close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

రూ.200 కోట్లతో అనుబంధ రోడ్లు

 విస్తరణతో 100 కి.మీ.మేర అందుబాటులోకి..
 ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకే!
 ఇక భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ
 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన రహదారులపై వాహన రద్దీని నియంత్రించేందుకు అనుబంధ దారులను (స్లిప్‌ రోడ్లు) అందుబాటులోకి తెస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు, పౌరుల నుంచి అందిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటివరకు 100కి.మీ. రహదారులు లెక్క తేలాయన్నారు. వాటి విస్తరణకు అంచనాగా రూ.200కోట్లు ఖర్చవుతుందన్నారు. అందులో కేవలం భూసేకరణకే రూ.130కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఆయన బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

హైదరాబాద్‌ మహానగరంలో రూ.3వేల కోట్ల విలువైన పైవంతెనలు, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్డీపీ)లో భాగంగా చేపట్టిన ఆ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో టర్మ్‌లోన్‌ కింద రూ.2,500కోట్ల నిధులు సేకరించేందుకు రంగం సిద్ధం చేశామని కమిషనర్‌ చెప్పారు. బాండ్ల జారీ ద్వారా ఇప్పటికే రూ.495కోట్లు తీసుకున్నామన్నారు. నగరవ్యాప్తంగా 709కి.మీ.ల ప్రధాన రహదారుల నిర్వహణను ఐదేళ్లపాటు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందని, రెండు నెలల్లో ఆయా పనులు మొదలవుతాయని తెలిపారు.  ఇకపై 75శాతం నుంచి 80శాతం భూసేకరణ పూర్తయ్యాకే టెండర్లకు వెళ్తామని అన్నారు.

త్వరలో ఇళ్ల కేటాయింపు
‘నగరవ్యాప్తంగా 41 మురికివాడలను ఖాళీ చేయించి, అక్కడే రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాం. 9వేల ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రెండు నెలల్లో సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆయా ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తారు. మరో 49 వేల ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇళ్లనూ లబ్ధిదారులకు కేటాయించనున్నాం ’అని లోకేష్‌కుమార్‌ తెలిపారు. నగరవ్యాప్తంగా 27 ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రాంతాలున్నాయి. అక్కడ రోజంతా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించే పనులు నడుస్తున్నాయి అని కమిషనర్‌ వివరించారు.

ఆదర్శంగా తరలింపు కేంద్రాలు
నగరవ్యాప్తంగా దీపావళి అనంతరం 8,200 టన్నుల చెత్త తయారైంది. అదంతా 18 తరలింపు కేంద్రాలకు చేరుతాయి. అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. తరలింపు కేంద్రాల్లో  వాలీబాల్‌ ఆడుకునేంత పరిశుభ్ర వాతావరణాన్ని తీసుకొచ్చాం అని కమిషనర్‌ చెప్పారు.

ఇకముందు నిర్మాణ వ్యర్థాల వంతు
‘ఇళ్లల్లోని పాత సామాన్లను పది రోజులపాటు ముమ్మరంగా సేకరించాం. 235 మెట్రిక్‌ టన్నుల వస్తువులు పోగయ్యాయి. అదే తరహాలో ఇక భవన నిర్మాణ వ్యర్థాలను సేకరిస్తాం. వాహనాలను సిద్ధం చేసుకుని ఖాళీ స్థలాలు, నాలా పరీవాహక ప్రాంతాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను సేకరించి తరలించి నగర వాతావరణాన్ని అందంగా తీర్చిదిద్దుతాం’ అని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ వివరించారు.

రోడ్లకు సర్కారు నిధులు
‘రహదారుల సమగ్ర నిర్వహణ(సీఆర్‌ఎం) కింద ఎంపిక చేసిన 709కి.మీ.ల ప్రధాన రోడ్ల నిర్వహణకు ఏటా సుమారు రూ.350కోట్లు అవసరం. అందుకు సాయం చేస్తామని ప్రభుత్వం ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించింది. ఫలితంగా బల్దియాపై రోడ్ల నిర్వహణ భారం తగ్గుతుంది. అంతర్గత రోడ్ల అభివృద్ధికి, ఇతర నిర్వహణ పనులకు నిధుల కొరత దూరమవుతుంది’ అని ఆయన    వెల్లడించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.