close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

వినోదాల వేదికపై తెలుగు వెలుగులు

వినూత్న వీడియోలతో యూట్యూబ్‌లో గుర్తింపు
విశేష ఆదరణ పొందుతున్న నటీనటులు

కాలక్షేపానికి ఓ వెబ్‌ సిరీస్‌.. ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఓ కామెడీ వీడియో.. గృహిణులకు వంటలు.. యువతులకు బ్యూటీ టిప్స్‌.. వీటన్నింటినీ వీక్షించేందుకు ఎంచుకునే వేదిక యూట్యూబ్‌.  యూట్యూబ్‌ వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు వీక్షకుల విశేష అభిమానం సాధించిన యూట్యూబర్లతో ‘యూట్యూబ్‌ తెలుగు డే’ నిర్వహించింది ఆ సంస్థ. సోమవారం గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన సెలబ్రిటీలు ‘ఈనాడు’తో పలు విషయాలు వెల్లడించారు. వారి ప్రస్థానం, అనుభవాలు వారి మాటల్లోనే..

 ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఇక్కడ మనకు నచ్చినట్లు ఉండొచ్చు
కొణిదెల నిహారిక, తెలుగు నటి

ఓ నటిగా, నిర్మాతగా, రచయితగా నాకు ఈ వేదికపైనే గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ మన సొంత నిర్ణయాలతో మనకు నచ్చినట్లు నటించొచ్చు, కథలు తయారుచేసుకోవచ్చు. ఇందులోనే సంతృప్తి ఉంది. దీనికి ఆదరణ కూడా ఎక్కువే. కాలానికి అనుగుణంగా జనం కూడా మారిపోతున్నారు. సినిమా థియేటర్లకు వెళ్లి చూసే వాళ్లు తక్కువై.. స్మార్ట్‌ ఫోన్లు, ఓటీటీ వేదికల్లో సినిమా వస్తే చూసేద్దామనుకునేవాళ్లు ఎక్కువవుతున్నారు. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కొన్నిరోజుల వరకు లఘుచిత్రాల సందడి సాగింది. ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌ల కోసమే చూస్తున్నారు. ఇందుకోసమే ఐదేళ్ల క్రితమే ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే మొదటి వెబ్‌సిరీస్‌ను మొదలు పెట్టాం. దక్షిణ భారతదేశంలో తొలి వెబ్‌సిరీస్‌ మాదే. దేశంలోనే వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తొలి వెబ్‌సిరీస్‌ ముద్దపప్పు ఆవకాయ. దానికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ ‘మ్యాడ్‌ హౌస్‌’ పేరుతో మరో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాం.

నువ్వు నీలా ఉంటేనే గుర్తింపు: జాహ్నవి, మహాతల్లి ఫేమ్‌

సినిమాల్లోకి వచ్చేవాళ్లు, లఘుచిత్రాలు తీసే కొందరు యువత ఎవరినో అనుసరిస్తూ.. వాళ్లలాగే మేం చేయాలి, వాళ్లలాగే ఉండాలి అని తపిస్తున్నారు. అలా ఎన్నిరోజులు చేసినా గుర్తింపు ఉండదు. అభిమానుల్లో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలంటే ఎలా ఉన్నామో అలా సహజంగా వీడియోలో చూపించాలి. ఇప్పుడు నేను చేసే ‘మహాతల్లి’ ప్రతిదీ నిజజీవితంలో మన కుటుంబంలో జరిగే విషయాలే. అందుకే ప్రతి ఒక్కరికీ అది చేరింది. తక్కువ సమయంలో 1.39మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు వచ్చారు. వినూత్నంగా ఆలోచించి ప్రజల ముందుకు రండి.

యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నా..
- స్వప్న, స్మార్ట్‌ తెలుగు హౌస్‌వైఫ్‌ ఫేం

ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ రంగంవైపు వచ్చాను. ఈటీవీలో వచ్చే ‘యువ’ కార్యక్రమంలో వచ్చిన ఓ వీడియో చూసి రంగంపై అవగాహన వచ్చింది. అదే ప్రేరణతో వీడియోలు తీయడం, అప్‌లోడ్‌ చేయడం తదితర అన్ని విషయాలు అంతర్జాలంలో చూసి సొంతంగా నేర్చుకున్నా. పెళ్లయ్యాక ఇంటినుంచే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల గురించే చెప్పాలనే ఆలోచనకు వచ్చాను. అప్పుడే స్మార్ట్‌ తెలుగు హౌస్‌వైఫ్‌ ఛానల్‌ ప్రారంభించి గృహిణులు, యువతులకు అవసరమైన విషయాలు చెబుతున్నాను. ఆరోగ్యం, ఫ్యాషన్‌, అందానికి సంబంధించిన కొత్త అంశాల్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా స్వప్నాస్‌ కిచెన్‌ పేరుతో మరో ఛానెల్‌ ప్రారంభించి తెలుగింటి వంటకాల్ని పరిచయం చేస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు మూడులక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఆదరించారు. ఇంకా మరింత మందికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను.

యూట్యూబ్‌కు తెలుగులో ఆదరణ అధికం
ప్రాంతీయ భాషల్లో వీక్షకులు పెరిగారు..
‘ఈనాడు’తో యూట్యూబ్‌ కంటెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ డైరెక్టర్‌ సత్య రాఘవన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అంతర్జాలంలో ఎలాంటి విజ్ఞాన, వినోదదాయక అంశాలు కావాలన్నా ‘గూగుల్‌’ను అన్వేషిస్తుంటాం. మరి వాటిని దృశ్యరూపకంగా వీక్షించాలంటే మాత్రం ‘యూట్యూబ్‌’ తప్పనిసరి.. మాతృసంస్థ గూగుల్‌ నుంచి వెలువడిన ఈ వేదిక కొద్దికాలంలోనే విస్తృత ప్రాచుర్యం పొందింది. హిందీ, ఆంగ్లంలో ఎక్కువ వీక్షకులున్న యూట్యూబ్‌కి ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ పెరిగారంటున్నారు భారత్‌లో యూట్యూబ్‌ కంటెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ డైరెక్టర్‌గా ఉన్న సత్య రాఘవన్‌. హైదరాబాద్‌లోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘యూట్యూబ్‌ తెలుగు డే’ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏమన్నారంటే..

ప్రతిభావంతులను పరిచయం చేసింది..

యూట్యూబ్‌ ఎందరికో జీవితాన్నిచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతిభావంతులనూ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. వారు చక్కటి గుర్తింపు, మంచి భవిష్యత్తు సంపాదించుకున్నారు. యూట్యూబ్‌ పూర్తిగా స్ఫూర్తిపైనే నడుస్తోంది.

‘ఈటీవీ’ కీలకపాత్ర

2015 నుంచి ప్రాంతీయ భాషల్లో వీక్షకుల సంఖ్య పెరిగింది. దక్షిణ భారతదేశంలో పంజాబీ, బెంగాలీ, కన్నడ, తెలుగు ఈ జాబితాలో ఉండగా.. తెలుగులో ఆదరణ మరింత ఎక్కువ. అందులో కీలకపాత్ర ‘ఈటీవీ’ వంటి చానళ్లు పోషించాయి. గతేడాదితో పోలిస్తే తెలుగులో వీక్షణ సమయం 60శాతం పెరిగింది. తెలుగులో 80కి పైగా చానళ్లకు 5-10లక్షల మంది ఉన్నారు. వయసుతో తేడా లేకుండా వినోదాన్ని పంచుతున్నాం. ఇప్పుడు వెబ్‌సిరీస్‌ల కాలం నడుస్తోంది. ఏటా కొత్తవారికి కార్యశాల నిర్వహిస్తున్నాం. వీక్షకుల సంఖ్యను బట్టి డబ్బులు, ప్రోత్సాహక బహుమతులతో ప్రోత్సహిస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.