మంగళవారం, డిసెంబర్ 10, 2019
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. రెండేళ్లకోసారి నిర్వహించే సంస్థాగత ఎన్నిలకు పార్టీ సన్నధ్దమైంది. ఇక గ్రామ, వార్డు నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండేళ్లకోసారి ఎన్నికయ్యే కమిటీలే పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. స్థానిక ఎన్నికల తరుణంలో పార్టీకి ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తొలిదశలో గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత మండల, నియోజకవర్గ, పార్లమెంటరీ, జిల్లా కమిటీలకు ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలో గ్రామ, వార్డు స్థాయి ఎన్నికలు ఈ నెల 18 నుంచి డిసెంబరు మూడో తేదీ నాటికి పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అధ్యక్షతన పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ తెలిపిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని 1,158 గ్రామాలు, వార్డులకు పార్టీ కమిటీలను ఈ నెల 18వ తేదీ నుంచి డిసెంబరు 3వ తేదీలోపు పూర్తిచేయాలని రవిచంద్ర తెలిపారు. క్రియాశీల సభ్యత్వం ఉన్న వారు మాత్రమే ఓటర్లుగా కమిటీలను ఎన్నుకోవడానికి, పదవులకు పోటీ చేయడానికి, ఎంపిక కావడానికి అర్హులన్నారు. గ్రామ, మున్సిపల్, వార్డు, కార్పొరేషన్ డివిజన్ కమిటీలో 33 శాతం యువతకు, 33 శాతం మహిళలకు ప్రతి కమిటీలో విధిగా ప్రాతినిథఫ్యం ఉండేలా కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. గ్రామ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి పరిశీలకులుగా మండలానికి ఆరుగురి చొప్పున నియమించామని, వారు మూడు బృందాలుగా గ్రామ, వార్డు, డివిజన్ స్థాయి ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా నియోజకవర్గ స్థాయి ఎన్నికల పరిశీలకుల సమావేశాలను ఈ నెల 21వ తేదీలోగా పూర్తిచేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెన్ని రమణయ్య, ఆనం జయకుమార్‌రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి, సీహెచ్ హరిబాబు యాదవ్, ఆత్మకూరు బ్రహ్మయ్య, ఖాజావలి, బి.మనోహర్‌రెడ్డి, ఉరందూరు సురేంద్రబాబు, శ్రీపతిబాబు, షేక్ అమృల్లా, అంచల అఖిల పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు