close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

మన్యానికి మార్గదర్శనం చేయండి

విద్యా, వైద్య శాఖలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

యువతకు ఉపాధి కల్పించడంలో చొరవ కరవు

భద్రాచలం, న్యూస్‌టుడే


నేడు పర్యటించనున్న మంత్రి సత్యవతి రాఠోడ్‌

ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఐటీడీఏ ఇంజినీరింగ్‌ పనులు మన్యంలో నత్తనడకన సాగుతున్నాయి. ఐటీడీఏకు ఉప ప్రణాళిక ద్వారా వచ్చే లెక్కలను ప్రకటించాలి. మన్యం కేంద్రమైన భద్రాచలం అభివృద్ధికి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని పురపాలక సంఘంగానో.. గ్రామ పంచాయతీగానో ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ బుధవారం మన్యంలో పర్యటించనున్నారు. ఐటీడీఏలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో గిరిజనులు మన్యంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

గొత్తికోయల గోడు పట్టించుకోరూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీలు 6.56 లక్షలు. వీరు కాకుండా గొత్తికోయలుగా పిలిచే వలస ఆదివాసీలు ఐటీడీఏ పరిధిలో 20 వేల మంది ఉన్నారు. చాలాకాలం కిందట ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చారు. చర్లలోనే సుమారు 6 వేల మంది జీవిస్తున్నారు. పాల్వంచ, ములకలపల్లి, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాల్లోనూ నివాసాలు ఉన్నాయి. వీరికి మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం గిరిజన ఆవాసాలకు విద్యుత్తు సదుపాయం కల్పిస్తుండగా గొత్తికోయ ఆవాసాల ఊసేలేదు. దీనిపై స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ మించి గిరిజన తెగలు అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడును సాగు చేస్తున్నప్పటికీ వేల ఎకరాలకు పట్టాలు లేవని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు సరైన ఆదేశాలను ఇవ్వాలి.

వ్యాధుల ముప్పేట దాడి

మన్యంలో పోషకాహార సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఐటీడీఏలోని పోషకాహార కేంద్రాన్ని నిధుల లేమితో మూసేశారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒక విభాగాన్ని ఈ తరహా చికిత్సకు కేటాయించినప్పటికీ గ్రామీణ స్థాయి నుంచి బాధితులు అంతగా రావడం లేదు. వైద్యశాఖలోని కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, మలేరియా ప్రోగ్రాం అధికారి పోస్టులను వేర్వేరు విభాగాల వైద్యులు పర్యవేక్షించాల్సి వస్తోంది. భద్రాచలంలో పీహెచ్‌సీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్య విధాన పరిషత్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు పెంచినప్పటికీ సరిపడా వైద్యులను నియమించలేదు. సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈసారి జ్వరాలు ముప్పేట దాడి చేశాయి. లక్ష దోమ తెరలు కావాలని కోరినప్పటికీ రాలేదు.

ప్రత్యేక డీఎస్సీ ఏమైంది

జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి పోస్టు చాలాకాలంగా ఖాళీగా ఉంది. ఏటీడీవో జహీరుద్దీన్‌ ఈ బాధ్యతలను చూస్తున్నారు. పని భారంగా ఉండటంతో ఇటీవల ఏటీడీవోగా ఓ సీనియర్‌ ఉపాధ్యాయుణ్ని నియమించినప్పటికీ ఆయన ఉద్యోగ విరమణ చేయడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. కొన్ని ఆశ్రమాలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారని అంతా ఆశించినప్పటికీ గిరిజన సంక్షేమశాఖ స్పందించలేదు. మౌలిక సదుపాయాలు లేవన్న కారణంతో కొన్ని విద్యాలయాలను మూసే పరిస్థితి వచ్చింది. ఐటీడీఏ కేంద్రం ఉన్న ఇక్కడ రెండు ఆశ్రమాలు ఉన్నప్పటికీ పదో తరగతి ప్రవేశాలు లేకపోవడం విడ్డూరం. 212 మంది సీఆర్టీలను నియమించాలని భావించినప్పటికీ కొంత కోత పెట్టారు. సీఆర్టీ అభ్యర్థులు న్యాయపోరాటం సాగిస్తున్నారు. 305 విద్యాలయాల్లో 25 వేల మంది చదువుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరతను తీర్చడం లేదు. మన్యం చట్టాల ప్రకారం ప్రత్యేక డీఎస్సీని ప్రకటించి కనీసం 242 మందిని నియమించాలనే వాదనలున్నాయి. నిర్వహణకు నిధుల కొరత పట్టి పీడిస్తోంది. పొరుగు సేవలను అందించేవారికి సకాలంలో వేతనాలు అందడం లేదు. గురుకులాలపైనా దృష్టి సారించాలి.

ఉపాధి మార్గాలను పెంచితే మేలు

ఇక్కడి ఉపాధి కల్పనా కార్యాలయం నిరుద్యోగుల లెక్కలు చెప్పడానికే పరిమితమైంది. ప్రీ ఎగ్జామినేషన్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. భవిత విభాగం ద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించేందుకు చొరవ అవసరం. రెండు వైటీసీలు ఉన్నందున వాటిని పూర్తిగా ఉపయోగించాలి. ఐటీసీ, భారజలం, నవభారత్‌, సింగరేణి వంటి సంస్థల్లో గిరిజనులకు ఏ మేరకు ఉపాధి కల్పిస్తున్నారో ప్రకటించాలి. గుత్తేదారు హక్కులు గిరిజన యువతకు కల్పించగలిగితే బాగుంటుందని పలువురు అంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.