close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

నిధులు దండి.. పనులు మొండి

ముందుకు సాగని డెల్టా ఆధునికీకరణ పనులు

రూ.650 కోట్లున్నా వినియోగించుకోలేని వైనం

ఏటా పంట ఆలస్యమే ప్రధాన కారణమంటున్న యంత్రాంగం

కొత్తగా 207 పనులకు ప్రతిపాదనలు సిద్ధం

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం

రాజోలు వద్ద పంట కాలువ దుస్థితి (దాచిన చిత్రం)

జిల్లాలో డెల్టా ఆధునికీకరణ కోసం గతంలో మంజూరు చేసిన నిధుల వినియోగంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో డెల్టా కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో సాగునీరు సరిగా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.జిల్లాలో జలవనరుల శాఖకు సంబంధించి ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలో డెల్టా ఆధునికీకరణ కోసం 2007లో అప్పటి ప్రభుత్వం రూ.1,600 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో ఇప్పటివరకు కేవలం రూ.950 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.650 కోట్లు అలాగే ఉన్నాయి. డెల్టా ఆధునికీకరణ పనులు ఏటా ముందుగా నిర్ణయించిన కాలపట్టికకు అనుగుణంగా ముందుకు సాగడం లేదు. రైతులు బొండాలు రకం వరి పంటను సాగు చేయడంతో అనుకున్న సమయానికి పంట చేతికి రాక క్లోజర్‌ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఈ పనులకు కేవలం 15 నుంచి 30 రోజుల సమయం మాత్రమే మిగులుతోంది. ఈ వ్యవధిలోనే అరకొర పనులు చేపడుతూ గుత్తేదారులు చేతులు దులుపుకొంటున్నారు. కేటాయించిన పనుల్లో 50 శాతం కూడా పురోగతి కనిపించడం లేదు. దీంతో ఏటా నిధులు మిగిలిపోయే పరిస్థితి ఎదురవుతోంది. అత్యవసర పనులు మినహా ఇతర పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉండడం లేదు. రబీ తరువాత మార్చి 31న కాలువలకు నీటిని నిలిపివేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నా కోతలు సకాలంలో పూర్తికాక పోవడంతో ఏప్రిల్‌ చివరి వరకూ నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.ఈ ఏడాది మార్చిలో రూ.210 కోట్ల విలువైన 96 పనులకు అనుమతులు లభించాయి.అయితే రబీ పంట ఆలస్యమవడంతో ఆధునికీకరణ పనులను అనుకున్న వ్యవధిలో పూర్తి చేయలేదు. ఇంకా రూ.117 కోట్ల విలువైన 39 పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.జిల్లాలో డెల్టాకు సంబందించి వచ్చే ఏడాది (2020-21) క్లోజర్‌ సమయంలో 207 పనులు చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.365 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జిల్లా మంత్రులు, కలెక్టర్‌ పరిశీలించనున్నారు. ఇందులో ఏయే పనులకు ఎంత సమయం పడుతుంది..? ఏమేరకు నిధులు అవసరం అవుతాయి..? ప్రాధాన్యం ఉన్న పనులు ఏమిటి..? అనే అంశాలను వారు సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఎంపిక చేసిన పనులకు జనవరి చివరి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి మార్చి మొదటి వారం నుంచి ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

నిధులు సకాలంలో ఖర్చు చేసేలా చర్యలు

జిల్లాలో ఎక్కడా బొండాలు రకం వరి పంటను సాగు చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో మంత్రులు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించారు. బొండాలు రకం పంట వేయకపోతే నీటి నిలుపుదల, నీటి విడుదల సమయానుకూలంగా జరుగుతాయి. దీంతో క్లోజర్‌ సమయంలో కేటాయించిన పనులను పూర్తిగా చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నుంచి ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కేటాయించిన నిధుల్లో రూ.650 కోట్లు ఇంకా మిగిలి ఉన్నాయి వాటిని సకాలంలో ఖర్చుచేసి రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తాం.

-ఎన్‌.కృష్ణారావు, పర్యవేక్షక ఇంజినీరు, ధవళేశ్వరం సర్కిల్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.