close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

పామాయిల్‌ పరిశ్రమలకు వరాల జల్లు

అప్పారావుపేట పరిశ్రమ సామర్థ్యం రోజుకు 720 నుంచి 1200 టన్నులకు పెంపు!

అప్పారావుపేటకు రూ.4.50 కోట్లు

అశ్వారావుపేటకు రూ. కోటి మంజూరు

అశ్వారావుపేట, న్యూస్‌టుడే

అప్పారావుపేట పామాయిల్‌  పరిశ్రమ

తెలంగాణ పామాయిల్‌ పరిశ్రమలకు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి వరాల జల్లు ప్రకటించారు. దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమ విస్తరణకు రూ.4.50 కోట్లు, అశ్వారావుపేట పరిశ్రమకు మౌలిక వసుతుల కల్పనకు రూ.కోటి, పాండురంగాపురం గెలల సేకరణ కేంద్రానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మేరకు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ బోర్డు తీర్మానించిందని వివరించారు. అశ్వారావుపేట ఆయిల్‌పాం ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమను గతంలోనే గంటకు 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యంతో రూపొందించగా ప్రస్తుతం గంటకు 30 టన్నుల సామర్థ్యంతోనే పనిచేస్తోందని తెలిపారు. దీనిని వచ్చే ఏడాది నుంచి గంటకు 50 టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు, అందుకు అవసరమైన స్వల్ప మార్పుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తూ ఆయిల్‌ఫెడ్‌ బోర్డు తీర్మానించిందన్నారు. వచ్చే ఏడాది ఆఖరు నుంచి గంటకు 50 టన్నుల క్రషింగ్‌ అంటే రోజుకు 1200 టన్నుల ఆయిల్‌పాం గెలలు క్రషింగ్‌ చేసేలా సామర్థ్యం పెంచేందుకు వీలుగా పరికరాలు అమర్చేందుకు రూ. 4.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 16వేల హెక్టార్లలో ఆయిల్‌పాం విస్తరణ ఉండగా అందులో 15వేల హెక్టార్లు ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోనే ఉందని పేర్కొన్నారు. గెలలు వచ్చే తోటలు వచ్చే ఏడాది మరింతగా పెరుగుతాయని, పరిశ్రమలకు వచ్చే గెలలూ పెరగనున్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. అలాగే అశ్వారావుపేట పామాయిల్‌ పరిశ్రమ ప్రధాన గేటు నుంచి పరిశ్రమ వరకూ సుమారు కిలోమీటరు దూరం రెండు పొరలు (డబుల్‌ సీసీ) సిమెంటు రోడ్డు వేసేందుకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు గతంలో రైతులు చేసిన సూచన మేరకు పాండురంగాపురం గెలల సేకరణ కేంద్రం వద్ద ప్లాట్‌ఫారం నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. వీటన్నింటికీ కొద్దిరోజుల్లో టెండర్లు పిలవనున్నామని, వచ్చే ఏడాదికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. 2018-19 సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం 2.30 లక్షల టన్నుల గెలల సేకరణ లక్ష్యం కాగా 2 లక్షల టన్నుల పైగా వచ్చిందని చెప్పారు. ఇందుకు సహకరించిన రైతులు, ఆయిల్‌ఫెడ్‌ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.


ఈ వారంలో ఆయిల్‌పాం నూతన ఫార్ములా నిర్దేశించనున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం నూనె రికవరీ శాతం ఆధారంగా 19.84 ఫార్ములా చొప్పున లెక్కకట్టి రైతులకు చెల్లింపులు చేస్తున్నామని దీనికి తక్కువ కాకుండా ఇచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. వారంలో రైతు కమిటీ, బోర్డు ఉన్నతాధికారులు ఫార్ములా తేల్చనున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట దమ్మపేట జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, డివిజనల్‌ మేనేజర్‌ ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.