close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

ప్లాస్టిక్‌ కోరల్లో.. ప్రధాన ఆలయాలు

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం

దుర్భరంగా మారుతున్న ఆలయ పరిసరాలు

ఆళ్లగడ్డ గ్రామీణ, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌.. మానవాళికి ముప్పుగా పరిణమిస్తోంది. అంతకంతకు పరిమితిని పెంచుకుంటూ భూభాగాన్ని ఆక్రమిస్తోంది. గాలి, నీరు, నేలను కలుషితం చేసి మానవ మనుగడను అఘాతంలోకి నెడుతోంది. అత్యంత ప్రమాదకర రసాయనాలను విడుదల చేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. విచ్చలవిడిగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతూనే ఉంది. ఏకంగా దైవం కొలువుదీరిన పవిత్ర క్షేత్రాలకు సైతం ఈ ప్లాస్టిక్‌ బెడద తప్పడం లేదు. నిర్లక్ష్యంగా ఎక్కడబడితే అక్కడ వేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. జిల్లాలో ప్లాస్టిక్‌ కోరల్లో చిక్కుకున్న ప్రధాన ఆలయాలు అక్కడి పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ప్రముఖ దేవస్థానాల్లో..

జిల్లాలో సుప్రసిద్ధ ఆలయాలు నాలుగు. అవి అహోబిలం, శ్రీశైలం, మహానంది, మంత్రాలయం క్షేత్రాలు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయాలకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఇక శని, ఆదివారాల్లో ఆ సంఖ్య పదింతలకు పైగానే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు పూజా సామగ్రి, ఆహారపదార్థాలు వంటి వాటిని తీసుకొస్తుంటారు. అవి ప్రధానంగా ప్లాస్టిక్‌ కవర్లు, సంచుల్లోనే తీసుకువచ్చి ఆలయ పరిసరాల్లో పడేస్తున్నారు. ఫలితంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండి ఆలయాల పరిసరాలు దుర్భరంగా మారుతున్నాయి.

ఇదీ పరిస్థితి

* అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం వద్ద ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో తొమ్మిది క్షేత్రాలు ఉండటంతో భక్తులు అటవీ ప్రాంతంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. వారి వెంట తెచ్చుకొనే ఆహారపదార్థాలను, ప్లాస్టిక్‌ కవర్లను అటవీ ప్రాంతంలోనే పడేస్తున్నారు. ఫలితంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిల్వ ఉండి పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆలయ పరిధిలో కొనసాగే దుకాణాల్ల్లోనూ, లడ్డూ ప్రసాదాల పంపిణీకి సైతం ప్లాస్టిక్‌ కవర్లనే వాడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంకల్లోని ప్రవాహం నుంచి పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొట్టుకువచ్చాయి.

ప్లాస్టిక్‌ కవర్లలో టెంకాయల విక్రయాలు

* మహానందిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ ఆలయ పరిధిలో పూజా సామగ్రి, టెంకాయలు, బొమ్మల అంగళ్లు 500 వరకు ఉన్నాయి. వాటిలో ప్లాస్టిక్‌ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో అధికారులు దాడులు చేసి ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు తీసుకోవడంతో కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అర్చన సామగ్రి, పండ్ల దుకాణాల్లో కాగిత సంచులను వాడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ సంచులపై దృష్టి సారించాల్సి ఉంది.

* మంత్రాలయం మఠంలో ప్లాస్టిక్‌ వాడకం విపరీతంగా ఉంది. ఈ సన్నిధి పరిధిలో 500 పైగా దుకాణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగం అధికంగా జరుగుతోంది. ఇటీవల స్థానికులు, పోలీసులు ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ వాటి వాడకంలో ఎలాంటి మార్పు కానరావడం లేదు.

* వాటితో పాటు బనగానపల్లెలోని యాగంటి క్షేత్రం, నందవరం చౌడేశ్వరిదేవి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్‌ వాడకం జరుగుతూనే ఉంది.

అహోబిలం ఆలయం

 

శ్రీశైలం ఆదర్శం...

శ్రీశైలం ప్లాస్టిక్‌ నివారణలో ఆదర్శంగా నిలుస్తోంది. ఆలయాధికారులు ప్లాస్టిక్‌ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో ప్లాస్టిక్‌ రహిత శ్రీశైలంగా వెలుగొందుతోంది. ఆలయ పరిధిలో కొనసాగే 400 దుకాణాల్లో పూర్తిగా ప్లాస్టిక్‌ కవర్లు వాడకం నిషేధించారు. గతంలో దుకాణాలపై అధికారులు దాడులు చేసి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించడంతో పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇతర ఆలయాలకు భిన్నంగా శ్రీశైలం ఉండటం విశేషం.

శుభ్రతే ప్రధానం..

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైనవి ఆలయాలు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి ప్రదేశాలను, చరిత్రలను అవగతం చేసుకొని పయనమవుతుంటారు. ఆలయాలు పరిశుభ్రంగా ఉన్నపుడే వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించాలంటే ఆలయాల శుభ్రత ప్రధానమని గుర్తించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వతహాగా ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ పూని ముందుకు కదిలినపుడే అది సాధ్యమవుతుంది.

 

ప్లాస్టిక్‌ నిషేధంపై ఆదేశాలిస్తాం

- ఆదిశేషునాయుడు, దేవాదాయ సహాయ కమిషనర్‌

జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. కార్యనిర్వహణాధికారులు దీనిపై దృష్టి సారించాలి. ప్రధానంగా పూజా సామగ్రి పంపిణీలో ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తున్నారు. దుకాణాల వేలం సమయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలి. ప్లాస్టిక్‌ వాడితే జరిమానాలు విధించాలని ఆలయాధికారులకు ఆదేశిస్తాం. ప్లాస్టిక్‌ నివారణపై దృష్టి సారిస్తాం.
 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.