శుక్రవారం, డిసెంబర్ 06, 2019
హన్మంతు(పాత చిత్రం)
నర్సంపేట, న్యూస్టుడే: మాతృమూర్తి మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురై కొడుకు కూడా తుదిశ్వాస విడిచిన సంఘటన బుధవారం నర్సంపేట పట్టణంలో వెలుగు చూసింది. కాలనీవాసులు, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. నర్సంపేట గంగపుత్ర కాలనీకి చెందిన అంబటి లక్ష్మి, సమ్మయ్య దంపతులకు మొత్తం అయిదుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కుమార్తెలకు వివాహమవగా, వేర్వేరు కారణాలతో ఇద్దరు కుమారులు కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. పదేళ్ల క్రితం సమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా..తల్లితోనే చిన్న కుమారుడు హన్మంతు ఉంటూ ఆమె యోగక్షేమాలను చూసుకునే వారు. అవివాహితుడైన హన్మంతు(40)వారి కొద్దిపాటి వ్యవసాయ భూమిని కౌలుకిచ్చి సాగు చేసుకుంటూ స్థానికంగా పనులు చేస్తూ జీవిస్తున్నాడు. పెద్దవారైన ఇద్దరు కుమారులు పెళ్లిళ్లు కాకముందే మృతి చెందడంతో హన్మంతును ఆ మాతృమూర్తి గారాబంగా చూసుకునేది. ఈ క్రమంలో సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం తల్లి లక్ష్మి అసువులు బాసింది. దీంతో తీవ్రంగా కుంగుబాటుకు గురైన హన్మంతు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తల్లీకొడుకులు మృతి చెందడంతో ఆ కాలనీ ప్రజల్లో తీవ్ర విషాదం అలముకొంది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు