close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

సొంత విత్తు... లాభాలు మనసొత్తు

 జిల్లాలో పెరుగుతున్న ప్రాచూర్యం
 రైతు విత్తనం వాడితే రూ.30 కోట్లు ఆదా

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: అసలైన విత్తనమే మేలైన పంట దిగుబడికి సోపానంగా ఉంటుంది... కల్తీలు, నకిలీలు ఓవైపు అన్నదాతలను వేధిస్తుండగా సూటిరకాల్లోనూ సొంత విత్తనం వాడుకోలేని అశక్తతను జగిత్యాల జిల్లా రైతాంగం వీడుతుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుత రబీ పంటకాలంలో రైతువిత్తనం వాడకం, విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో జిల్లాలోని కర్షకులకు రూ.కోట్లల్లో కలిగే ప్రయోజనాన్ని పరికించినట్లయితే.

జిల్లాలో ఖరీఫ్‌లో 90 వేల హెక్టార్లలో వరిపంటను రైతులు సాగుచేయగా ప్రస్తుత రబీలోనూ 54,725 హెక్టార్లలో పండిస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రతి హెక్టారుకు రూ. 2 వేల నుంచి రూ. 4,500 వరకు ప్రైవేటు కంపెనీల విత్తనాలకు వెచ్చించాల్సి ఉండగా వరి పండించే రైతుల్లో సగానికిపైగా రైతులు రైతువిత్తనాన్ని వాడుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక పంటకు కనీసం రూ.10 కోట్ల వరకు విత్తన ఆదా చొప్పున సాధారణ పరిస్థితుల్లో రైతులకు రూ.20 కోట్లవరకు మిగలనుంది. ప్రస్తుతం ఖరీఫ్‌లో పండించిన వరిధాన్యం నుంచి విత్తన గింజలను తీసుకుని రైతులు రబీలో తమ పంటనే రైతువిత్తనంగా వాడుకునే వీలుంది.
* రైతు విత్తనాన్ని వాడుకున్నపుడు కల్తీ, నకిలీల బెడద ఏమాత్రం ఉండదు. మన నేలల్లోనే పండించిన పంటకాబట్టి స్థిరమైన దిగుబడికి అవకాశం ఉంటుంది. విత్తనఖర్చు తగ్గడంతో పాటుగా తోటి రైతులకు విత్తనాన్ని విక్రయించి అధిక ఆదాయం పొందవచ్చు. పొలంపై కల్తీకర్రలు, బెరకు కర్రలను తీసివేస్తూ వేరుగా నూర్పిడి చేసుకోవటం ద్వారా ఎన్ని పంటలకయినా సూటిరకం విత్తనాన్ని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. వరితో పాటుగా ఇతర పంటల్లోనూ సొంతవిత్తు లాభాల సొత్తుగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొనడాన్ని రైతులందరూ పరిగణలోకి తీసుకోవాలి.

* జిల్లాలో ..జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌ గ్రామ రైతులు సంఘంగా ఏర్పడి తమ గ్రామంలోని వరి పంటను విత్తనంగా విక్రయిస్తుండగా ఇదే ఒరవడిని చాలాగ్రామాలు అనుసరిస్తున్నాయి. సంఘాలే కాకుండా రైతులు వ్యక్తిగతంగానూ రైతువిత్తనాన్ని వాడుతుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుత రబీలోనూ రైతు విత్తనంతో పాటుగా విత్తనోత్పత్తికి పెద్దఎత్తున అవకాశం ఉండటంతో రైతులు ఈ దిశగా సాగురీతులను మార్చుకోవాల్సి ఉంటుంది.

వరి, నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటిరకాల్లో ప్రతిపంటకు రైతులు నూతనంగా విత్తనాన్ని కొనాలన్న ఆలోచనను మార్చాలనే ఉద్దేశంతో 2017 ఏప్రిల్‌లో అధికారులు ‘మన ధాన్యం - మన విత్తనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో రైతు విత్తనాన్ని వాడాలంటూ అధికారులు రైతుల్లోకి తీసుకెళ్లడంతో సొంతవిత్తనం వాడాలనే రైతుల సంఖ్య ప్రతి సీజన్‌కు గణనీయంగా పెరుగుతోంది.

లాభం, నమ్మకమైన విత్తనోత్పత్తి: డి.అశోక్‌కుమార్‌, విశ్రాంత డీడీఏ
రైతు పండించిన విత్తనాన్నే అందమైన సంచుల్లోనింపి రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ఒక రైతు ఒక ఎకరంలో సొంత వరి విత్తనాన్ని వాడుకుంటే కనీసం రూ.400 మిగులుతుంది. విలువైన తమ పంటను పూర్తిగా మార్కెట్‌లో అమ్మకుండా సొంతవిత్తనంగా వాడుకోవచ్చు. పప్పుదినుసులు, నూనెగింజలు తదితర పంటల్లో జిల్లాలో రైతువిత్తనం వాడుకుంటే సాలీనా రెండుపంటల్లోనూ రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుంది. పైగా కల్తీలు, బెరుకులు, నకిలీల బెడద తప్పడమే కాకుండా నమ్మకమైన విత్తనం లభించి దిగుబడి స్థిరంగా వస్తుంది.

రైతు పండించిన ప్రతిగింజా విత్తనమే
- డాక్టర్‌ సీహెచ్‌.దామోదర్‌రాజు, వరి ప్రధాన శాస్త్రవేత్త
మక్క, కూరగాయలు, పత్తి తదితరాల్లో ఆడ, మగ వరుసల్లో గింజలు వేసి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఈ సంకరాలను ప్రతిపంటకూ తీసుకోవాలి. కానీ వరి, నువ్వులు, పెసర, మినుము, తదితర పంటల సూటిరకాల్లో రైతులు పండించిన ప్రతిగింజ విత్తనంగా ఉపయోగపడుతుంది. రైతులు హైబ్రిడ్స్‌ (సంకరాలు), సూటిరకాల మధ్యనగల ఈ చిన్న తేడాను గమనిస్తే తామే అన్ని పంటల్లోనూ విత్తనాలను ఉత్పత్తి చేసుకోగలుగుతారు. చిన్నశిక్షణతోనే విత్తనోత్పత్తి సాధ్యపడుతుంది, జగిత్యాల, కూనారం, రాజేంద్రనగర్‌ వరిరకాలు పెద్దఎత్తున రైతుల క్షేత్రాల్లో విత్తనంగా పండిస్తున్నారు.

మరిన్ని వార్తలు

బోడగూడెం ముస్తాబు

అది ఓ మారుమూల పల్లె..చుట్టూ దట్టమైన అడవులు..నిన్నటి వరకు అటువైపు ఏ అధికారి వెళ్లలేదు..వారి ఆలనా పాలనా చూడలే..కాని ఆ గూడాన్ని ఇప్పుడు ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ సందర్శించనున్నారు. దీంతో ఉన్నంతలోనే బతుకులు సాగిస్తున్న ఆ గిరిజన పల్లె సందడిగా మారింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గిరిజనుల సమస్యలు, వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు గ్రామం ఎంపిక కావడంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు ఒకరి వెనుక ఒకరు వచ్చి గిరిజనుల జీవన విధానాలు తెలుసుకుంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయతీలోని బోడగూడెం గవర్నర్‌ రాక కోసం ముస్తాబవుతోంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.