close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నూతనత్వంసై అలసత్వం

జిల్లా గ్రంథాలయాల్లో అపరిష్కృతంగానే సమస్యలు

కొత్త పాలక మండలి ఏర్పాటైనా అదే తీరు

కొత్తగూడెం సాంస్కృతికం, న్యూస్‌టుడే

జిల్లా గ్రంథాలయం

గ్రంథాలయాల్లో సమస్యలతో పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. నూతన జిల్లాగా భద్రాద్రి అవతరించిన నేపథ్యంలో జిల్లా గ్రంథాలయాలకు కొత్త పాలక మండలి ఏర్పాటైంది. దీంతో సమస్యలు తీరతాయని భావించిన పాఠకులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలోని పుస్తకాలే వర్షాలకు తడిసి, ముద్దగా మారిన దుస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని పరిస్థితి ఆలోచించవచ్ఛు


ఉద్యోగుల కొరత

జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఉద్యోగుల కొరత ఉంది. ప్రతి గ్రంథపాలకుడు కనీసం రెండు గ్రంథాలయాలను చూసుకోవాల్సి వస్తుండటంతో భారం పెరుగుతుంది.


నేటి నుంచి గ్రంథాలయాల వారోత్సవాలు

గ్రంథాలయాల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాల జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో సాంస్కృతిక, రచనా పోటీలను చేపడుతున్నామన్నారు. గురువారం కొత్తగూడెంలోని అంబేడ్కర్‌ భవనంలో ప్రారంభ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 14న ఫ్యాషన్‌ డిజైన్‌ షో, శాస్త్రీయ నృత్యాలు, 15న పుస్తకాల ప్రదర్శన, 16న పాఠశాల సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 17న చిత్రలేఖనం, 18న వక్తృత్వం, 19న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవితలు, దేశభక్తి గీతాలాపనలు, 20న ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తున్నట్లు వివరించారు.

జిల్లాలో మొత్తం 18 శాఖా గ్రంథాలయాలున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన గ్రంథాలయం ఒక్కటే గ్రేడ్‌-2 స్థాయి. మిగిలినవన్నీ గ్రేడ్‌-3 పరిధిలోనివి కావడం విశేషం. గ్రంథాలయాలను కనీసం అప్‌గ్రేడ్‌ చేస్తే పాఠకులకు ఎంతో లాభం కలుగుతుంది. నిబంధనల ప్రకారం పదివేల జనాభా కంటే ఎక్కువగా ఉంటే గ్రేడ్‌-2, 15వేల జనాభా కంటే ఎక్కువగా ఉంటే గ్రేడ్‌-1గా చేయాల్సి ఉంది. చాలా మండలాల్లో జనాభా అధికంగా ఉంది. కానీ ఈ నిబంధనలను మాత్రం వర్తింపచేయడం లేదు. కొన్నేళ్ల క్రితం ఏర్పడిన వ్యవస్థను దీర్ఘకాలంగా అమలు చేస్తున్నారు. స్థాయి పెంచితే పాఠకులకు అవసరమైన ఫర్నిచర్‌ మరింత సౌకర్యంగా ఉంటుంది. పాఠకులు కూర్చునే సామర్థ్యం పెరుగుతుంది. అదనంగా పుస్తకాలు సమకూరుతాయి. గ్రంథాలయాల నిర్వహణ కూడా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం గ్రేడ్‌-3 పంచాయతీల్లో లైబ్రేరియన్‌ మాత్రమే ఉంటుండగా ఒకరిద్దరి తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.

వేధిస్తున్న పుస్తకాల కొరత

ఉద్యోగ ఆశావహులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుపేద, మధ్య తరగతుల అభ్యర్థులకు గ్రంథాలయమే పెద్దదిక్కు. ఈ పరిస్థితిలో అభ్యర్థుల ఆకాంక్షలకనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉండగా, పోటీ పరీక్షలకు అవసరమైన నాణ్యమైన పుస్తకాల కొరత జిల్లాలో తీవ్రంగా వేధిస్తుంది. ఎలాంటి పుస్తకాలను కోనుగోలు చేయాలనే విషయంలో శాస్త్రీయ దృష్టి కోణం పాలకుల్లో లేకపోవడం మరింత బాధాకరం. మున్సిపల్‌, పంచాయతీల నుంచి గ్రంథాలయాల రావాల్సిన సెస్‌ బకాయిలు పేరుకపోయాయి. బుక్‌ ఆన్‌ డిమాండ్‌, గ్రంథాలయాల్లో అంతర్జాల సదుపాయాలు, డిజిటలైజేషన్‌ అంటూ చెప్పిన హామీలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.

మౌలిక సదుపాయాల్లో అదే దుస్థితి

గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. చాలినన్ని కుర్చీలు కరవయ్యాయి. కొన్నిచోట్ల ఇనుప కుర్చీలను అందుబాటులో ఉంచడంతో వాటి శబ్ధం పాఠకుల ఏకాగ్రతను భగ్నం చేస్తోంది. ఈ సమస్యపై పదేపదే విజ్ఞప్తుల మేరకు ఇటీవల ప్లాస్టిక్‌ కుర్చీలను తీసుకువచ్చారు. జిల్లా గ్రంథాలయంలో మరుగుదొడ్లు లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. టేకులపల్లి, జూలూరుపాడు గ్రంథాలయాల్లో మరమ్మతులు చేపడతామని గత సమావేశంలో తీర్మానం చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్య తీరలేదు. జిల్లాకేంద్రంలోని పుస్తకాలను నూతన భవనంలోకి మార్చకుండా శిథిలమైన పాత భవనంలో ఉంచడంతో కురిసిన వర్షాలకు పైకప్పు నుంచి ధారగా వాననీరు నేరుగా పుస్తకాలపైనే పడ్డాయి. దీనితో పనికిరాకుండా పోయాయి. ఎట్టకేలకు శిథిలభవన పైకప్పును కొంతమేర మరమ్మతులు చేయించినా వర్షాలు కురిస్తే గోడల నుంచి వర్షపు నీరు గ్రంథాలయంలోకి చేరుకుంటుంది.

పుస్తకాలు మాయం.. జిల్లాలో గ్రంథాలయాల్లో వందలాది పుస్తకాలు మాయం అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై లోతైన విచారణను నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.