ఆదివారం, డిసెంబర్ 08, 2019
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్‌కు తెలిపారు. ఈమేరకు ఎన్నికల ముఖ్యఅధికారి బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2020పై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ఈ నెల 25వ తేదీలోగా పంపాలని ఆయన సూచించారు. ముందస్తు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎపిక్ నంబరు, నోషనల్ హౌస్ నంబర్లు, మ్యాపింగ్‌ను ఈ నెల 17వ తేదీలోగా పూర్తిచేయాలని విజయానంద్ కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వచ్చే డిసెంబరు 16వ తేదీ నాటికి సమగ్ర ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించడం జరుగుతుందని, అప్పటి నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆ జాబితాపై వచ్చే క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించి, 17వ తేదీలోగా పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఫిబ్రవరి 4వ తేదీన సప్లిమెంట్ జాబితాలు సిద్ధం చేసి, 7వ తేదీన చివరి ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పూర్తిచేస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి జేసీ వినోద్‌కుమార్, సర్వేపల్లి, ఉదయగిరి ఈఆర్వోలు రోజ్‌మాండ్, జ్యోతిబసు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు రామ్మోహన్, ఆషర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు