close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

అక్రమ బాట.. ఆర్జనలో వాటా!

 విద్యుత్తు ఉపకేంద్రం టెండర్లలో గోల్‌మాల్‌
 ఎల్‌1గా అర్హత లేని సంస్థ ఎంపిక
 రూ.4 కోట్ల పనుల్లో డిస్కంలో చక్రం తిప్పిన ఓ డైరెక్టర్‌
ఈనాడు, హైదరాబాద్‌

విద్యుత్తు పంపిణీ సంస్థలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలు తోసిరాజని అయినవాళ్లకు ఇష్టారాజ్యంగా పనులు పంచి పెడుతూ అందినకాడికి దండుకుంటున్నారు కొందరు విద్యుత్తు ఇంజినీర్లు. అవినీతి దాహానికి అడ్డొచ్చిన నిబంధనలను అడ్డగోలుగా మారుస్తున్నారు. తనకు అనుకూలుడైన ఓ గుత్తేదారుకు అర్హత లేకపోయినా నిబంధనలు మార్చేసి రూ.4 కోట్ల పనులు అప్పగించేందుకు ఓ డైరెక్టర్‌ చక్రం తిప్పినట్లు సమాచారం. సంబంధిత దస్త్రాలు ఆగమేఘాల మీద కదులుతున్నాయి. కొందరు అధికారులే దగ్గరుండి దస్త్రాలను మోసుకెళుతున్న తీరు దళారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గ్రేటర్‌ పరిధిలో పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త విద్యుత్తు ఉపకేంద్రాలను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) నిర్మిస్తోంది. డిస్కంలోని మాస్టర్‌ ప్లాన్‌ విభాగం ఈ బాధ్యతలు చూస్తోంది. సైబర్‌సిటీ సర్కిల్‌ పరిధిలోని పుప్పాలగూడ సర్వే నెంబరు 319లో కొత్తగా 33/11 కేవీ ఇండోర్‌
విద్యుత్తు ఉపకేంద్రానికి మాస్టార్‌ప్లాన్‌ టెండర్‌ పిలిచింది. పనుల అంచనా విలువ రూ.3.83 కోట్లు. ఈ పనులు దక్కించుకోవాలంటే టెండర్‌ వేసిన సంస్థల సాంకేతికత అర్హత చూస్తారు. అర్హత సాధించిన బిడ్లలో ఎల్‌1గా నిల్చిన సంస్థకు టెండరు కట్టబెడతారు.
* టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాని ప్రకారం సాంకేతికత అర్హత  సాధించాలంటే డిస్కంలో గత ఐదేళ్లలో ప్రధాన(ప్రైమ్‌) కాంట్రాక్టర్‌గా నమోదై ఉండాలి. ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఉపకేంద్రాలు, 33కేవీ, 11కేవీ లైన్లు, టవర్ల నిర్మాణ పనులు గతంలో చేసిన అనుభవం ఉండాలి. కనీసం 25 శాతం పనులు చేసి ఉండాలి.

అధికారులను తప్పించి మరీ.. పుప్పాలగూడ ఉపకేంద్రం టెండర్‌లో డిస్కంలో ప్రైమ్‌ కాంట్రాక్టర్‌ కాని, ప్రైవేటు పనులే తప్ప డిస్కంలో ఉపకేంద్రాల నిర్మాణం చేసిన అనుభవం లేని ఓ సంస్థ టెండర్‌ వేసింది.  కొందరు ఇంజినీర్లు. సాధారణంగా టెక్నికల్‌ బిడ్లను మాస్టర్‌ప్లాన్‌లో ఏడీఈ చూస్తారు.  నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరున్న ఏడీఈని ముందే బదిలీ చేశారు. ఇక్కడి నుంచి ప్రాజెక్ట్‌ విభాగానికి పరిశీలనకు వెళ్లగా పరిశీలించిన డీఈ ఆ సంస్థకు అర్హత లేదని నోట్‌ ఫైల్‌ రాశారు. పై అధికారి  ఇది పెద్దల వ్యవహారం అని చెప్పి నోట్‌ ఫైల్‌ చించేశారు. చివరకు సీజీఎం కార్యాలయానికి సదరు సంస్థను ప్రైస్‌ బిడ్లకు అనుమతించాలని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చింది. బిడ్లను తెరిచే అధికారం ఉన్న సదరు అధికారి గతంలో ఇలాంటి బిడ్లను డిస్కం తిరస్కరించిందనే విషయాన్ని చెబుతూ.. నిబంధనలకు విరుద్ధంగా తాను చేయలేనని స్పష్టం చేశారు. దాంతో సదరు సంస్థకు ఎలాగైనా టెండర్‌ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చిన పై స్థాయి వ్యక్తి రంగంలోకి దిగారు. ఏకంగా ఒక డైరెక్టరే ఇందులో ఉండటంతో బోర్డులో ఆమోదం వచ్చింది. సాంకేతిక అర్హత నిబంధనలను పక్కనపెట్టి సదరు సంస్థకు అర్హత కల్పించారు. ఇటీవల ప్రైస్‌ బిడ్లను తెరవగా ఆ సంస్థ 20 శాతం తక్కువకు కోట్‌ చేయడంతో ఎల్‌1గా నిల్చింది.  అర్హతలు ఉన్న మరో రెండు సంస్థలు 15 శాతం, 13 శాతం తక్కువకు కోట్‌ చేశాయి. సాధారణంగా టెండర్లలో ఎల్‌1 సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు నెలల తరబడి సమయం తీసుకునే అధికారులు ఇక్కడ మాత్రం శరవేగంగా దస్త్రాలు కదిలాయి. ఏడీఈ నుంచి ఎస్‌ఈ స్థాయి వరకు కొందరు అధికారులే దగ్గర్నుండి మరి దస్త్రాలను మోసుకెళ్లారు. నేడో.. రేపో వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.