శనివారం, డిసెంబర్ 07, 2019
ప్రణాళికలు ఖరారు..
నియోజకవర్గంలో 52,175 ఎకరాల్లో సాగు లక్ష్యం...
భూగర్భ జలాలపైనే ఆశలు
నాగళ్లతో దుక్కి దున్నుతున్న రైతు (దాచిన చిత్రం)
దోమకొండ, న్యూస్‌టుడే: యాసంగి సీజన్‌పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఖరీఫ్‌లో సాగైన పంటలు కోతలతో దిగుబడులు ఇళ్లకు చేరుతున్నాయి. యాసంగి (రబీ) పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గంలోని రాజంపేట్, బీబీపేట, దోమకొండ, భిక్కనూర్, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో పంటల సాగు లక్ష్యం, విత్తనాలు, ఎరువుల మంజూరు కోసం ప్రణాళికలు పూర్తి చేసి ఉన్నతాధికారులకు పంపించారు. రబీ సీజన్ ప్రారంభమవుతున్నందున శనగ, వరి విత్తనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. పలు కేంద్రాల ద్వారా ఇప్పటికే రాయితీ శనగ విత్తనాల విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.
దోమకొండ సింగిల్ విండోలో అందుబాటులో ఉన్న ఎరువులు
52వేల ఎకరాల్లో ..
నియోజకవర్గంలో ఈ యాసంగి (రబీ) సీజన్లో 52,175 ఎకరాలలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రబీలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, చెరకు పంటల సాగుకే అధికారులు ప్రాధాన్యం ఇచ్చి, అంచనాలు రూపొందించారు. సాగునీటి కొరత కారణంగా ఆరు తడి పంటలనే సాగు చేయాలని భూగర్భ జల వనరులు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాయితీపై అందించే విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఆ దిశగా దృష్టి సారిస్తే... పంటల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది దిగుబడులపై సాగు నీటి కష్టాలు ప్రభావితం చూపాయి. సాగు లక్ష్యం ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడక తప్పదు మరీ.
భూగర్భ జలాలపైనే ఆశలు
నియోజకవర్గంలో 59వేలకు పైగా రైతులుండగా, 30వేల మంది రైతులు రబీ సీజన్ పంటల సాగుకు వేచి చూస్తున్నారు. ఎటువంటి ప్రాజెక్టులు లేకపోగా, చిన్ననీటి వనరులు, భూగర్భ జలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. చిన్న నీటి వనరులు సైతం పెద్దగా నిండకపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మిగిలింది. ఖరీఫ్ సీజన్ చివర్లో ఊహించని రీతిలో వర్షాలు కురియడంతో పంట నష్టాలు రైతులను బాధించగా, భూగర్భ జలాల మట్టం కొంత మేర ఊరటనిచ్చింది. నియోజకవర్గంలో గతేడాదితో పోలిస్తే సరాసరిన 5 నుంచి 8 మీటర్ల వరకు భూగర్భ జల మట్టం పెరిగింది. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, నర్సన్నపల్లి, పెద్దమల్లారెడ్డిలలో జలమట్టం ఇంకా దూరంగానే ఉంది. గొట్టపు బావులు బాగా ఎత్తిపోయడంతో రబీ సీజన్‌పై ఆశలు పెంచుకున్నారు.
ప్రణాళికలు నివేదించాం
- పవన్‌కుమార్, ఏవో, దోమకొండ
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశానుసారం యాసంగి సీజన్‌కు ప్రణాళిక ఖరారు చేశాం. పంటల సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువుల కోసం నివేదించాం. సీజన్‌కు ముందుగానే వాటిని తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచుతాం. ఆరు తడి పంటలను వేసుకోవాలని సూచిస్తున్నాం. పంటల సాగుకు నీటిని రైతులు పొదుపుగా వాడుకొంటే సాగునీటి కష్టాలు దూరమవనున్నాయి.
జిల్లా వార్తలు