close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

భద్రాద్రి రామయ్యకు కల్యాణోత్సవం

ఆలయాన్ని దర్శించుకున్న  విశ్వప్రియతీర్థస్వామి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తింది. రఘుకుల తిలకుడి నిత్య కల్యాణ మహోత్సవం పరమానందభరితులను చేసింది. సీతమ్మకు యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీత ధారణ కొనసాగించారు. మాంగళ్యధారణ కనులకు పండుగ చేసింది. తలంబ్రాల వేడుకను నిర్వహించారు. దర్బారు సేవలో సీతారామలక్ష్మణుల వైభవం మరింత పెరిగింది. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చనలు నిర్వహించారు. భక్తులు జైశ్రీరామ్‌ జైహనుమాన్‌ అంటూ నీరాజనాలు పలికి సిందూర బొట్టును నుదుట ధరించారు. హనుమాన్‌ చాలీసాను పఠించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉదయం 3.30 గంటల నుంచి భక్తుల సందడి కనిపించింది. ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. పవళింపు సేవ లేదు. వరంగల్‌కు చెందిన భక్తులు ఆలయాన్ని దర్శించుకుని శ్రీకృష్ణారావు పేరిట రూ.1,00,116 విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. ఈ మొత్తాన్ని ఏఈవో శ్రావణ్‌కుమార్‌ చేతుల మీదుగా స్వామికి సమర్పించినట్లు పీఆర్వో సాయిబాబు తెలిపారు. 17న పునర్వసు పూజలను నిర్వహించనున్నారు.


రూ.లక్ష విరాళం అందిస్తున్న భక్తులు

రామాలయాన్ని దర్శించిన ప్రముఖులు

భద్రాచలం రామాలయాన్ని కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు పీఆర్వో సాయిబాబు మర్యాదపూర్వకంగా స్వాగతం పలకగా అర్చకులు ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నక్కా ప్రసాద్‌, సరెళ్ల నరేశ్‌ ఉన్నారు.

ఉడుపి స్వామికి ఘన స్వాగతం: కర్ణాటకలోని ఉడుపికి చెందిన విశ్వప్రియతీర్థస్వామి ఆలయానికి రావడంతో ఏఈవో శ్రావణ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. వైదిక పెద్దలు స్థలసాయి, విజయరాఘవన్‌, మురళీకృష్ణమాచార్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాన కోవెలలో కొలువైన సీతారామచంద్రస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనుబంధ ఆలయాలను సందర్శించారు. ఈ స్వామి వెంట జీయర్‌ మఠం నిర్వాహకుడు గట్టు వెంకటాచార్య ఉన్నారు.


రామాలయ క్యూలైన్‌లో భక్తుల రద్దీ

14న హుండీ ఆదాయం లెక్కింపు

భద్రాచలం రామాలయం హుండీ ఆదాయాన్ని రేపు లెక్కించనున్నట్లు ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. 13న లెక్కింపు ఉంటుందని ముందుగా ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో తేదీని మార్చినట్లు చెప్పారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు గురువారం ఉదయం 7 గంటలకు వచ్చి లెక్కింపులో సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.