బుధవారం, డిసెంబర్ 11, 2019
డిసెంబరు ఒకటి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ అమలుకు ఆదేశాలు
టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు ఇక ఆగాల్సిన అవసరం లేదు.. పెరిగిన వాహనాల రద్ధీ. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం డిసెంబరు ఒకటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ సేవలు విస్తృత పరిచేలా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా టోల్ రుసుము చెల్లించే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు అతికించుకోవాలి.
న్యూస్‌టుడే ఇందల్వాయి
ఒక వాహనం టోల్‌ప్లాజా దాటడానికి కనిష్ఠంగా పది నిమిషాలు పడుతోంది. పండగ, రద్దీ సమయాల్లో అరగంట వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అదేవిధంగా టోల్ రుసుము నగదు రూపంలో చెల్లిస్తుండటం, సరిపడా చిల్లర లేకపోవడం ఆలస్యానికి కారణం అవుతోంది. దీన్ని నివారించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబరు ఒకటి నుంచి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు బుధవారం అవగాహన కల్పించారు.
ఆన్లైన్ చెల్లింపులంటే
ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వాహనం రాగానే ‘ఈటీసీ’ కెమెరాలు స్కాన్ చేస్తాయి. దీంతో గేటు ఆటోమేటిక్‌గా తెరుచుకొంటుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం రెండు గేట్ల వద్ద అమలవుతోంది. డిసెంబరు ఒకటి నుంచి మరో 6 గేట్ల వద్ద అమలు చేయనున్నారు. వాహనదారులంతా తప్పనిసరిగా తమ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు వేయించుకోవాల్సి ఉంటుంది.
స్టిక్కర్లు ఎక్కడిస్తారంటే
ఫాస్ట్‌ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ ‘మై ఫాస్ట్‌ట్యాగ్’, ‘ఫాస్ట్‌ట్యాగ్ పార్టనర్’ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాతో ఈ యాప్‌ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్‌ప్లాజాలో ఇస్తే ‘ఫాస్ట్‌ట్యాగ్ బార్కోడ్’తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు.
లోపాలు సవరిస్తేనే
* ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ వినియోగించే వాహనదారులు కొన్ని లోపాలను ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిచేయాలని కోరుతున్నారు.
* ముందస్తు టోల్ రుసుం చెల్లిస్తే సమయంతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందవచ్చని ప్రచారం చేస్తున్నారు ఇది ఎంత వరకు సమంజసమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
* 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యే వారు మాత్రం నష్టపోవాల్సి వస్తోంది... నగదు చెల్లింపుతో 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యేవారికి కొంత రాయితీ ఉంటుంది. ముందస్తు చెల్లింపులతో పూర్తి ఛార్జీ వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు
కార్లు : 5,000
చిన్న లారీలు : 3,000
బస్సులు : 1,000
బారఆవాహణాలు : 3,000
తాజా వార్తలు
జిల్లా వార్తలు