close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

విజ్ఞాన భాగ్యం!
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

చందమామ రావే.. జాబిల్లి తేవే..
కొండెక్కి రావే.. గోగుపూలు తేవే..
అంటూ అమ్మ జోలపాట పాడినా..

* *

అభం శుభం తెలియని మనసులు..
అప్పుడే పూదోటలో పరిమళించిన పువ్వులు..
అంటూ కవులు ఎన్నో కవితలు వినిపించినా..

నేడు మల్లెలు.. రేపు దివ్వెలు..
నేడు ఆశలు.. రేపు ఖ్యాతులు..
అంటూ మరెందరో కొనియాడినా..

*

అప్పుడే విరిసిన మొగ్గలై..
హద్దులు లేని కుతూహలం సొంతమై
ఆకాశాన్నే అందుకోవాలన్న తపన..
కొంగొత్తవి తెలుసుకోవాలన్న జిజ్ఞాస..
మదినిండా ఉట్టిపడే ఉత్సాహం బాలబాలికల సొంతం.
నగరంలో ఎన్నో పరిశోధనా సంస్థలు వారిని రా.. రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
సమున్నత  భారతావనికి పునాదిరాళ్లు కావాలని ఆకాంక్షిస్తున్నాయి.
నేడు బాలల దినోత్సవం సందర్భంగా..
ఆ విజ్ఞాన, పరిశోధనా సంస్థల గురించి..
సమయం అంటే ఏళ్లు గడపడం కాదు.. ఆ సమయంలో మనం ఎలా జీవించాం.. ఆలోచనలు ఎలా అమలు చేశామని..
- జవహర్‌లాల్‌ నెహ్రూ

పరిశోధనలను ఓ పట్టు పట్టేద్దాం!

రసాయన మూలకాల గురించి చదువుతుంటే ఎక్కడ తయారవుతాయి..? పరిశోధన సంస్థలెలా ఉంటాయి..? అనే సందేహాలు వస్తాయి. వీటికి పరిష్కారం చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ  సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ). దీన్ని ప్రత్యేక అనుమతితో సందర్శించొచ్చు.

ఏం నేర్చుకోవచ్చు..
* పరిశోధన కేంద్రాలు ప్రత్యక్షంగా చూడొచ్చు.
* కొత్త సాంకేతిక ప్రయోగాల్ని తెలుసుకోవచ్చు.
* శాస్త్రవేత్తలతో మాట్లాడొచ్చు.
* భూగర్భ జలాలు, అతిసూక్ష్మ సాంకేతికత తెలుసుకోవచ్చు.
* ఇటీవలి ప్రయోగాలు.. వాటి ఫలితాలు చూడొచ్చు.

ప్రవేశ రుసుం..
ఎలాంటి రుసుం లేదు.సంస్థ డైరెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఎలా వెళ్లాలి..?
హబ్సిగూడ క్రాస్‌రోడ్‌ దగ్గర్లో ఈ సంస్థ ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 18, 18ఆర్‌, 290, 245 ఆర్టీసీ బస్సులు అటువైపు నుంచే వెళ్తాయి.

పనివేళలు
సంస్థ అధికారులు అనుమతించిన సమయానికే వెళ్లాలి.

సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీటీ వివరాలకు
0402760387 , 91 4027191234

వెబ్‌ : www.iictindia.org

కణాల కథలు.. అణువుల  ముచ్చట్లు
సీసీఎంబీ

కణాలు, అణువులు, పరమాణువులు తెలుసుకదా.. వాటి గురించి మనకు చెప్పేందుకు శాస్త్రవేత్తలు సీసీఎంబీలో నిరంతరం పని చేస్తుంటారు. ఆ ప్రయోగశాలు తెలుసుకోవాలంటే ఓ సారి వెళ్లి రావాల్సిందే. ఎందుకంటే అంతర్జాలంలో శోధించినా అంతగా అర్థం కాని విషయాలు జీవశాస్త్రవేత్తలతో మాట్లాడి తెలుసుకోవచ్చు.

ఏం నేర్చుకోవచ్చు..
* మానవ శరీర నిర్మాణంలో కణం పాత్ర.
* పరమాణు నిర్మాణం, పనితీరు.
* జీవ శాస్త్ర ప్రయోగాలు.
* కణాల సృష్టి, వాటి ప్రయోగశాలలు చూడొచ్చు.
* శాస్త్రవేత్తలతో మాట్లాడొచ్చు.

ప్రవేశ రుసుం..
ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు.  సీసీఎండీ డైరెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఎలా వెళ్లాలి..?
హబ్సిగూడ క్రాస్‌రోడ్‌ దగ్గర్లో ఈ సంస్థ ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 18, 18ఆర్‌, 290, 245 బస్సులున్నాయి.

పనివేళలు
సంస్థ అధికారులు అనుమతించిన సమయానికి.. 

వివరాలకు
040022231  2716023241

వెబ్‌ : ‌www.ccmb.res.in

ప్రతిభకు పదును.. నేర్చుకునే అదును
జవహర్‌ బాలభవన్‌ 

అభిరుచులు ఏవైనా కేవలం చదువుల్లోనే మునిగి మిగతా కళలకు దూరమవుతుంటారు బాలలు. అలాంటి వాళ్లకు శిక్షణనిచ్చేందుకే ఈ జవహర్‌ బాలభవన్‌. మీలోని ఆసక్తిని గుర్తించి అందుకు తగిన నిపుణులతో బోధన ఉంటుంది. పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న ఈ బాలభవన్‌లో ఇప్పుడు వందల మంది వివిధ కళల్లో శిక్షణ తీసుకుంటున్నారు.

ఏం నేర్చుకోవచ్చు..
* సైన్స్‌ను సులభ రీతిలో ప్రయోగాత్మకంగా వివరిస్తారు.
* ఆటలు, పాటలు, మీలోని కళలకు సానబెడతారు.
* సంగీతంలో అన్ని రకాల వాద్యాలపై సాధన.
* భరతనాట్యం, కూచిపూడిలో స్టెప్పులేయొచ్చు.
* సేవ,  పర్యావరణ సూత్రాలు నేర్పిస్తారు.

ప్రవేశ రుసుం..
బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20. శిక్షణకు 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎలా వెళ్లాలి..?
అసెంబ్లీ వరకు మెట్రోలో వచ్చి.. అక్కడి నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ లోపలికి నడిచి వెళ్లొచ్చు.

పనివేళలు
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు

వివరాలకు
040 23233956

చుక్కల వీధిలో.. చక్కర్లు కొట్టొద్దాం!
బిర్లా నక్షత్రశాల

అంతరిక్షంలో ఏం జరుగుతుంది.. రాకెట్‌ ఎలా ఎగురుతుంది..? వీటిపై ఉపాధ్యాయులు విడమర్చి చెప్పినా ఓ పట్టాన అర్థం కావు. బిర్లా నక్షత్రశాలకు వెళ్తే తెలుసుకోవచ్చు. చుక్కల్లో చెట్టాపట్టాలేసుకుని నడిచినట్లు.. గ్రహాలతో సెల్ఫీ తీసుకున్న అనుభూతి పొందొచ్చు. ఇంకెందుకాలస్యం బిర్లా సైన్స్‌ సెంటర్‌ మీకోసం ఎదురుచూస్తోంది.

ఏం నేర్చుకోవచ్చు..
* విజ్ఞాన కేంద్రంలో గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంతల విశేషాలు తెలుసుకోవచ్చు. అంతరిక్షంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుందిక్కడ.
* నాసా పరిశోధన కేంద్రం నమూనా వీక్షించవచ్చు.
* అంతరిక్ష మ్యూజియంలో రాకెట్‌ ఇంజిన్లు చూడొచ్చు.
* ఇస్రో చేసిన ప్రయోగాల నమూనాలున్నాయి.

ప్రవేశ రుసుం..
* పాఠశాల తరఫున బృందంగా వెళ్తే ఒక్కొక్కరికీ రూ.75
* సాధారణ రుసుం పిల్లలకు రూ.80, పెద్దలకు రూ.150.

ఎలా వెళ్లాలి..?
ఎంఎంటీఎస్‌ ద్వారా లక్డీకాపుల్‌ స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి, రవీంద్రభారతి ఆడిటోరియం కూడలి నుంచి ఆటోలో వెళ్లొచ్చు.

పని వేళలు
ఉదయం 10  గంటల నుంచి రాత్రి 8గంటల వరకు.

పైథాగరస్‌ సిద్ధాంతం పనిపడదాం!

సౌరశక్తి ఎలా వస్తుంది..? విమానం గాల్లోకి ఎలా  ఎగురుతుంది..?  పైథాగరస్‌ సిద్ధాంతం అంటే ఏమిటని పుస్తకాల్లో చదివాం. ఆ ప్రయోగాలు చూడాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నిత్యజీవితంతో సంబంధం ఉన్న ఇలాంటి ప్రయోగాలు ‘డూ సైన్స్‌’ కేంద్రం చూపుతుంది.

ఏం నేర్చుకోవచ్చు..
* శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు.
* పుస్తకాల్లోనివి ప్రయోగాత్మకంగా నేర్చుకోగలం.
* శాస్త్రీయ విషయాలపై సాంకేతిక అవగాహన.
* ఆటలతోనే బోలెడంత విజ్ఞానం సొంతమవుతుంది.
* ఎకో ట్యూబ్‌, మెటల్‌గాంగ్‌, స్పైరల్‌ డిస్క్‌, వంటివి ప్రత్యేకం.

 

ప్రవేశ రుసుం..
ఒక్కొక్కరికీ రూ.50. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రవేశం ఉచితం.

ఎలా వెళ్లాలి..?
ఖైరతాబాద్‌ వరకు మెట్రోలో చేరుకుని అటు నుంచి నెక్లెస్‌ రోడ్డు మీదుగా ఈ కేంద్రానికి చేరుకోవచ్చు.

 

పనివేళలు
ఉదయం 10    గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

నీటి పొదుపుపై.. నేటి కర్తవ్యం
సైన్స్‌ సెంటర్‌
నీటి సంరక్షణ పార్కు

నగరంలో వాననీటి సంరక్షణకో పార్కు ఉందని తెలుసా..! నీటి విలువ తెలుసుకోలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున వృథా చేస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఆ విశేషాలు చెప్పేందుకే రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పార్కు తీర్చిదిద్దారు. మీరూ వెళ్తే ఎలా నీరు పొదుపు చేయాలో అర్థం అవుతుంది.

ఏం నేర్చుకోవచ్చు..
* నీటి పొదుపుపై ఆలోచన రేకెత్తించేలా పలు అంశాలను ఆసక్తికరంగా మలిచారు.
* నీటి పొదుపుపై యానిమేషన్‌ చిత్రాలు చూడొచ్చు..
* చెక్‌డ్యాంల విశిష్టత తెలుసుకోవచ్చు.
* మాట్లాడే చెట్టుతో ప్రకృతి విశేషాలు తెలుసుకోవచ్చు.

ప్రవేశ రుసుం.. 
ప్రవేశం ఉచితం

ఎలా వెళ్లాలి..?
బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 51 నుంచి అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వెళ్లే దారిలో ఉంటుంది.. సికింద్రాబాద్‌ నుంచి 47, కోఠి నుంచి 127 నంబరు బస్సులు అందుబాటులో ఉంటాయి..

పనివేళలు
ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు.

వివరాలకు
155313  04023300114    23433933

చక్రాలపై ప్రయోగం.. ముందుకే శాస్త్రయోగం
సహాయత 

కాబోయే శాస్త్రవేత్తలు, పరిశోధకులను తయారు చేసేందుకు బాల్యంలోనే బీజం వేయాలి. దీనికి తగినట్లుగా ప్రయోగశాలలు, నైపుణ్యంను సమకూర్చగలగాలి.. అని గ్రహించి గ్రేటర్‌ పరిధిలో సైన్స్‌పై సహాయత ట్రస్టు మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ని నిర్వహిస్తోంది.   విద్యార్థులతో నేరుగా ప్రయోగాలు చేయిస్తోంది.

ఏం నేర్చుకోవచ్చు..
* ప్రయోగాంశాల్లో శిక్షణనిస్తుంది.
* భౌతికశాస్త్రం, రసాయశాస్త్రం, జీవశాస్త్రం అంశాల్లో పరిశోధన శాలలున్నాయి.
* పాఠ్యాంశాలను ప్రయోగాత్మంగా వివరిస్తుంది.
* ‘లెర్నింగ్‌ బై డూయింగ్‌’ నినాదంతో దీనికి రూపకల్పన చేశారు.

ప్రవేశ రుసుం..
సేవలు ఉచితం (టెక్‌ మహీంద్రా వంటి సంస్థలు సాయం చేస్తున్నాయి)

ఎక్కడుంది
సహాయత ట్రస్టు ప్రధాన కార్యాలయం న్యూమలక్‌పేటలోని జడ్జికాలనీలో ఉంది. అక్కడికెళ్లి సంప్రదించొచ్చు.

పనివేళలు
సంస్థ ప్రణాళిక వారీగా పాఠశాలలకు వెళ్తారు.

అద్భుతాలు చేసేలా.. అగస్త్య సాయం
అగస్త్య సైన్స్‌

శాస్త్ర సాంకేతికతల్లో ఎంత అవగాహన ఉంటే అంతే మంచి భవిష్యత్తు ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, పాఠశాలల్లో లేని ల్యాబ్‌ సౌకర్యాలతో వాటికి దూరమవుతారు. అలాంటి వాళ్ల కోసమే ఈ అగస్త్య ఫౌండేషన్‌. మన నగరంలోనూ 7 పాఠశాలల్లో ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు.

ఏం నేర్చుకోవచ్చు..
* మీరే ప్రయోగాలు చేసుకోవచ్చు.
* పాఠాల్లో చదువుకున్న శాస్త్ర పరికరాలు చూడొచ్చు.
* ప్రస్తుతం 15 సంచార ప్రయోగశాలలు ఉన్నాయి.
* నిపుణుల మీ సందేహాలకు సమాధానాలూ ఇస్తారు.

ప్రవేశ రుసుం..
అంతా ఉచితం. ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండురోజుల ముందే అగస్త్య ప్రతినిధులను సంప్రదించాలి.

ఎక్కడెక్కడ ఉన్నాయి
యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లింగంపల్లి ప్రభుత్వ పాఠశాల, ఆర్సీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కేంద్రాలున్నాయి.

 

పనివేళలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు

ఆహార పాఠాలు.. ఆకళింపు చేసుకుందాం!
ఎన్‌ఐఎన్‌

పోషకాహారం తీసుకోవాలని తెలుసు. మరి మారిన జీవన శైలిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అనే దానిపై పరిశోధనలు చేస్తుందీ సంస్థ. ఏ పదార్థంలో ఎన్ని పోషకాలు దాగున్నాయో చెప్పేందుకు నిత్యం ప్రయోగాలు చేస్తున్న వారు తార్నాక దగ్గర్లోని జాతీయ పోషకాహార సంస్థలో ఉన్నారు.  బాలల సందర్శనకు ఆహ్వానం పలుకుతోంది.

ఏం నేర్చుకోవచ్చు..
* ఇక్కడి న్యూట్రీషన్‌ మ్యూజియంలో వివిధ రకాల ఆహార పంటల వంగడాలను చూడొచ్చు.
* పోషకాహార విలువలు, ఆహార అలవాట్లు, సమతుల ఆహారంపై నిపుణులు చెప్పే తరగతులు వినొచ్చు.
* ఈ శాస్త్ర పరిశోధన రంగంలోకి రావాలంటే ఏం చేయాలో శాస్త్రవేత్తలతో తెలుసుకోవచ్చు.

ఎంతమంది వెళ్లొచ్చు..?
ఒకేసారి వంద నుంచి 150మంది వరకు వెళ్లే అవకాశముంది. ఎక్కువ మంది ఉంటే బ్యాచ్‌లు చేసి రెండు రోజులు అవకాశం ఇస్తారు.

ఎలా వెళ్లాలి..?
సికింద్రాబాద్‌ నుంచి తార్నాక వెళ్లే ఏ బస్సులో అయినా వెళ్లొచ్చు. తార్నాకలో దిగి నడుస్తూ కేంద్రానికి వెళ్లొచ్చు.

పనివేళలు
సోమవారం నుంచి శనివారం వరకు.. ఉ.10గం. నుంచి సా. 5గం. వరకు.

ప్రయోగాలు చూద్దాం.. చేసేద్దాం..!
భారతీయ విద్యాభవన్‌

ఆసక్తి ఉన్న విద్యార్థులకు సహకారం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. విభిన్న ఆవిష్కరణలకు ప్రాణం పోయొచ్చు అని గ్రహించి ఆ పని చేస్తోంది జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌ పాఠశాల.  కేంద్ర  ప్రభుత్వ సహకారంతో నిర్మించిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌తో నిపుణులు వచ్చి శాస్త్రసాంకేతిక అంశాలపై శిక్షణనిస్తారు.

ఏం నేర్చుకోవచ్చు
* రోబోటిక్స్‌ తయారీపై ప్రతిరోజు నిపుణులు శిక్షణ  ఇస్తున్నారు.
* శాస్త్ర పరికరాలు, ఆట వస్తువుల్ని, గృహోపకరణాల్ని తయారు చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూడొచ్చు.
* రోబోటిక్స్‌ తయారీపై నిపుణుల శిక్షణలో అవగాహన పెంచుకొని, పరిశోధనలో భాగమవ్వొచ్చు.

ప్రవేశ రుసుం..
ఏమీ లేదు. ముందస్తు దరఖాస్తు చేసుకుంటే.. పరిశీలించి శిక్షణ ఇప్పిస్తారు

ఎలా వెళ్లాలి..?
సికింద్రాబాద్‌ నుంచి 47ఎఫ్‌, 47ఎల్‌ బస్సులు వయా ఎల్వీ ప్రసాద్‌ నేత్రవైద్యాలయం మీదుగా ఉంటాయి.

పనివేళలు
ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం 3వరకు

అపురూప వస్తువుల్లో.. అరుదైన చరిత్ర
సాలార్‌జంగ్‌ మ్యూజియం

రాజ్యాలు.. రాజులు పోయినా ఆనాటి గురుతులు ఉన్నాయి. ఆ కాలంలో ప్రజల పద్ధతులు, అలవాట్లు చెప్పే వస్తువులు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. వాటిని చూస్తే చరిత్ర పాఠాలు చదివేటప్పుడు మీ కళ్ల ముందే ఆయా పాత్రలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి పిల్లల విభాగాన్ని ఇప్పుడు ఆధునికీకరించారు.

ఏం నేర్చుకోవచ్చు..
* రాగి, వెండి, బంగారు నాణేలూ ఉన్నాయి.
* ప్రాచీన, మధ్య యుగాల్లో దేశాన్ని పాలించిన చక్రవర్తుల చిత్రాలు, పేర్లు, ముద్రలు ఉన్నాయి.
* ఇక్కడ కొత్తగా పిల్లల గ్యాలరీ ఏర్పాటు చేశారు.
* ఇక్కడి భారతీయ విభాగంలో 9, 10 గదులు ప్రత్యేకంగా పిల్లలకే కేటాయించారు.

ప్రవేశ రుసుం..
* పిల్లలకు రూ.5
* పెద్దలకు రూ.10

ఎలా వెళ్లాలి..?
దిల్‌సుఖ్‌నగర్‌ మీదుగా వెళ్లే 72 నంబరు బస్సు ఎక్కి పురానాపుల్‌ బస్టాప్‌లో దిగి, నడిచి వెళ్లొచ్చు.

పనివేళలు
ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు

అద్భుతాలు చేసేలా.. అగస్త్య సాయం
అగస్త్య సైన్స్‌

శాస్త్ర సాంకేతికతల్లో ఎంత అవగాహన ఉంటే అంతే మంచి భవిష్యత్తు ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, పాఠశాలల్లో లేని ల్యాబ్‌ సౌకర్యాలతో వాటికి దూరమవుతారు. అలాంటి వాళ్ల కోసమే ఈ అగస్త్య ఫౌండేషన్‌. మన నగరంలోనూ 7 పాఠశాలల్లో ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు.

ఏం నేర్చుకోవచ్చు..
* మీరే ప్రయోగాలు చేసుకోవచ్చు.
* పాఠాల్లో చదువుకున్న శాస్త్ర పరికరాలు చూడొచ్చు.
* ప్రస్తుతం 15 సంచార ప్రయోగశాలలు ఉన్నాయి.
* నిపుణుల మీ సందేహాలకు సమాధానాలూ ఇస్తారు.

ప్రవేశ రుసుం..
అంతా ఉచితం. ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండురోజుల ముందే అగస్త్య ప్రతినిధులను సంప్రదించాలి.

ఎక్కడెక్కడ ఉన్నాయి
యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లింగంపల్లి ప్రభుత్వ పాఠశాల, ఆర్సీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కేంద్రాలున్నాయి.

పనివేళలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.