close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి

రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి

శిబిరంలో అఖిలపక్షం నాయకుల డిమాండ్‌

భవన నిర్మాణ కార్మికుల దీక్షకు మద్దతు తెలుపుతున్న కాకినాడ మేయర్‌ పావని,
మాజీ ఎమ్మెల్యే వనమాడి, జనసేన నాయకుడు పంతం నానాజీ తదితరులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు నెలకు రూ.10 వేల చొప్పున జీవనభృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష గురువారానికి రెండో రోజుకు చేరింది. ఇసుకలేక ఉపాధి కోల్పోయి ఇటీవల మరణించిన భవన నిర్మాణ కార్మికులు కర్రి వెంకటరెడ్డి, మద్దిరాల ధనరాజు కుటుంబ సభ్యులు ఈ శిబిరానికి వచ్చారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన అఖిలపక్షం నాయకులు అక్కడే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) మాట్లాడుతూ కార్మికుల ఆకలి చావులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జైలు, జరిమానా విధిస్తామని ఇప్పుడు ప్రభుత్వం చెబుతోందని, ఇదే పనిని అయిదునెలల కిందట చేపట్టి ఉంటే కార్మికుల మరణాలు ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా ఇసుకను డిమాండ్‌ మేరకు సరఫరా చేసి కార్మికుల ఆకలి చావులను ఆపాలని డిమాండ్‌ చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ మాట్లాడుతూ జి.మామిడాడకు చెందిన కొయ్యి వీరబాబు అనే భవన నిర్మాణ కార్మికుడు ఉపాధిలేక ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఇక్కడివాడు కాదంటూ స్థానిక ప్రజాప్రతినిధి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారని ధ్వజమెత్తారు. 20 రోజుల చంటిపాపతో ఎర్రటి ఎండలో నిరాహార దీక్ష చేయాల్సిన దుస్థితి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఈ నెల 15, 16 తేదీల్లో డొక్కా సీతమ్మ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు భోజనం, అల్పాహారం పెడతామని ప్రకటించారు. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని మాట్లాడుతూ కాకినాడలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక అల్లాడుతున్నారని వాపోయారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రమణి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు పీఎస్‌ నారాయణ, సీఐటీయూ నాయకుడు పలివెల వీరబాబు తెదేపా కార్పొరేటర్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.