బుధవారం, డిసెంబర్ 11, 2019
● ఇప్పటి వరకు 57 రకాల వరి వంగడాల రూపకల్పన
● 9 దశాబ్దాలుగా రైతు సేవలో వరి పరిశోధన సంస్థ ●
నేడు మార్టేరులో కిసాన్ మేళా
ఈ ఏడాది జాతీయ స్థాయిలో విడుదలైన ఎంటీయూ 1239 వరి రకం
ఇక్కడ పురుడు పోసుకున్న వరి వంగడాలు దేశవ్యాప్తంగా అన్నదాతల ఇంట సిరులు పండిస్తూ... కర్షకుల కంట వెలుగులు పూయిస్తున్నాయి. 1925 నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ డైరెక్టరేట్ స్థాయికి చేరింది మార్టేరులోని వరి పరిశోధన సంస్థ. నిత్య ప్రయోగశాలగా మారిన ఈ సంస్థలో అను నిత్యం రైతుల కోసం శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వరి వంగడాలను సృష్టిస్తున్నారు. దేశంలో సాగవుతున్న వరి సాగులో 25 శాతం, రాష్ట్రంలో 80 శాతానికి పైగా వంగడాలు ఈ పరిశోధన సంస్థలో రూపొందించినవి కావడం ఇక్కడ శాస్త్రవేత్తల అవిరళ కృషికి నిదర్శనం. వంగడాల రూపకల్పనే కాకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు అవసరమైన యాజమాన్య సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారు అధిక దిగుబడులు సాధించే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
మార్టేరు(పెనుమంట్ర), న్యూస్టుడే : ఈ వ్యవసాయ క్షేత్రంలో తయారై లక్షలాది మంది రైతుల పొలాల్లో చల్లుతున్న అనేక రకాల విత్తనాలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1925 నుంచి ఇప్పటి వరకు 57 రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. స్వర్ణకు దీటుగా ఉండే వరి రకం సృష్టించి రైతులకు మరో అద్భుతమైన వరి వంగడం అందించామనే సంతృప్తి పొందాలనే లక్ష్యంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇక్కడ రూపొందించిన స్వర్ణ, విజేత, కాటన్ దొర సన్నాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న దృష్ట్యా ఆలస్యంగా జీర్ణమయ్యే రకాల రూపకల్పనపై పరిశోధనలు చేపట్టారు.
ప్రాచుర్యం పొందిన వరి వంగడాలు ఎన్నో
తొమ్మిది దశాబ్దాలుగా రైతన్న సేవలో ఉన్న ఈ సంస్థ ద్వారా ఎన్నో మేలైన వరి వంగడాలు విడుదలయ్యాయి. 1925 నుంచి 1970 వరకు ఇక్కడ పొడుగు రకాల్లో అక్కులు, కృష్ణ, కాటుకలు, బసంగి, అట్రగడ్డ, కుసుమ వంటి 23 వరి వంగడాలను విడుదల చేశారు. తర్వాత కాలంలో కృష్ణా, గోదావరి డెల్టాలకు అనువైన పొట్టి రకాలపై చేసిన పరిశోధనలు సఫలీకృతమయ్యాయి. 1982లో ఎంటీయు 7029(స్వర్ణ) వరి రకాన్ని విడుదల చేశారు. ఈ రకం ఇప్పటికీ ఖరీఫ్ సాగులో ‘స్వర్ణం’గానే పేరొందింది. ఎంటీయూ-1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ-1001 (విజేత), ఎంటీయూ-3626 (ప్రభాత్) రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి. దోమను తట్టుకునే అనేక రకాల వంగడాలు రూపొందించారు. 2015లో ఎంటీయూ 1153 (చంద్ర) రకం 8 రాష్ట్రాలో ప్రథమ స్థానంలో నిల్చి జాతీయ స్థాయిలో విడుదల చేశారు. ఎంటీయూ 1121, 1156, 1140, 1155, 1172, 1190 రకాలు మంచి గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఎంటీయూ 1239 (శ్రావణి), 1223 (వర్ష) రకాలను ఎంటీయు 1210 (సుజాత), 1224 (మార్టేరు సాంబ), 1262 (మార్టేరు మషూరి) రకాలను రాష్ట్ర స్థాయిలో విడుదల చేశారు.
రైతులకు మేలైన వరి రకాలు అందించగలుగుతున్నాం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ రైతులకు మేలైన రకాలను అందించగలుగుతున్నాం. దిగుబడి పెంచి సాగు వ్యయం తగ్గించాలనే లక్ష్యంతో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జాతీయ స్థాయిలో రెండు, రాష్ట్ర స్థాయిలో మూడు వరి వంగడాలను విడుదల చేశాం. - డాక్టర్ పీవీ సత్యనారాయణ, ఏడీఆర్, మార్టేరు
తాజా వార్తలు
జిల్లా వార్తలు