close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

మాయామశ్చీంద్రలు

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా సత్తుపల్లి, వేంసూరు సరిహద్దు గ్రామాలు

మదార్‌ రూపంలో నకిలీ నోట్ల కలకలం

కేసుల పరిష్కారంలో మీనమేషాలు

ఈనాడు, ఖమ్మం - సత్తుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే


రూ. 12.11 లక్షల పాత (రద్దు) నోట్ల విలువను తన తెలివితో రూ. 110 కోట్లుగా చూపాడు. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఇంకా ఈ నోట్లు తీసుకుంటున్నారని నమ్మబలికాడు. కమీషన్‌ రూ.40 కోట్లుపోను రూ.70 కోట్లు వస్తాయని చెప్పాడు. నోట్ల కట్టలకు పైన రూ.500, రూ 1,000 నోట్లు ఉంచి లోపల తెల్లకాగితాలు పెట్టాడు. ఈ నోట్ల దర్శనానికే కనీస రుసుం రూ.2 లక్షలు వసూలు చేశాడు. సత్తుపల్లి మండలం గౌరిగూడేనికి చెందిన మదార్‌ ముఠా వేంసూరు మండలం మర్లపాడు వేదికగా చేసుకుని ఈ అక్రమం సాగించింది.. మదార్‌ బాగోతాన్ని అక్టోబరు 30న గుర్తించిన పోలీసులు ఈ నెల 12న బట్టబయలు చేశారు.


సత్తుపల్లి మండలం గౌరిగూడెంలో రూ. 7 కోట్ల నకిలీ కరెన్సీ, రెండు కార్లు, నగదు లెక్కించే యంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద రూ. 100 కోట్ల నకిలీ నోట్లు ఉన్నాయని, రూ. 2 లక్షలు అసలు నోట్లు ఇస్తే రూ.10 లక్షలు నకిలీ నోట్లు ఇస్తానని మదార్‌ ప్రచారం కల్పించాడు. విషయం తెలుసుకొని పోలీసులు పరిశీలిస్తే 350 కట్టలు బయటపడ్డాయి. నకిలీ నోట్లు రూ. 2 లక్షలుండటం గమనించాల్సిన అంశం...


ఏపీ సరిహద్దును పంచుకుంటున్న వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు అక్రమా కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఉభయ జిల్లాల పరిధిలో సంచలనాత్మక ఘటనలన్నీ ఈ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. భౌగోళిక అనుకూలతలతోపాటు పొరుగు రాష్ట్రంలోని అక్రమార్కులతో పరిచయాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. నిత్యావసరాల వస్తువులను కూడా కల్తీవి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏటా ఏదో ఓ అక్రమం వెలుగుచూస్తున్నా వాటిని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏళ్లుగా పలు కేసులు అపరిష్కృతంగా ఉంటుండంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తాజా నకిలీ నోట్ల వ్యవహారమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సత్తుపల్లి- వేంసూరు పరిధిలో అక్రమ వ్యాపారాలు, కారణాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

నకిలీ పాస్‌ పుస్తకాల సృష్టికి చిరునామా సత్తుపల్లి, వేంసూరు మండలాలు. 2017 జులై ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా నేటికీ చర్యలు శూన్యం. బ్యాంకు నుంచి రుణం కావాలంటే.. రైతు భూమి సర్వే నెంబరు, 1-బి, నోడ్యూస్‌ ధ్రువీకరణలను పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో ఇవేవీ జరగలేదు. సత్తుపల్లి మండలంలో వెయ్యి మందికి, వేంసూరు మండలంలో సుమారు 40 మందికి నకిలీ ధ్రువీకరణలతో పంట రుణం మంజూరైంది. ఈ తంతు వెనుక ‘మామూలు’ నడిచింది. పలు బ్యాంకు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. కొందరిని బదిలీ చేశారు. అన్నట్టు నకిలీ పాస్‌ పుస్తకాల విషయంలో తెరవెనక మంత్రాంగం నడిపించిన ఓ వ్యక్తి 2018 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేద్దామన్న ఉద్దేశంతో కాసులకు కక్కుర్తిపడి పావుగా మారారు. అనుకోకుండా నకిలీ పాసుపుస్తకాల విషయంలో పేరు బహిర్గతం కావడంతో కిమ్మనకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికీ ఈ కేసుపై అతీగతీ లేదు.

కల్తీ కారం.. సత్తుపల్లి కేంద్రంగా కల్తీ కారం కలకలం రేపింది. సుమారు ఏడాదిన్నర క్రితం సత్తుపల్లి కేంద్రంగా కల్తీకారం తయారు చేశారు. విజయవాడలో తయారయ్యే ఓ ప్రముఖ కారంపొడి బ్రాండ్‌ పేరును మరిపించేలా ముందు ఓ అక్షరం తగిలించి.. సత్తుపల్లి ప్రాంతంలో కారంపొడిని తయారు చేశారు. మార్కెట్‌లోకి సరఫరా చేశారు. సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట ఇలా అన్ని ప్రాంతాలకూ విస్తరించారు. అలాఅలా ఈ విషయం బయటకు వచ్చింది. గుట్టురట్టు అయ్యింది. ఆహార తనిఖీ అధికారులు, పోలీసులు హడావుడి చేశారు. రంపపుపొట్టు ముడిసరకుగా మార్చుకొని ఎరుపు రంగు వచ్చే రసాయనాలతో కారం పొడి తయారు చేసిన విషయం బహిర్గతమైంది. సదరు యాజమానికి చెందిన మొదటి అంతస్తు భవనంలో బస్తాలకొద్దీ కల్తీకారం లభ్యమైంది. అయినా చర్యలు శూన్యం.

గంజాయి.. గంజాయి వినియోగం, తరలింపు విషయంలోనూ సత్తుపల్లికి పేరుంది. గుట్టు చప్పుడు కాకుండా, కూర్చున్న చోటే ‘చక్రం’ తిప్పగల వారు నేటికీ ఈ గంజాయి వ్యాపార చక్రం తిప్పుతున్నారు. మత్తును కలిగించే స్పిరిట్‌ తదితర హానికారక మందులను కూడా స్థానిక యువత తీసుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్ఛు

కల్తీ నెయ్యి.. వేంసూరు మండలం మర్లపాడు కేంద్రంగా కల్తీ నెయ్యి తయారీ సుమారు రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. పామాయిల్‌, కొంచెం నెయ్యి కలిపి నెయ్యి పెద్దఎత్తున తయారు చేశారు. నెయ్యి తక్కువ ధరకు వస్తుందన్న భావనతో ప్రజానీకం కొనుగోలుకు అలవాటు పడ్డారు. కల్తీ నెయ్యి అని తెలుసుకొని అంతా అవాక్కయ్యారు. ఈ కేసు ఏమైందో కూడా అంతుపట్టని అంశం.

‘పాల’కూట విషం.. చిన్నారులు, పెద్దలు తాగే పాలు కూడా వేంసూరు, అశ్వారావుపేట మండలాల్లో కల్తీ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. విచిత్రం ఏమిటంటే.. యూరియాను పాల తయారీకి ఉపయోగించడం గమనించాల్సిన అంశం. ఆరోగ్యపరంగా ఎంత దెబ్బతీసే విషయమో ఆలోచించాలి. అభంశుభం చిన్నారులకు పాలు ఒక ప్రధాన ఆహారం. కానీ ఆ పాలునే కల్తీ చేసిన వారు కొందరు ఉండటం గమనార్హం. చిన్నారుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపాదనకు అలవాటు పడటమే ఈ ఘటనకు కారణం.

కలిసొచ్చాయి..

● సత్తుపల్లి, వేంసూరు మండలాలు దాటితే ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలు వస్తాయి. పెద్ద నగరం విజయవాడ, పట్టణం జంగారెడ్డిగూడెం ప్రాంతాలు సమీపంలో ఉండటంతో అక్రమ సరకు రవాణా సులభతరంగా మారింది.● చెక్‌పోస్టులు అశ్వారావుపేట, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఉన్నాయి. ఈ దారి కాకుండా పలు దొడ్డిదారులుండటం.● వస్తు మార్పిడిపై కట్టడి లేకపోవడం.పులి గాండ్రింపు.. పిల్లికూతల్లా దందాలపై అధికారుల చర్యలు ‘పులి గాండ్రింపు.. పిల్ల కూతలు’గా మారిపోతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం.. ఒకటి రెండు నెలలకు అంతా మర్చిపోవడం మామూలుగా మారిపోతోంది. దాడులు, తనిఖీలు నామమాత్రంగా కూడా ఉండటం లేదు. పాత నేరస్థుడు మదార్‌ వ్యవహారం టేకులపల్లి మండలం వరకు పాకింది. స్థానిక నిఘా వర్గాలకు మోసం జరిగాకగానీ తెలియరాలేదు. విజిలెన్సు, ఆహార తనిఖీ అధికారుల దాడులు, తనిఖీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. కల్తీకారం, కల్తీ నెయ్యి, కల్తీ పాలు విషయంలోనూ ఆహార తనిఖీ అధికారులు మొద్దునిద్రను ప్రదర్శించారు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నమూనా (శాంపిల్‌) తీసుకొని మమ అనిపించారు. తర్వాత అనుశీలన చేసిన వారు లేరు. నేరం చోటుచేసుకున్న సమయంలో కఠినంగా వ్యవహరిస్తే మరొకరు ఆ దిశగా అడుగులు వేయరన్నదీ సత్యం.


నిఘా మరింత పెంపు: ఎన్‌.వెంకటేశ్‌, కల్లూరు ఏసీపీ

అక్రమాలపై మరింత నిఘా పెంచుతాం. మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాలను ప్రజలు గమనించాలి. అక్రమాలకు సంబంధించిన సమాచారం ఇస్తే అరికట్టడం సులువు అవుతుంది. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు మోసగాళ్ల విషయంలో జాగురూకతతో ఉండాలి.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.