సోమవారం, డిసెంబర్ 09, 2019
మిల్లర్ల మాయాజాలం
ధాన్యాన్ని వెనక్కి పంపిస్తున్న వైనం
తరుగు పేరిట దోపిడీ
‘‘లింగంపేట మండలం మాలపాటికి చెందిన మధుసూదన్‌రెడ్డి 82 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాటిని బియ్యం మిల్లుకు తరలించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని పేచీ పెట్టారు. చివరకు మూడు క్వింటాళ్లు తరుగు కింద ఇస్తే తీసుకోవడానికి అంగీకరించారు.’’
‘‘లింగంపేట మండలం బోనాలక్కు చెందిన గన్నునాయక్, సార్యానాయక్, జెగ్యానాయక్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించారు. వాటిని ఎల్లారెడ్డిలోని ఓ బియ్యం మిల్లుకు తరలించారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో తీసుకొనే ప్రసక్తి లేదని మొండికేశారు. ఐదు క్వింటాళ్ల ధాన్యం తరుగు కింద ఇస్తే అంగీకరించారు.’’
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
ధాన్యం విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకొస్తే రెండు నుంచి మూడు రోజులపాటు ఆరబెట్టిస్తున్నారు. తేమ 17 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు నిర్ధరించిన తర్వాతనే కొనుగోలుకు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇంత పకడ్బందీగా కొనుగోలు చేసినా బియ్యం మిల్లర్లు ఎందుకు కొర్రీలు పెడుతున్నారో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం నిర్ధరించే యంత్రాలు, రైసుమిల్లుల్లో యంత్రాల మధ్య భారీగా వ్యత్యాసముంటోంది. ఎక్కడ లోపం ఉందో అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు పేర్కొంటున్నారు.
తరుగు తీసుకుంటే చర్యలు
- జితేంద్ర ప్రసాద్, డీఎం, పౌరసరఫరాల శాఖ, కామారెడ్డి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రైసుమిల్లర్లు రైతుల నుంచి తరుగు తీసుకొంటే చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో తేమ శాతం నిర్ధరణ చేసేటపుడు జాగ్రత్తగా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచనలు చేస్తున్నాం. మిల్లర్లు ఏవైనా ఇబ్బందులు పెడితే 08468-220051 నంబరును సంప్రదించాలి. ఫిర్యాదు చేస్తే ఆయా మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం.
తాజా వార్తలు
జిల్లా వార్తలు