close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

ఆంగ్లమాధ్యమం ఎంతో అవసరం

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి


‘నాడు-నేడు’ కార్యక్రమం ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి,

ఎమ్మెల్యే బాలరాజు, ఐటీడీఏ పీవో సూర్యనారాయణ

బూసరాజుపల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల్లో 132 పాఠశాలలను ‘మన బడి నాడు - నేడు’ కార్యక్రమానికి తొలి విడతలో ఎంపిక చేశామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆమె నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమం విద్య చాలా అవసరమని, దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి తెలుగు మాధ్యమంలో చదవడం వల్ల ఇంటర్‌లో మూడు నెలలు వెనుకబడిపోయానని గుర్తు చేసుకున్నారు. ‘అమ్మఒడి’ పథకం కింద జనవరి నుంచి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు ప్రభుత్వం జమ చేస్తుందని, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉందని, వారి కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. బూసరాజుపల్లిలో గురుకుల డిగ్రీ కళాశాల, మన్యానికి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయించాలని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని కోరారు. ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి బాలాజీనాయక్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, ప్రిన్సిపల్‌ రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.

జీసీసీ సూపర్‌ మార్కెట్‌ భవనానికి శంకుస్థాపన

బుట్టాయగూడెంలో రూ.18 లక్షల అంచనాతో నిర్మించనున్న జీసీసీ సూపర్‌ బజార్‌, అరకువ్యాలీ కాఫీ హబ్‌ భవనానికి పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. రాజానగరంలో గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల వద్ద అదనపు తరగతి భవనాన్ని ప్రారంభించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌, జీసీసీ డీఎం ఎం.జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజానగరంలో ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి మొడియం గంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాయం పోసియ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కంగాల వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కాకి సింగరాజు పాల్గొన్నారు. బూసరాజుపల్లిలో గిరిజన గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మంత్రి పుష్పశ్రీవాణి, ఆమె భర్తను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తాను దొరమామిడి ఉన్నత పాఠశాలలో చదువుకున్నానని, ఆ పాఠశాలతో పాటు పాలకుంట పాఠశాలలో ఒప్పంద పద్ధతిన ఉపాధ్యాయురాలిగా పనిచేశానన్నారు. ఆయా పాఠశాలల నుంచి బూసరాజుపల్లి గురుకుల పాఠశాలకు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులను తీసుకువచ్చే వారమన్నారు. మన్యంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు ఆమెకు వినతిపత్రాలు అందజేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, ఏపీవీవీయూ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ తదితర సంఘాల నాయకులు వినతులు ఇచ్చిన వారిలో ఉన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి మంత్రి మధ్యాహ్నం భోజనం చేశారు.

కొమ్ముతలపాగాను పుష్పశ్రీవాణికి అలంకరిస్తున్న స్థానికులు

జీసీసీ సూపర్‌ బజార్‌ భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.