close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

పునీత ప్రాంతం రాజమహేంద్రవరం

వేదికపై ప్రసంగిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌ : ఎందరో మహనీయులతో పునీతమైన రాజమహేంద్రవరం ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. రాజానగరం సమీపంలోని గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ధర్మచైతన్య సభకు జగద్గురు శంకరాచార్య పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌తో కలిసి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదికవి నన్నయ ఈ ప్రాంతంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించి ఎంతో కీర్తిని గడించారన్నారు. రాజమహేంద్రవరం సాంస్కృతిక కేంద్రమని, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి గొప్పవారు ఇక్కడి నుంచే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. న్యాపతి సుబ్బారావు వంటి ఎందరో త్యాగమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆదిశంకరాచార్యులు దేశంలో నాలుగు దిక్కులా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి శాంతి, సనాతన ధర్మాన్ని విస్తృతం చేశారని కొనియాడారు. ఆధ్యాత్మిక గురువు నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని గవర్నర్‌ పేర్కొన్నారు.

పర్యటనలో స్వల్ప మార్పులు

నన్నయ విశ్వవిద్యాలయం: గైట్‌ కళాశాలలో జరిగిన ధర్మచైతన్య సభకు హాజరైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన ఆలస్యంగా సాగింది. ఉదయం 10:30 గంటలకు గైట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు గవర్నర్‌ చేరుకోవాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌కు వీలుపడలేదు. గవర్నర్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గైట్‌ ప్రాంగణానికి 11:45 గంటలకు చేరుకున్నారు. ఏఎస్పీ లతామాధురి ఆధ్వర్యంలో సుమారు 518 మందికి పైగా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్‌, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

నిశ్చలానంద సరస్వతికి నమస్కరిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

గవర్నర్‌, జగద్గురు శంకరాచార్య పూరి గోవర్థన పీఠాధిపతి రాకతో గైట్‌ ప్రాంగణమంతా సందడిగా మారింది. 250 మందికి పైగా అన్నవరం సత్యదేవుని మాలధారులు సభకు హాజరయ్యారు. కొమ్ము నృత్యాలు, కోలాట ప్రదర్శనలతో గవర్నర్‌, పీఠాధిపతులకు స్వాగతం పలికారు. అన్నవరం సత్యదేవుని మాలధారుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సుమారు అయిదు వేల మందికి పైగా భక్తులు, విద్యార్థులు ధర్మచైతన్య సభకు హాజరయ్యారు.

గవర్నర్‌ను కలిసిన ‘నన్నయ’ వీసీ

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.సురేష్‌వర్మ గురువారం జిల్లాకు వచ్చిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. గైట్‌ ప్రాంగణంలో గవర్నర్‌ను కలిసి విద్యాపరంగా పలు విషయాలపై చర్చించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ సత్యనారాయణరాజు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.సురేష్‌వర్మ, గైట్‌ ఎండీ శశికిరణ్‌ వర్మ, కిమ్స్‌ ఎండీ రవికిరణ్‌ వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గైట్‌ సీఈవో డీఎల్‌ఎన్‌ రాజు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పండితులు విశ్వనాథగోపాలకృష్ణ, రఘునాథశర్మ, శ్రీరామశర్మ, కొంపెల్ల సత్యనారాయణ, సీతారామచంద్ర, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


వేదికపై ప్రసంగిస్తున్న నిశ్చలానంద సరస్వతి

రాజనీతి, ఆధ్యాత్మికం ఒక్కటి కావాలి

రాజనీతి వర్గం..ఆధ్యాత్మిక వర్గం ఒక్కటైతేనే దేశం సుభిక్షంగా ఉంటుందని జగద్గురు శంకరాచార్య పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌ పేర్కొన్నారు. వైషమ్యాలను పక్కనపెట్టి సమాన భాగస్వామ్యంతో మెలిగినప్పుడే సుఖసంతోషాలు సాధ్యమవుతాయన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని విస్తృతం చేయాలంటూ ఇది శాశ్వత కాలం ఉంటుందని స్పష్టం చేశారు. వేదాలు, ఉపనిషత్తులు మానవునికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని పేర్కొన్నారు. లోకంలో ఉండే తాత్కాలిక వైభోగాల కోసం మానవుడు తపిస్తున్నాడు తప్ప పరమార్థాన్ని తెలుసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఓట్లు రాబట్టుకునేందుకు భూమి, నీరు, గాలి వంటి పంచభూతాలను నాశనం చేస్తున్నారంటూ ఈ చర్యలు మానవుని మనుగడకే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రపంచ శ్రేయస్సుకు మూల కారణమైన గోవులు, బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలను కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత చైతన్యరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.