close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

మూడేళ్లలో రూపురేఖలు మారుస్తాం: మంత్రులు శ్రీరంగనాథరాజు, వనిత

● సిద్ధాంతంలో ‘మనబడి నాడు-నేడు’ను ప్రారంభించిన మంత్రులు


సభలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు

ఆచంట, పెనుగొండ, న్యూస్‌టుడే: మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత తెలిపారు. సకల సౌకర్యాలను కల్పించి మోడల్‌ పాఠశాలలుగా మార్చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని గురువారం పెనుగొండ మండలం సిద్ధాంతం ఉన్నత పాఠశాలలో మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని నాడు-నేడు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రూ.6 వేల కోట్ల వ్యయంతో పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించి, విద్యాపరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యతోనే అన్ని రంగాల్లో రాణించగలమని ఆమె అన్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంపై పట్టు సాధిస్తేనే ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి చేరి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో బాలికలపై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనే కోరికతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజు భారం మోయలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో భవనాలు, బస్సులు మాత్రమే కొత్తగా కనిపిస్తాయని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రం ఉండరని అన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై విమర్శలు గుప్పిస్తున్నవారంతా విద్యా సంస్థల యాజమానులే అని ఆయన విమర్శించారు.

ప్రతి శుక్రవారం విద్యార్థి దినోత్సవం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం అమల్లో ఇప్పటి వరకు జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఈ కార్యక్రమాన్ని కూడా ఒక సవాల్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు అధికారులకు సూచించారు. విద్యాశాఖ ఒక్కటే కాకుండా అన్నీ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. పాఠశాలల రూపురేఖలు మారేవరకు ప్రతి శుక్రవారం విద్యార్థి దినోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తొలి దశలో 1058 పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో దశలు వారీగా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి, మండల ప్రత్యేకాధికారిణి కాత్యాయినీప్రసన్న ఇతర అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.