close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

ఉపాధి గుండెల్లో... అవినీతి గునపం

చేసిన పనులే చేస్తూ.. దస్త్రాల్లో ప్రగతి

అడ్డగోలు దోపిడీతో.. క్షేత్రంలో అథోగతి

కూలీల పేరుతో బొక్కేసింది ఏకంగా రూ.8.92 కోట్లు

చర్యలకు వెరవని అక్రమార్కులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

ఈ రెండు చిత్రాల్లో పరిశీలిస్తే మద్దికెరలో గత ఏడాది తవ్విన పంట కుంటలోనే ఈ ఏడాది జూన్‌లో మళ్లీ పనులు చేశారు. గుప్పెడు మట్టి తవ్వి గంపలతో తరలించి పాత గుంతకు కొత్త మెరుగులు దిద్దేలా పర్యవేక్షణ సిబ్బంది ప్రణాళిక చేశారు. కూలీలతో తవ్వించిన పంట కుంటలకు సుమారు రూ.2 లక్షల వరకు బిల్లులు ఇచ్చారు. మళ్లీ అందులోనే పనులు చేయించి బిల్లులు పెట్టడం గమనార్హం.

కరవు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కోసం ప్రజలు వలసలు పోకుండా నివారించేందుకు చేపట్టిన ఉపాధిహామీ పథకం గుండెల్లో అక్రమాల గునపాలు దిగుతున్నాయి. చేసిన పనులే చేస్తూ.. కూలీల పేర్లతో మస్టర్లు, యంత్రాలతో పనులు వంటి వాటితో అవినీతి మేత మేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఏటా దస్త్రాల్లో ప్రగతి చూపించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఉపయోగపడే పనులు జరగడంలేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో చేపట్టిన సామాజిక తనిఖీల్లో మేట్‌ల నుంచి పర్యవేక్షించిన అధికారుల వరకు అవినీతి భాగోతం బయటపడినా చర్యలకు వెరవడం లేదు.

జిల్లాలో జాబ్‌కార్డులు పొందిన ఉపాధి కూలీలు సుమారు 8.09 లక్షల మంది ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ ద్వారా 178.24 లక్షల పనిదినాలు కల్పించేలా లేబర్‌ బడ్జెట్‌ రూ.365.39 కోట్లుగా నిర్దేశించారు. ఇలా ప్రతి ఏటా రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తున్నా పశ్చిమ ప్రాంతంలో వలసలు నిలువరించలేక పోతున్నారు. ఏటా వేసవిలో పనుల్లో పాల్గొనేవారి సంఖ్య తక్కువగా ఉన్నా రానివారి పేర్లపై మస్టర్లు వేస్తూ ఖాతాల్లో సొమ్ము జమ కాగానే పర్సంటేజీల్లో బొక్కేస్తున్నారు. మరోవైపు చేసినపనే చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.

సామాజిక తనిఖీల్లో...

జిల్లాలో నవంబరు 12వ తేదీ నాటికి 12వసారి సామాజిక తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన రూ.3,486 కోట్లు పనులకు సంబంధించి 53 మండలాల్లో 11 విడతల్లో రూ.8.92 కోట్లు అవినీతి జరిగినట్లు తనిఖీ బృందాలు తేల్చాయి. కొందరు తప్పులున్నాయని అప్పీలు చేసుకుని రూ.1.10 కోట్లు తొలగించుకోగా..రూ.2.73 కోట్లు రికవరీ చేశారు. ఇవిగాక ఉపాధిహామీ నిధులతో లింకు ఉన్న పంచాయతీరాజ్‌ సీసీ రోడ్లకు సంబంధించి రూ.57.43 కోట్లు, అటవీ శాఖ రూ.6.66 కోట్లు, సెర్ప్‌ రూ.2.05 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ రూ.2.88 కోట్లు, మినీ గోకులాలకు పశుసంవర్థక శాఖ రూ.10 లక్షలకు సంబంధించి రికార్డులు ఇంకా తనిఖీ బృందానికి అందించలేదు. ఈ తనిఖీలు జరిగితే అవినీతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

బాధ్యులపై చర్యలకు..

సామాజిక తనిఖీ బృందాలు అవినీతి వెల్లడించడంతోపాటు, అక్రమాలకు కారణమైన బాధ్యులను గుర్తిస్తారు. ఇలా జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఏపీవో, ఈసీ, టీఏలపై 1526 కేసులు నమోదు చేశారు. ఇక క్షేత్ర సహాయకులు 1,429 మందిపై, మేట్‌లు 8 వేల మందిని బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేశారు. మొత్తం కేసుల్లో 1987 కేసులు ఆర్‌ఆర్‌ యాక్టు, 213 క్రిమినల్‌ కేసులు నమోదుగా కాగా.. 12 కోర్టు కేసులున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా అక్రమార్కులు వెరవడం లేదు. ఉపాధిహామీలో అవినీతి ఆగడం లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.