close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

పుర పాఠశాలల్లో ‘స్వచ్ఛత’

● డిసెంబరు 14 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

● నాలుగు దశల్లో అమలు


తాడేపల్లిగూడెంలోని పురపాలక సంఘ ఉన్నతపాఠశాల

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే పురపాలక పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని నెల రోజుల పాటు నిర్వహించేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మొత్తం నాలుగు దశల్లో పారిశుద్ధ్య పనులు, అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టనున్నారు. తొలిదశ గురువారం ప్రారంభం కాగా.. డిసెంబరు 14 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

జిల్లాలో ఏలూరు నగర పాలక సంస్థతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పురపాలికల్లో మొత్తం 2104 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరిలో 626 మంది శాశ్వత ఉద్యోగులు కాగా మిగిలిన 1388 మంది పొరుగుసేవల సిబ్బంది. వీరంతా డిసెంబరు 14 వరకు పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు.

ప్రాధాన్యత ప్రకారం పనులు

పురపాలక కమిషనర్లు దోమల నివారణ, పచ్చదనం, శుభ్రత చర్యలను పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం చేపట్టాలి. చివరికి అన్నింటిలో ఈ కార్యక్రమం అమలుచేయాలి. నూతనంగా ఉద్యోగం సాధించిన వార్డు కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేయాలి. సరికొత్త ఆలోచనలు పంచుకునేందుకు, రోజువారీ కార్యక్రమాలను చిత్రాల రూపంలో పంపించేందుకు వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేశారు.

మొదటి దశ ( నవంబరు 14 నుంచి 23 వరకు)

మొదటి దశలో పాఠశాల పరిసరాలు, వెలుపలున్న చెత్తాచెదారాన్ని దూరంగా తరలించాలి. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించాలి. మురుగునీటి బోదెలు, పల్లపు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పల్లంగా ఉన్న క్రీడా మైదానాలను పూడ్చి చదును చేయాలి. తాగునీటి సరఫరా, మరుగుదొడ్లకు సంబంధించి చిన్నపాటి మరమ్మతులు చేయించాలి.

రెండో దశ (నవంబరు 25 నుంచి 30 వరకు)

స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్‌ల సహకారంతో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలి. దీనిలో భాగంగా ఆవరణల్లో మొక్కలు నాటాలి. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించాలి. ఎంపిక చేసిన పాఠశాలల్లో సేంద్రియ ఎరువు తయారుచేసేందుకు గొయ్యిలు తవ్వి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు, సేంద్రియ ఎరువుల వినియోగం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి.

మూడో దశ (డిసెంబరు 2 నుంచి 7 వరకు)

ఐఈసీ (ఇన్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌) కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిషనర్‌, ఏఎన్‌ఎంలు, ఎన్‌జీవోలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఘనవ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం అనే అంశంపై విద్యార్థులకు రాత పరీక్ష, క్విజ్‌, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలి. పాఠశాలల్లో శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.

నాలుగో దశ ( డిసెంబరు 9 నుంచి 14 వరకు)

విద్యార్థులకు శుభ్రత, ఆరోగ్యంపై వైద్యులతో అవగాహన కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.