close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

డిగ్రీ విద్యార్థులకు అగ్ని‘పరీక్ష’!

 సిలబస్‌ పూర్తికాక అవస్థలు
 సమ్మె నేపథ్యంలో రవాణాకు ఇబ్బందులు

ఒకవైపు ప్రవేశాలు ఆలస్యం కావడం.. మరోవైపు ఆర్టీసీ సమ్మె.. దీంతో తరగతులు సరిగా సాగక.. సిలబస్‌ పూర్తికాక.. కళాశాలలకు విద్యార్థులు హాజరయ్యే వీలులేక.. డిగ్రీ, పీజీ విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు సెమిస్ట్టర్‌ పరీక్షల రూపంలో వారి ముంగిట మరో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. సిలబస్‌ పూర్తి కాకపోయినా.. విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే వీలు లేకపోయినా పరీక్షల నిర్వహణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్ధమైంది. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో సమ్మె ముగిసే వరకు వాయిదా వేయాలని విద్యార్థులు, ప్రైవేటుకళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 19వ తేదీ నుంచి డిగ్రీ.. 30వ తేదీ నుంచి పీజీ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్ట్టర్‌, మూడో సంవత్సరం విద్యార్థులకు ఐదో సెమిస్ట్టర్‌ పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒకటో సెమిస్ట్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది దోస్త్‌ ప్రవేశాలు ఆలస్యం కావడంతో డిగ్రీ తరగతులపై ప్రభావం పడింది. సెప్టెంబరు చివరి వరకు ప్రవేశాలు కొనసాగాయి. కోర్సులు, కళాశాలల మార్పిడికి విద్యార్థులకు అవకాశం ఇవ్వడం.. ఇలా మరికొంత ఆలస్యమైంది. సెమిస్ట్టర్‌ పూర్తి కావాలంటే 90 రోజులపాటు తరగతులు జరగాలి. ఈ లెక్క ప్రకారం మొదటి సంవత్సరం విద్యార్థులకు మూడు నెలలు తరగతులు జరిగాయా.. అన్న అనుమానం నెలకొంది. కోర్సులు, కళాశాలల మార్పిడితో విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరు కాలేకపోయారు. గత నెలలో ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవుల తర్వాత వారం ఆలస్యంగా తరగతులు ప్రారంభించారు. ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం నానా పాట్లు పడి కళాశాలలకు వస్తున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు డిగ్రీ, పీజీ కళాశాలలు నగర శివారులోనే ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు కళాశాలలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ బస్సులు తిరగక.. సొంత వాహనాలు లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడలేక నిత్యం కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఒకరోజు వెళితే మరోరోజు వెళ్లలేని పరిస్థితి. దీని కారణంగా ఇప్పుడు హాజరు శాతం కూడా తగ్గిపోతున్న పరిస్థితి. వాస్తవానికి మొత్తం జరిగిన తరగతుల్లో 70 శాతం హాజరు ఉండాల్సి ఉండగా.. ఇప్పుడు నిత్యం కళాశాలకు వెళ్లే పరిస్థితులు లేక హాజరు శాతం తగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది. డిగ్రీ పరీక్షల ప్రకారం తొలుత ఇచ్చిన సమయసారిణి మేరకు డిగ్రీ పరీక్షలు ఈ నెల 13 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మె నేపథ్యంలో వారం రోజులు తరగతులు వాయిదా పడటంతో 19 నుంచి రీషెడ్యూల్‌ చేశారు. తాజా పరిస్థితుల దృష్ట్యా సిలబస్‌ పూర్తి కాకపోవడంతో మరికొన్ని రోజులు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

రెండు రోజుల్లో నిర్ణయం
- ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌, పరీక్షల నియంత్రణాధికారి, ఓయూ
పరీక్షలు అనుకున్న సమయానికి నిర్వహించకపోతే విద్యాసంవత్సరంపై ప్రభావం పడుతుంది. విద్యార్థుల హాజరు శాతం పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇప్పటికే వారం రోజులు పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తునాం. తాజాగా విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల నుంచి వస్తున్న వినతులను పరిశీలిస్తున్నాం. రెండు రోజుల్లో ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.