close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

ఇసుకాసురులపై నిఘాస్త్రం

అక్రమంగా తరలించినా, అధిక ధరలకు అమ్మినా జైలుకే..

జిల్లాలో తవ్వకాలు, నిల్వకేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ

ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన నేటినుంచి డ్రెడ్జింగ్‌తో ఇసుక తవ్వకాలు

వారోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధం

రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవులో ఇసుకను లారీల్లో నింపుతున్న కూలీలు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలకు యంత్రాంగం ఉపక్రమిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినా, అధిక ధరలకు విక్రయించినా బాధ్యులకు జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇసుక కొరతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గురువారం నుంచి 21వ తేదీ వరకు ‘ఇసుక వారోత్సవాల’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రజల అవసరాలకు తగినట్లు ఇసుకను సరఫరా చేయడంతో పాటు కొరత లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈనాడు, కాకినాడ

జిల్లావ్యాప్తంగా 32 ఇసుక రేవులకు అవకాశం ఉన్నా వరద ఉద్ధృతి..వర్షాల కారణంగా నీటి నిల్వలు పెరగడంతో 26 రేవులను మాత్రమే అందుబాటులోకి తెచ్చి ఇసుకను సరఫరా చేస్తున్నారు. గాయత్రి (నాలుగు రేవులు), కోటిలింగాలు (మూడు రేవులు), కోరుమిల్లి (రెండు రేవులు), వెంకటనగరం, పిల్లంక, గోవలంక, పశువుల్లంక, మురమళ్ల, జొన్నలంక, ముంజవరం, దిండి, సఖినేటిపల్లి, పాశర్లపూడి, పెదపట్నం, పెదపట్నంలంక, పాత ఇంజారం, చాగల్నాడు, సోంపల్లి, తాళ్లరేవు, సీతారామపురం రేవులను నిర్వహిస్తూ ప్రజల అవసరాలకు ఇసుకను అందిస్తున్నారు. కాటవరం, వంగలపూడి రేవుల నుంచి సేకరించిన ఇసుకను పొరుగు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక లభ్యత మరింత పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.నిర్మాణ పనులు జోరుగా సాగాల్సిన సీజన్‌లో ఇసుక కొరత కారణంగా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో నిర్మాణ రంగం కుంటుపడగా, దీనిపై ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బతినింది. జిల్లాలో ఈ పరిస్థితులు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకూ కారణమైంది. ఇసుక వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో ఇసుక రవాణా పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం జేసీలకు అప్పగించింది. ఈ పరిస్థితిలో ఇసుక లభ్యత..? తరలింపు..? జిల్లా అవసరాలు..? పొరుగు జిల్లాల అవసరం..? తదితర అంశాలపై అధికారులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు.

వారోత్సవాల సందర్భంగా ఇసుక సరఫరా పారదర్శకంగా సాగేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, రవాణా ఖర్చులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వీటి అతిక్రమణపైనా నిఘా ఉంచనున్నారు. జిల్లా అవసరాల మేరకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు కొత్త రేవులను గుర్తిస్తారు. ప్రభుత్వం టన్ను ఇసుక ధరను రూ.375, కిలోమీటరుకు రవాణా ఛార్జి రూ.4.90గా నిర్ణయించిన విషయం తెలిసిందే. దూర ప్రాంతాలకు ఈ రవాణా ఖర్చులు కలిసొచ్చినా.. సమీప ప్రాంతాల్లో సరఫరాతో ఏమాత్రం ప్రయోజనం ఉండదని వాహనాల యాజమాన్యాల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రైవేటుగా వ్యక్తిగత అవసరాలకు వాహనాలు మాట్లాడుకున్న వారి విషయంలో ధరలో బేరసారాలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం తరఫున వాహనాల ద్వారా సరఫరా చేసే ఇసుక విషయంలో నిర్దేశిత ధరలు కచ్చితంగా అమలు కావల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో ప్రస్తుతం ఇసుక సరఫరా సాధారణ స్థితిలోనే సాగుతోంది. మరో వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు.

నిఘా నీడలో..

ప్రస్తుతం ఇసుకను తవ్వే రేవుల వద్ద నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఈ పనులు సాగుతున్నాయి. ఈనెల 16 నుంచి ఇసుకను తరలించే వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు తప్పనిసరి అని నిర్ణయించారు. వీటి కదలికలపైనా నిఘా ఉంచుతారు. ఇసుక రేవుల వద్దకు ముందుగా అనుమతులతో వచ్చే వాహనాలకు ప్రాధాన్యం ఇస్తారు. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా కోసం పెద్ద బోట్లను రంగంలోకి దింపుతున్నారని, రాత్రి వేళల్లో అనుమతులకు మించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై మరింత దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఏపీఎండీసీ శాఖల పర్యవేక్షణతో ఈ అంశంపై నిఘా పెంచుతున్నారు.


కొరత తీర్చే దిశగా..

జిల్లాలో ప్రస్తుతం 32 రేవులకు అవకాశం ఉన్నా.. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా 26 రీచ్‌లనే నిర్వహిస్తున్నారు. వరదలు, వర్షాలు తగ్గడంతో మరో 10 రోజుల్లో మిగిలిన రేవులనూ అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఇసుక లభ్యత ఉన్న ప్రైవేటు భూముల్లోనూ తవ్వకాల వ్యవహారంపై దృష్టి సారిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో వరదకు కొట్టుకొచ్చి మేట వేసిన ఇసుక నిల్వలను డ్రెడ్జింగ్‌ ద్వారా వెలికితీసేందుకు జలవనరుల శాఖకు ప్రభుత్వం అనుమతించింది. గురువారం నుంచి జరిగే డ్రెడ్జింగ్‌తో సేకరించిన ఇసుకను ఏపీఎండీసీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. అన్ని ఇసుక రేవుల వద్ద ధరలతో బోర్డులు ఏర్పాటు చేస్తారు. రేవులతో పాటు నిల్వ కేంద్రాలనూ పెంచాలని భావిస్తున్నారు. కాకినాడ పరిధిలోని చీడీల పొర వద్ద గతంలో నిర్వహించిన ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రస్తుతం ఎత్తివేశారు. భవిష్యత్తులో దీన్ని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవులో ఇసుక కోసం వచ్చేవారి సంఖ్య పెరగడంతో దీని పరిధిలో నిల్వ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని రేవుల్లో ఏడు లక్షల టన్నుల వరకు తవ్వాల్సిన ఇసుక నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇసుక కొరత లేకుండా చూస్తాం..

జిల్లాలో ఈనెల 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు ఇస్తున్నార. ఇసుక సరఫరా పారదర్శకంగా సాగాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక లభ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. రీచ్‌లతో పాటు నిల్వ కేంద్రాలూ పెంచేలా చూస్తాం. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన పేరుకుపోయిన ఇసుకను డ్రెడ్జింగ్‌ ద్వారా తవ్వి జిల్లాలో ప్రజల అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా సరఫరాకు అనుమతించాం.

జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుకను తవ్వినా, అక్రమంగా నిల్వ ఉంచినా, అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నించినా చర్యలు తప్పవు. ఇసుక సరఫరా ఇప్పటి వరకు సాధారణ పద్ధతిలోనే సాగుతోంది. మరో వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో అనుమతులకు సన్నాహాలు చేస్తున్నాన్నాం.

- డాక్టర్‌ జి.లక్ష్మీశ, జిల్లా సంయుక్త కలెక్టర్‌


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.