సోమవారం, డిసెంబర్ 16, 2019
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: జిల్లాలో ఆయా శాఖల్లో అమలు చేస్తున్న ప్రణాళికలు, విధి విధానాలను అధ్యయనం చేసి విశ్లేషించడానికి ఈనెల 17న జిల్లాకు నిపుణుల కమిటీ వస్తుందని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరములో బుధవారం జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ కన్వీనర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.ఎన్ రావుతోపాటు కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కె.టి రవీంద్రన్, ప్రొ.డా.మహవీర్, ప్రొ.హెచ్.ఎం శివానందస్వామి, డా.అంజలీమోహన్, కె.బి అరుణాచలం, డా.ఎ.వి సుబ్బారావులు వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈనెల 17న సాయంత్రం 4- 4.30 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులతో సమావేశమవుతారని 19 పాయింట్లపై అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సాయంత్రం 4.30- 5.గంటల వరకు కర్నూలు నగరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని నగరపాలక అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిపుణుల కమిటీకి జిల్లా సమాచారం, అభివృద్ధ్దిని వివరించాలన్నారు. ఈ సమావేశంలో రెండో జేసీ ఖాజా మొహిద్దీన్, డీఆర్వో పుల్లయ్య, సీపీవో వాసుదేవరావు, అటవీశాఖ సీసీఎఫ్ అలాంగ్చోంగ్ తెరాన్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు