close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

పొరుగు దిగుబడులకు చెక్‌

సరిహద్దు చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా

స్థానిక రైతుల విక్రయాలకే ప్రాధాన్యం

మార్కెటింగ్‌ శాఖకు మంత్రుల ఆదేశం

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

పొరుగు రాష్ట్రాల్లో పండించిన పంటలకు ఉమ్మడి పాలమూరులోని వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో మంచి ధరలు లభిస్తుండటంతో ఏటా సరిహద్దు ప్రాంతాల నుంచి వారు ఇక్కడికి వస్తున్నారు. దీంతో పాలమూరు రైతులకు నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఆదేశించడంతో మార్కెటింగు అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకొంటున్నారు.

రీఫ్‌ కాస్త ఆలస్యమైనా.. వర్షాలు పుష్కలంగా కురిశాయి. మార్కెట్‌ యార్డులకు పంట దిగుబడులు పోటెత్తే కాలమిది. ఎప్పటిలా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పాలమూరు మార్కెట్లకు వచ్చిపడే పంట ఉత్పత్తులపై ఈ సారి ప్రభుత్వం ముందుగా అప్రమత్తం అయింది. పక్క రాష్ట్రాల దిగుబడులను అడ్డుకునేందుకు మార్కెటింగు శాఖ అధికారులు గట్టి ఏర్పాట్లు చేయనున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుబడులు అమ్ముకోడానికి సరిహద్దులోని అలంపూర్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట మార్కెట్లకు ఏటా పెద్దఎత్తున రైతులు వస్తారు. పంట ప్రమాణాల మేరకు ఉంటే తెలంగాణలో మంచి మద్దతుధర ఇస్తుండటంతో పొరుగు రాష్ట్రాల రైతులకు సరిహద్దు శివారులోని మార్కెట్‌ యార్డులపై కన్ను పడింది. కందులు, పెసలు, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలను ఇక్కడి మార్కెట్లలో వారు ఏటా అమ్ముకుంటారు. ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మార్కెట్‌ యార్డులు పంట ఉత్పత్తుల కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ పంటలకు మద్దతుధర ప్రకటిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆ ధర తెలంగాణలో ఎక్కువగా ఉండటంతో అక్కడ పండించిన పంటలను ఇక్కడి మార్కెట్లకు తీసుకొస్తుంటారు. ఈ ఏడాది మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,20,390 హెక్టార్లు, నాగర్‌కర్నూలులో 2,35,213, నారాయణపేటలో 1,31,000, వనపర్తిలో 82,500, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,30,000 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. నారాయణపేట మార్కెటుకు కందులను అమ్ముకోడానికి కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి రైతుల పాసుపుస్తకాల ద్వారా వారు నారాయణపేట మార్కెట్‌లో కందులు విక్రయిస్తారు. పొరుగునున్న కర్ణాటక ప్రజలతో నారాయణపేటకు చెందిన పలువురికి బంధుత్వాలు ఉండటంతో ఇక్కడి పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు సులువుగా సంపాదించి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ జిల్లాలో కృష్ణా మండల పరిధిలో మాత్రమే చెక్‌పోస్టు ఉంది. ఇటు నారాయణపేట శివారు ప్రాంతాల నుంచి కూడా కర్ణాటకకు ప్రత్యేక రోడ్లు ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువమంది రైతులు ఇక్కడికి వలస కడుతున్నారు. అలంపూర్‌ వ్యవసాయ మార్కెటుకు పప్పుశనగ అమ్ముకోడానికి పొరుగు రైతులు వస్తారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో పండించిన పప్పుశనగకు అక్కడ మద్దతుధర లభించలేదు. తెలంగాణలో మద్దతుధర ఇవ్వడంతో అక్కడి రైతులు చాలామంది ఇక్కడ అమ్ముకున్నారు. వనపర్తి మార్కెట్‌కు వేరుశనగ అమ్ముకోడానికి ఎక్కువగా వస్తారు. నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం కృష్ణా వద్ద చెక్‌పొస్టు ఉందని, కర్ణాటక నుంచి నారాయణపేటకు నేరుగా వచ్చే ఇతర దారుల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి భాస్కర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌, నందిన్నె, అయిజ, పుల్లూరు తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మార్కెటింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పంటలపై నిఘా పెడతామని జోగులాంబ గద్వాల జిల్లా అధికారిణి పుష్పమ్మ ‘ఈనాడు’కు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.