close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

భక్తిగీతాల ఆలాపనలో అన్యమత ప్రచారంపై ఫిర్యాదు

అధికారులను వివరణ కోరిన మంత్రి, కమిషనర్‌

ఫిర్యాదు పత్రాన్ని సీఐ సన్యాసిరావుకు అందిస్తున్న దేవస్థానం ఛైర్మన్‌
రోహిత్‌, ఈవో త్రినాథరావు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో ఈనెల 11న కళామందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఓ భజన బృందం భక్తిగీతాల ఆలపిస్తున్న సమయంలో అన్యమతం గురించి ప్రస్తావిస్తూ భజన చేశారని ఫిర్యాదు అందడంతో దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. అన్యమత ప్రచారం జరిగినట్లు ప్రచారం జరగడంతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్లు ఈ విషయమై ఈవోను ఆరాతీసినట్లు తెలిసింది. దీంతో బుధవారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చించారు. ఛైర్మన్‌ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, పలు విభాగాల అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఈవో మాట్లాడుతూ కార్తికమాసం సందర్భంగా దేవస్థానంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 11న ఇర్రిపాకకు చెందిన నటరాజ బాలభక్త సంఘం బృందం భజన చేశారన్నారు. ఈ నేపథ్యంలో భజనలో గాయకుడు అనిమిరెడ్డి నగేష్‌ భక్తిగీతాలు ఆలపిస్తూ రాముడు, అల్లా, ఏసు ఒక్కడే అని మూడు పదాలు ఉచ్చరించారంటూ విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పీఆర్వో విభాగ అధికారులు హుటాహుటిన వెళ్లి భజన నిలిపి వారిని వేదిక నుంచి కిందకు దింపి పోలీసులకు అప్పగించామన్నారు. దీనిపై అన్యమత ప్రచారం జరిగిందని సామాజిక మాధ్యమాలు తదితరవాటి ద్వారా ప్రచారం జరుగుతుందన్నారు. ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను దేవాదాయశాఖ ద్వారా గతంలో నియమించిన భజన గురువుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారినే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేసి కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అనంతరం ఫిర్యాదు కాపీని సీఐ సన్యాసిరావు, ఎస్సై మురళీమోహన్‌కు ఈవో, ఛైర్మన్లు అందించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మూడేళ్లుగా భజనలు చేస్తున్నాం....

సమావేశంలో పాల్గొన్న భజన గురువు పి.ధర్మరాజు మాట్లాడుతూ హిందూధర్మాన్ని కాపాడుకోవడానికి తాము వాడవాడలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సుమారు మూడేళ్లుగా అన్నవరంలో కళావైదికపై భజనలు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మూడేళ్లు గడిచిందన్నారు. ఈనెల 11న ఓ భజన సమాజం తప్పు పాడిందని నా దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే పరిశీలించామన్నారు. 30 ఏళ్ల కిందట ఓ కవి రాసిన పదం ఆధారంగా భజన బృందం పాడిందన్నారు. తిరుపతిలో కూడా భజన చేస్తున్నామని వారు ఎప్పుడూ ఖండించలేదని కూడా బృంద సభ్యులు చెప్పారన్నారు. చిన్న విషయాన్ని పట్టుకుని ఇది తప్పని చెప్పాలిగాని, దీన్ని పెద్దది చేయడం ద్వారా తమని హిందూ ధర్మంలో ఉండమనా, పక్కకుపొమ్మనా ఇదంతా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్యమత ప్రచారం పుకార్లేనన్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.