శుక్రవారం, డిసెంబర్ 06, 2019
ఎక్సైజ్కాలనీ, న్యూస్టుడే
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాల కారణంగా తగ్గిన ఉత్పత్తి ఇందుకు కారణం. మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొనలేక పచ్చళ్లలతో కాలం వెల్లదీస్తున్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఎక్సైజ్కాలనీ రైతుబజార్, బాలసముద్రం కూరగాయల మార్కెట్, వరంగల్ మార్కెట్కు సరకు రాక తగ్గిపోయింది. వచ్చిన సరకు కొద్ది మంది కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. కూరగాయల కొరత కారణంగా రైతు బజార్లలో మధ్యాహ్నం వరకే దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. సరకు తగ్గి డిమాండ్ పెరగడంతో అధిక ధరలు చెల్లించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎక్సైజ్కాలనీ రైతు బజారుకు 300 నుంచి 500 క్వింటాళ్ల కూరగాయలు అవసరం ఉండగా ఇప్పుడు 250 క్వింటళ్ల కూరగాయలు వస్తున్నాయి. బాలసముద్రంలో కూరగాయల మార్కెట్లో 900 నుంచి 1200 క్వింటాళ్ల కూరగాయలు అవసరం కాగా ప్రస్తుతం 500 క్వింటాళ్ల వరకు వస్తున్నాయి. రైతు బజార్తో పాటుగా బాలసముద్రం కూరగాయల మార్కెట్కు పచ్చి మిర్చి 100 క్వింటాళ్ల అవసరం ఉండగా ప్రస్తుతం 60 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. కొత్తిమీర 150 మూటలకు గాను 70 మూటలే వస్తోంది. దీంతో కూరగాయల విక్రయాలు మధ్యాహ్నం వరకు పూర్తవుతున్నాయి..
దిగుబడులు తగ్గాయి
సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షాలు కురవడంతో నేలలో తేమశాతం ఎక్కువై కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పూత పందె రాలిపోవడంతో తక్కువ దిగుబడి వస్తోంది. నేలపై అల్లుకుని పండే తీగ జాతి కూరగాయలైన దొండ, బీర, సోరకాయి, చిక్కుడు వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి. పందిరి సేద్యంలో సాగు చేసే పంటలకు పూత, పిందె రాలిపోవడంతో రైతులు ఈసారి పంటను కోల్పోయారు. వర్షాలకు తెగుళ్ల తీవ్రత అధికమై పచ్చిమిర్చి దిగుబడి బాగా తగ్గింది.
తినలేకున్నాం..
ఎక్సైజ్కాలనీ రైతు బజారులో కిలో బీరకాయ రూ. 68, బెండ రూ. 35, వంకాయ రూ. 45 టమోటా రూ. 40 గోరుచిక్కుడు రూ. 48 వరకు లభిస్తోంది. కొత్తిమీర కట్ట రెట్టింపు ధరకు చేరి రూ. 60కి విక్రయిస్తున్నారు. బచ్చలికూర, గోంగూర మార్కెట్కు సరిగ్గా రావడంలేదు.
మరో రెండు వారాల వరకు ఇదే పరిస్థతి
గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు తగ్గడంతో కూరగాయల పంటలు ఇప్పిడిప్పుడే చేతికి వస్తున్నాయి. ఇప్పుడు పూత, పిందె మొదలైంది. మరో రెండు వారల్లో పంట మార్కెట్కు వస్తోంది. అప్పటిదాకా ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్థానికంగా టమోటా పంట మార్కెట్ వస్తుడడంతో ధర తగ్గుతుంది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు