close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

కల్యాణం కమనీయం
 
రామాలయాన్ని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎంపీ మాలోతు కవిత

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామిని బుధవారం ప్రత్యేకంగా పూజించారు. ఆలయం తలుపులు తెరిచాక అర్చకులు భక్తిశ్రద్ధలతో అర్చనలు చేశారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ పుణ్యాహ వాచనం నిర్వహించి కంకణ ధారణ చేశారు. సీతమ్మకు యోక్త్రధారణ రాముడికి యజ్ఞోపవీత ధారణ చేయడంతో ఈ సంబరం మంత్ర ముగ్ధులను చేసింది. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా నిత్య కల్యాణ క్రతువు గురించి వివరించడంతో మాంగళ్య ధారణ కడు రమణీయంగా మారింది. తలంబ్రాల వేడుక పరమానందం కలిగించింది. దర్బారు సేవ తన్మయత్వంలో నింపింది.

మంత్రి సత్యవతి రాఠోడ్‌ పూజలు

భద్రాచలం, న్యూస్‌టుడే: గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ బుధవారం భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, అక్కడి జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్యలతో కలిసి వచ్చిన ఆమె స్వామిని దర్శించుకున్నారు. ఏఈవో శ్రావణ్‌కుమార్‌ ఘనంగా స్వాగతించగా ప్రధానార్చకుడు విజయరాఘవన్‌ నేతృత్వంలో ఆశీర్వచనం పలికారు. జ్ఞాపికను ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని లక్ష్మీతాయారు అమ్మను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తండ్రి కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో కేసీఆర్‌ అలా అందరి సంక్షేమానికి ప్రణాళికలను తయారు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో రామాలయం ధర్మకర్తగా పని చేసిన తనకు ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందని వివరించారు. ఎంపీపీ శాంతమ్మ, జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్‌ దిండిగాల రాజేందర్‌తో పాటు పలువురు తెరాస నాయకులు ఆలయ దర్శనాలు చేసుకున్నారు.

ఇదేమి చోద్యం రామా..!

మంత్రితో పాటు మిగతా ముఖ్యులు ప్రధాన కోవెలలో పూజలు చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌తో ఆలయంలోకి వచ్చాడు. పూజా దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్‌ ఉద్యోగులు, ఆలయ బృందం ఉండగానే ఈ చోద్యం చోటుచేసుకుంది. అక్కడ ఉన్నవాళ్లు ఈ తంతు చూసి అతన్ని వారించే ప్రయత్నం చేశారు. ఈ కోవెలలో ఫొటోలు, వీడియోలు తీయడం అపచారమని చెప్పి కొద్దిసేపు ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ప్రజాప్రతినిధులతో వచ్చిన భద్రతా ఉద్యోగి అని తెలుసుకుని అతని ఫోన్‌ అతనికిచ్చారు. ఈ విషయమై అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులను అడగగా ఫోన్‌తో పూజను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వెంటనే అడ్డుకున్నామని అందులో ఎలాంటి ఫొటోలు లేవని చెప్పారు. ఫొటోలను తొలగించి ఫోన్‌ ఇచ్చినట్లు వినికిడి. మరోపక్క కార్యకర్తలు తీన్మార్‌ దరువులతో చిత్రకూట మండపం వద్దకు చేరుకున్నారు. మంత్రి ఆలయం నుంచి మెట్లు దిగుతుండగా ఆ ప్రాంగణంలోనే పూలు చల్లడం సరికొత్త చర్చకు దారితీసింది. ఆలయ సిబ్బంది ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని భక్తులు సూచిస్తున్నారు.

 

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.