close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

ఉద్రిక్తత

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యతో మానుకోటలో కార్మికుల ఆందోళన

మృతుడి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌

తండ్రి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు

ర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలంటూ మహబూబాబాద్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ ఆవుల నరేశ్‌ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనతో మానుకోటలో అలజడి రేగింది. కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు ఆసుపత్రిలో నరేశ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మహిళా కార్మికుల రోదనలు మిన్నంటాయి. సమస్యల పరిష్కారానికి తన చావే చివరిది కావాలంటూ ఆయన రాసిన లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. ఆర్టీసీ డిపో వద్ద మృతదేహంతో ఆందోళన నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుగా వచ్చారు. వారిని లెక్క చేయకుండా ముందుకెళ్లారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శనగా నినాదాలు చేసుకుంటూ చేరుకున్నారు. అప్పటికే డిపోనకు రెండు వైపులా ఉన్న మార్గాలకు బారికేడ్లను అడ్డుపెట్టారు. ఇనుప ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. అయినా వాటిని ఛేదించుకుని మృతదేహంతో ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఇనుప ముళ్లకంచెను తొలగించే ప్రయత్నం చేశారు. ఒక కార్మికుడు తీగను మెడకు చుట్టుకున్నారు. అనంతరం మృతదేహంతో ధర్నా నిర్వహించారు.

ఒక్కొక్కరుగా...

గేట్‌ వద్ద నరేశ్‌ మృతదేహాన్ని ఉంచి డిపో ముట్టడించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇక్కడికి చేరుకున్నారు. వారిని మధ్యలోనే అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆర్టీసీ ఐకాస, అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా పాలనాధికారి రావాలంటూ నినదించారు. అప్పటికే ఎస్పీ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేస్తానని చెప్పి వెళ్లారు. గంటన్నర తర్వాత సంయుక్త కలెక్టర్‌ డేవిడ్‌, రెవెన్యూ అధికారులతో కలిసి ఎస్పీ వచ్చారు. ఆర్టీసీ ఐకాస, అఖిలపక్ష పార్టీలలోని ముఖ్యనేతలను ఆర్టీసీ డిపో సమీపంలోని ఓ కళాశాలలో చర్చలకు తీసుకెళ్లారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షలు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండు పడక గదుల ఇల్లు, మూడెకరాల భూమి ఇవ్వాలంటూ డిమాండ్లను అధికారుల ముందుపెట్టారు. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, జేసీ, ఎస్పీ వ్యక్తిగతంగా చెరో లక్ష, రెండు పడక గదుల ఇల్లు, మూడెకరాల భూమి ఇచ్చేందుకు హామీ ఇస్తున్నామని అన్నారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న కార్మికుల, అఖిలపక్ష పార్టీల నాయకులు, మృతుడి కుటుంబ సభ్యుల వద్ద ప్రకటించారు. ఆందోళనను విరమించి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రదర్శనగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నరేశ్‌ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం మరిపెడ మండలం ఎల్లంపేటకు తీసుకెళ్లారు.

భారీగా పోలీసుల మోహరింపు..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్‌, ఖమ్మం కమిషనరేట్‌ , భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు డిపో వద్ద జరుగుతున్న పరిస్థితులను ఎస్పీ కోటిరెడ్డి తెలుసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోచ్చారు.

ఇప్పటికైనా చర్చలు జరపండి..

తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు వీఎస్‌ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి అహంకార పూరితంగా మాట్లాడుతూ కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారమని విమర్శించారు. ఇప్పటికైనా చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రులు సూటిపోటి మాటలు మాట్లాడడం వల్లే కార్మికులు చనిపోతున్నారని ఆరోపించారు. ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ మాట్లాడుతూ న్యాయ సమ్మతమైన కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. తెజస జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ సమాజంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం విషాదకరమన్నారు. నరేశ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ప్రభుత్వం దిగివచ్చేదాకా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్‌సారథి మాట్లాడుతూ కార్మికుల చట్టాలను అమలు చేస్తేనే ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారు. ధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు అజయ్‌సారథి, సోమన్న, మురళీనాయక్‌, రామచంద్రయ్య, బెల్లయ్యనాయక్‌, హరిలాల్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్‌, నాయకులు గోవర్థన్‌, రమేశ్‌, పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బద్రినారాయణ, నాయకులు ప్రవీణ్‌కుమార్‌, గీత, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

భాజపా కార్యకర్తల అరెస్టు..

నరేశ్‌ మృతదేహన్ని శవపరీక్ష కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ నరేశ్‌ తన కుటుంబం కోసం ఆత్మహత్య చేసుకోలేదని తోటి కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ఆత్మబలిదానానికి పాల్పడ్డారన్నారు. కుటుంబానికి తక్షణమే ప్రభుత్వ సాయం అందించాలన్నారు. మహబూబాబాద్‌ వైస్‌ ఎంపీపీ ఎల్ది మల్లయ్య, నేతలు రాంచందర్‌రావు, జె. వెంకటేశ్వర్లు, నరేశ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల బందోబస్తు మధ్య నరేష్‌ అంత్యక్రియలు

మరిపెడ, దంతాలపల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ డ్రైవర్‌ ఆవుల నరేష్‌ అంత్యక్రియలను మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో బుధవారం సాయంత్ర నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల నరేష్‌ స్వగ్రామం. మృతదేహాన్ని ఎల్లంపేటకు తీసుకురావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్పీ కోటిరెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పరామర్శించారు. నరేష్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీసీ ఐకాస నాయకులు, కార్మికులు, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు, కులసంఘాలు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ●

* మంగళవారం అర్ధరాత్రి నరేశ్‌ పురుగుల మందు తాగారు●

* బుధవారం తెల్లవారు జామున 4.00 గంటలకు కుటుంబ సభ్యులు గుర్తించారు●

* 4.15 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు●

* 6: మృతి చెందారు●

* 7.52: కార్మికులు మృతదేహంతో ఆస్పత్రి నుంచి డిపోనకు బయలుదేరారు●

* 8.16: డిపో వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని లోనికి వెళ్లారు

* 8.30 నుంచి: రాజకీయ పార్టీల నాయకులు వస్తూ.. నివాళులర్పించారు●

* 10.47: ఎస్పీ కోటిరెడ్డి డిపో వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ●

* మధ్యాహ్నం 12.10 నుంచి 1 వరకు: ఎస్పీ కోటిరెడ్డి, జేసీ డేవిడ్‌, ఆర్డీవో కొమురయ్య, తహసీల్దార్‌ రంజిత్‌ కలిసి ఆర్టీసీ ఐకాస, అఖిలపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపారు●

* 1.33: డిపో ఎదుట కార్మికులు, నేతలు సమావేశం నిర్వహించారు●

* 2.26: మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు●

* 3.08: శవ పరీక్షలు నిర్వహించారు

* 3.35: మృతదేహాన్ని మరిపెడ మండలం ఎల్లంపేటకు తీసుకెళ్లారు●

* సాయంత్రం 4.30: ఎల్లంపేటకు చేరుకున్నారు●

* 4.45: ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఎల్లంపేటకు వచ్చి నివాళులర్పించారు.

* 6 : అంత్యక్రియలు నిర్వహించారు●

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.