close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

సమస్యల భాండాగారాలు

అరకొర వసతులతో శాఖ గ్రంథాలయాలు

నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

న్యూస్‌టుడే, గీసుకొండ

అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయం

రంగల్‌ గ్రామీణ జిల్లాలో జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు 14 శాఖ గ్రంథాలయాలు, ఒక గ్రామ గ్రంథాలయం, 47 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. పరకాల, నర్సంపేటలో గ్రేడ్‌ 2 గ్రంథాలయాలుండగా మండల కేంద్రాల్లో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. గీసుకొండలో జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ సరిపోను సిబ్బందితోపాటు సౌకర్యాలు సమకూర్చలేదు. గతంలో గీసుకొండలో ఉన్న శాఖ గ్రంథాలయాన్ని ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనే కలిపి నిర్వహిస్తున్నారు. అద్దె భవనంలో ఒక హాలు, మూడు గదులే ఉన్నాయి. గదులు సరిపోక పుస్తకాలను గోనె సంచుల్లో పెట్టి మూటలు కట్టి పెట్టారు. జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయంలో 8 మంది జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఈ రెండు కార్యాలయాల్లో ఐదుగురు మాత్రమే ఉండడం గమనార్హం. గీసుకొండ, సంగెం, చెన్నారావుపేట, నర్సంపేట, వర్ధన్నపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో ఇన్‌ఛార్జి గ్రంథపాలకులతోనే నడుస్తున్నాయి. నల్లబెల్లి, దుగ్గొండి గ్రంథాలయాలకు పార్ట్‌టైమ్‌ స్వీపర్లే దిక్కుకావడం గమనార్హం. ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నవారు సక్రమంగా విధులకు హాజరు కావడంలేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. రూ.10 లక్షలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానించి రోజులవుతున్నా కేవలం రూ.60 వేల విలువైన ఆన్‌ డిమాండ్‌ పుస్తకాలనే కొనుగోలు చేసి జిల్లాలోని గ్రంథాలయాలకు సరఫరా చేశారు. పరకాల, నర్సంపేట మినహా జిల్లాలోని అన్ని మండలాల నుంచి సెస్సు వసూలు కావడం లేదు. గీసుకొండ, సంగెం, ఆత్మకూరు మండలాల్లో అద్దె భవనాల్లో గ్రంథాలయాలు నడుస్తున్నాయి. శాయంపేట, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, పర్వతగిరి మండలాల్లో అక్కడి గ్రామపంచాయతీలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనాల్లో గ్రంథాలయాలను నడుపుతున్నారు.

స్థలం లేక పుస్తకాలను గోనె సంచుల్లో నింపి ఓ మూలన పడేసిన దృశ్యం

అగమ్యగోచరంగా పుస్తక నిక్షిప్త కేంద్రాలు

జిల్లాలో 47 పుస్తక నిక్షిప్త కేంద్రాలు(బీడీసీ)ఉన్నాయి. వీటి నిర్వాహకులకు నెలకు రూ.1000 గౌరవ వేతనం, పత్రికల కొనుగోలుకు రూ.500 చొప్పున గ్రంథాలయసంస్థ మొత్తం రూ.1500 అందిస్తుంది. గ్రామ పంచాయతీల నుంచి గ్రంథాలయ సంస్థలకు రావాల్సిన 8 శాతం సెస్సు సకాలంలో రాకపోవడంతో గ్రంథాలయ సంస్థలకు గుదిబండగా మారింది. ఈలోపు బీడీసీల నిర్వాహకులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. పరకాల, నర్సంపేట, మొగిలిచెర్లలో సెస్సు బాగానే వసూలవుతుండడంతో పరకాలలో ఆరు, నర్సంపేటలో ఒకటి మొగిలిచెర్లలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది బీడీసీల నిర్వహణను తన ఆధీనంలోనే ఉంచుకుని జిల్లాలోని మిగితా 39 బీడీసీల నిర్వహణను ఆయా గ్రామపంచాయతీలకే అప్పగిస్తూ జిల్లా గ్రంథాలయసంస్థ లేఖలు పంపింది. దీంతో గ్రామాల్లోని బీడీసీ కేంద్రాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

తీర్మానాలను అమలు చేయడం లేదు.. - బి.వినయ్‌, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్‌

సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను కార్యదర్శి అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రూ.10 లక్షలతో పుస్తకాల కొనుగోలు, ఫర్నీచర్‌తో పాటు పరకాల గ్రంథాలయంలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తీర్మానించాం. వేటికీ మన్నన దక్కలేదు.

రూ.60 లక్షల బకాయిలు.. - శ్రీలత, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి

జిల్లాలో గతేడాది రూ.కోటి గ్రంథాలయ సెస్సు ఇంకా రూ.63 లక్షలు బకాయిలు పేరుకుపోయాయి. పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలు తప్ప గ్రామపంచాయతీల నుంచి పన్నులు సక్రమంగా వసూలు కావడం లేదు. సకాలంలో పన్నులు చెల్లించాల్సిందిగా గ్రామపంచాయతీలకు లేఖలు రాశాం. గతేడాది రూ.60 వేలు వెచ్చించి ఆన్‌ డిమాండ్‌ పుస్తకాలు కొనుగోలు చేశాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.