close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

రైతులకు... ప్రాణ జింకటం

లక్షల హెక్టార్లలో ఏటా పంట నష్టం

పార్కు ఏర్పాటు ఉత్త మాటేనా!

వేటగాళ్ల ఉచ్చులో వన్యప్రాణులు

సాగైన పత్తి పొలంలో గుడిసె వేసుకుని జింకలకు కావలి కాస్తున్న రైతు పేరు మాబుసాహెబ్‌. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామంలోని తన పొలంలో సాగు చేసిన పత్తి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జింకలు నాశనం చేస్తాయని ఆయన రేయింబవళ్లు పొలంలో ఉంటూ జింకలు రాకుండా శబ్దాలు చేస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.

పత్తికొండ, ఆలూరు గ్రామీణ, డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జింకల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఏటా సాగైన పంటలపై మందలుగా పడి నాశనం చేస్తున్నాయి. హొళగుంద, హాలహర్వి, ఆస్పరి, పెద్దకడబూరు, ఆలూరు, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, డోన్‌, ప్యాపిలి, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో జింకలు పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. వేటగాళ్లు నిత్యం జింకలను వేటాడి వాటి మాంసంతో వ్యాపారం సాగిస్తున్నారు. జింకల బారి నుంచి పంటలను కాపాడాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం జింకల పార్కు ఏర్పాటు చేస్తామని చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నాయి. జిల్లాలో సుమారుగా 1.2 లక్షల హెక్టార్లలో జింకల బెడద వల్ల రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 6 వేలకు పైగా జింకలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏటా రూ.20 నుంచి రూ.30 కోట్లకు పైగా రైతులకు పంట నష్టం వాటిల్లుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. నష్ట పరిహారం మాత్రం అందడం లేదు. వేసవి కాలంలో జింకలకు అడవిలో ఎలాంటి మేత, తాగునీరు లభించక గ్రామాల్లోకి వస్తూ కుక్కలు, వాహనాల బారిన పడి చనిపోతున్నాయి.

మొలక దశ నుంచే నాశనం

శనగ, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, పత్తి, ధనియాలు, జొన్న, కొర్ర తదితర పంటల సాగులో రైతులు జింకల వల్ల నష్టపోతున్నారు. జింకలు ఉన్న ప్రాంతాల్లో 30 నుంచి 50 శాతం వరకూ పంట నష్టం వాటిల్లుతోంది. పత్తి, ప్రొద్దుతిరుగుడు పంట చేతికందే సమయం వరకూ తింటాయని, ఆ పంటలకు రక్షణ లేకుండా పోతోందంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అశ్వగంధి, జనపనార మినహా మరే పంట సాగు చేసినా జింకల బెడద తప్పడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.

పొలంలో జింకల మంద

చుట్టూ ప్లాస్టిక్‌ దారం కడితే..

సాగు చేసిన పొలంలో జింకలు దాడి చేయకుండా ఉండాలంటే స్థానికులు చుట్టూ చీరలు, లేదా టేప్‌రికార్డర్‌ క్యాసెట్లలోని టేప్‌ లేదా, ప్రత్యేకంగా లభించే మరో ప్లాస్టిక్‌ టేప్‌ను చుట్టూ కట్టడం వల్ల అవి రెపరెపలాడుతూ చేసే శబ్దాలకు కాస్త దూరంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. దిష్టి బొమ్మలు ఏర్పాటు చేసినా పొలాల్లోకి రాలేవంటున్నారు. పంట నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

అధికారులను నిలదీస్తూనే ఉన్నాం

- వెంకటేశ్‌, బురుజుల

జింకల వల్ల పంట సాగు చేసిన ప్రతి సారి పంట నష్టం వాటిల్లుతూనే ఉంది. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించాం. గ్రామంలో జరిగే గ్రామ సభలకు వచ్చే అధికారులను నిలదీస్తున్నాం. వారు హామీ ఇచ్చి వెళుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

దరఖాస్తు చేసుకోండి

- నాసిర్‌షా, అటవీశాఖ రేంజర్‌, డోన్‌

జిల్లాలోని పలు ప్రాంతాల్లో జింకల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు జింకల పార్కు ఏర్పాటు కోసం, వాటి తరలింపు కోసం గతంలోనే ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఆ స్థాయిలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. జింకల విషయమై జాతీయ స్థాయి అనుమతి అవసరం. పంటనష్టం జరిగిన రెండు రోజుల్లోపు సంబంధిత రైతు వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎంత మేరకు పంటనష్టం వాటిల్లిందన్న విషయమై పంచాయతీనామా చేయించి అటవీ శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలి. పొలాలను పరిశీలించి నష్టపరిహారం మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.