శనివారం, డిసెంబర్ 07, 2019
నేత్రావధానంతో గుర్తింపు పొందిన శిరీష ఆత్మహత్య
విశ్వానాథపురం చేరుకున్న శిరీష మృతదేహం
కల్లూరు(పెనుబల్లి), న్యూస్టుడే: ఆ విద్యార్థి రెండు కళ్లు మాట్లాడేవి.. తన నేత్రావధానం కళతోనే జాతీయస్థాయిలో గుర్తింపునూ పొందింది. తన విద్యతో మారుమూల ఉన్న స్వగ్రామానికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పలువురి ప్రసంశలనూ అందుకుంది. ఆ బంగారుతల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో... ఎవ్వరికి చెప్పకుండానే మనసులోని భావాలను కళ్లతో వ్యక్తం చేయకుండానే.. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమే కల్లూరు మండలం విశ్వనాథపురానికి చెందిన శిరీష. హైదరాబాద్లో బీటెక్ చదువుతూ సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతదేహానికి హైదరాబాద్లో శవ పంచనామా అనంతరం స్వగ్రామానికి మంగళవారం రాత్రి తీసుకురావటంతో గ్రామంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరుతో చూపరుల కంటా కన్నీటి సుడులు తిరిగాయి. శిరీష తండ్రి రెండు నెలలు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లికి అన్నీ తానై ఉండాల్సిన శిరీష ఆత్మహత్యతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చే ధైర్యం ఎవరీకి రాలేదు.
శిరీష నేత్రావధానంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిభ చూపింది. పలు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఎవ్వరికీ సాధ్యం కాని కళను సొంతం చేసుకొని హైదరాబాద్ రవీంద్రభారతి, బెంగళూరు, చెన్నైలతో పాటు పలు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చిన శిరీష ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు