష్ట్ర పరిధిలో 340 కిలోమీటర్లు, జిల్లా, గ్రామీణ పరిధిలో 875 కిలోమీటర్ల పనులను పూర్తిచేయాలి. ఆగస్టు నుంచి పనులు మొదలు పెట్టాం. ఫిబ్రవరి ఆఖరులోగా నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.

ఆదోని డివిజన్‌లో చేపట్టిన పనులు, మంజూరైన నిధులు

పనులు -          కిలోమీటర్లు     - నిధులు

రాష్ట్ర రహదారులు - 340 కి.మీ. - రూ.1.20 కోట్లు

జిల్లా, గ్రామీణ రహదారులు - 875 కి.మీ. - రూ.3 కోట్లు

రాష్ట్ర రహదారులు

ఆదోని - మాధవరం

కోడుమూరు - ఆలూరు

గుత్తి - ఆదోని

గుంతకల్లు - ఆలూరు

మద్దికెర - పత్తికొండ

ఎమ్మిగనూరు - నాగులదిన్నె

ఆలూరు - హొళగుంద

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.