close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

పర్యవేక్షణ మెరుగుబడి..

 నిత్య తనిఖీలకు డీఈవో శ్రీకారం
 హాజరు, చదువుల్లో విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై గతం కంటే భిన్నంగా పర్యవేక్షణ పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో పాఠశాలల తనిఖీలు కరవైన తరుణంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా విద్యాశాఖ వాటికి తెరతీసింది. ఇది వరకు డీఈవోగా పనిచేసిన వెంకటేశ్వర్లు గత జులై నెలలో పాఠశాలలను నిత్యం సందర్శించడంతో ఒక పాఠశాలలో ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురుని సెస్పెండ్‌ చేయగా, మరో పాఠశాలలో ఒక టీచర్‌కు మెమోను జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం కొత్తగా వచ్చిన డీఈవో దుర్గాప్రసాద్‌ ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించడం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు.

జిల్లాలో 654 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 2995 మంది ఉపాధ్యాయులుండగా, దాదాపు 40వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇవిపోనూ 12 కేజీబీవీలు, 11 ఆదర్శ పాఠశాలలున్నాయి. అయితే జిల్లాలోని సర్కారు బడులపై కొన్నేళ్లుగా పర్యవేక్షణ లేకుండా పోయింది. నిత్యం పాఠశాలలను క్షేత్ర స్థాయిలోని ఎంఈవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు చేయాల్సి ఉన్నా పలు కారణాలతో విస్మరించారు. ఫలితంగా సర్కారు బడుల్లో సమయపాలన కొరవడింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జులైలో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలల తనిఖీలను చేపట్టాలని నిర్ణయించింది. అప్పటి డీఈవో వెంకటేశ్వర్లు మూడు నాలుగు పాఠశాలలను సందర్శించగా, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయగా, మరొకరికి మెమో జారీ చేశారు. పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ కూడా ఎలగందల్‌లోని పాఠశాలను తనిఖీ చేశారు. నిత్యం ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలని రాష్ట్ర విద్యా శాఖ అదే నెలలో ఆదేశించారు. ఇంఛార్జీలుగా ఉన్న ఎంఈవోలు మొదట్లో తనిఖీల పేరుతో హడావుడి చేసినా వివిధ కారాణలతో కొద్దిరోజులకే వదిలేశారు.

నిత్య తనిఖీలకు డీఈవో శ్రీకారం
గత నెలలో డీఈవోగా వచ్చిన దుర్గాప్రసాద్‌ నిత్యం పాఠశాలలను తనిఖీ చేయడం నిత్య కృత్యంగా ఎంచుకున్నారు. నిత్యం కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలను నాలుగైదింటిని సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగడం జిల్లాలో కొన్నేళ్ల కాలంలో ఇదే ప్రథమం. ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన ప్రార్థనను రాగœ, భావయుక్తంగా విద్యార్థులు ఆలపించేలా చేస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులతో సంభాషిస్తూ వారు ఉత్తమ ఫలితాలను సాధించేలా వారిని, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలిస్తున్నారు. సర్కారు బడుల్లో సమయపాలన పెరుగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెంపుపై ఉపాధ్యాయులు దృష్టి నిలుపుతున్నారు. మొత్తానికి పాఠశాల సందర్శనకు డీఈవో ఏ సమయంలోనైనా రావచ్చనే భావన నేడు జిల్లాలోని పాఠశాలల్లో నెలకొంది.

ప్రై‘వేటు’పై దృష్టి సారించాలి
జిల్లాలో 270 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిపై పర్యవేక్షణ నామమాత్రమే. నిబంధనలను అతిక్రమించడం, రుసుంల బాదుడు, సౌకర్యాల లేమి వంటి సమస్యలు మెజారిటీ పాఠశాలల్లో నెలకొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా అందులో ముఖ్యంగా కరీంనగర్‌లో ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొందరు ఎంఈవోలు, డీఈవో కార్యాలయం వారి కనుసన్నల్లో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలు కొన్ని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు డీఈవో, క్షేత్రస్థాయిలోని ఎంఈవోలు ప్రైవేటు పాఠశాలలను తనిఖీలు చేపడితే విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనంగా నిలువనుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

హాజరు శాతం పెంచేందుకు..
-డీఈవో ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచేందుకు వాటిని నిత్యం అకస్మికంగా సందర్శిస్తున్నాను. హాజరుశాతం పెరిగితే బోధన తీరు మెరుగుపడి చదువుల్లో బాలల సామర్థ్యాలు పెరుగుతాయి. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ ప్రోత్సహిస్తున్నాను. కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లోనూ సామర్థ్యాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేలా చర్యలు తీసుకోబోతున్నాం.

ప్రాథమిక పాఠశాలలపై ఓ కన్నేయాలి..
* జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిన కారణంగా మెజారిటీ బడుల నిర్వహణ లోపభూయిష్టంగా నిలుస్తోందన్న ఆరోపణలున్నాయి.
* డీఈవో దుర్గాప్రసాద్‌ ఒకటి రెండు పాఠశాలలను తనిఖీ చేశారే తప్ప వాటిని దృష్టి నిలపలేదు. జిల్లాలో 77 ప్రాథమికోన్నత, 423 ప్రాథమిక పాఠశాలలున్నాయి. డీఈవో వీటిని సందర్శించి లోపాలను సరిదిద్దితే ప్రాథమిక విద్య మరింత బలోపేతం కానుంది.
* ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం సమయపాలన పాటించడం లేదు, సాయంత్రం పాఠశాల ముగింపు సమయానికి 15 ని.ల ముందుగానే చాలా బడులకు తాళం వేస్తున్నారు.
* అయిదు తరగతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఉండటంతో బాలలు చదువుల్లో సామర్థ్యాలకు దూరమవుతున్నారు.
* కొన్ని పాఠశాలలకు వంతుల వారీగా ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఉపాధ్యాయుల్లోనే ఉన్నాయి. కొందరు బడులను వదిలి ఎంఈవోలకు సహాయకులుగా అనధికారికంగా వ్యవహరిస్తున్నారు.
* పలు పాఠశాలల్లో బోధన అనుభవం కోసం వచ్చే ఛాత్రోపాధ్యాయులపైనే మొత్తం బోధన భారాన్ని వేసి ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు.
* కృత్యాధార బోధన, ఆట, పాటల ద్వారా బోధనకు అవసరమైన పరికరాలు కరవై బాలలకు ఆకర్షించేలా విద్యాబోధన జరగడం లేదు.
* తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, మధ్యాహ్న భోజనం అమలులో లోపాలు, పలు సదుపాయాల లేమి నెలకొంటోంది.
* అయిదు తరగతులకు ఒకరిద్దరే ఉపాధ్యాయులుండగా, బోధనేతర పనుల భారం బాలల చదువులపై ప్రభావం చూపుతోంది.
* ఉన్నత పాఠశాలల్లోనూ తరగది గదులు, ఉపాధ్యాయులు, సదుపాయాల కొరత, మరమ్మతులకు నిధుల లేమి, వంట గదుల కొరత, మరుగుదొడ్ల అవస్థలు వంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.