close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

ప్రాణాలతో జలగాటం

జిల్లాలో ఏటా 60 మంది మృత్యువాత

కార్తీక మాసం.. తస్మాత్‌ జాగ్రత్త

నీటితో పొంచి ఉన్న గండం

ప్రవాహంలో ఇలా ఆటలాడితే ప్రాణాంతకమే..

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : జిల్లాలో ఏటా 60 మంది నదులు, వాగులు, వంకలు, చెరువుల్లో పడి మృత్యువాతపడుతున్నా అధికారుల్లో చలనం కన్పించడం లేదు. చిన్నచిన్న జాగ్రత్తలు చేపడితే చాలు ఈ మరణాలను తగ్గించవచ్చని అందరికీ తెలుసు.. సామాన్యుల ప్రాణాలంటే అందరికీ అలుసు. ముఖ్యంగా కార్తీక మాసం, సెలవు రోజుల్లో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండు రోజుల్లోనే నలుగురు యువకులు నీటిలో పడి మృతి చెందారు. జిల్లాలో ఉన్న నదులు, వాగులు, జలాశయాలు ప్రమాదకరంగా మారాయి. అలాంటి చోట అధికారులు కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. నివారణ చర్యలు చేపట్టలేదు.

జిల్లాలో వాటర్‌గండి, పెన్నానది పరివాహక ప్రాంతాలైన ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, పుష్పగిరి, బుగ్గవంక, బ్రహ్మంసాగర్‌తో పాటు చెరువులు, వాగులు, వంకలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నీ నిండు కుండల్లా మారాయి. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసేందుకు పలువురు నదులు, చెరువులు, వాగులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్తున్నారు. అధికారులు జలగండం ఉన్న ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. చాలా మంది లోతు తెలియక నీటిలో దిగి ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కొందరు ఏకంగా సుడిగుండాల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే ప్రతి ఏటా 60 మంది ప్రాణాలు కాపాడినవారవుతారు.

పాటించాల్సిన జాగ్రత్తలివి

పుష్పగిరి వద్ద సుడిగుండాలున్నాయి. కార్తీక మాసంలో స్నానాలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఇనుప చువ్వలతో రక్షణ కంచెను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రవాహం ఎక్కువగా ఉంది లోపలికి వెళ్లొద్దంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. పుష్పగిరిలో మూడు రోజుల్లో నలుగురు ్కమృత్యువాత పడ్డారు.

వాటర్‌గండి అత్యంత ప్రమాదకరమైంది. ఇక్కడ నెలలో కనీసం ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. ఇక్కడున్న సుడిగుండాలు చాలా ప్రమాదకరమైనవి. వాటర్‌గండికి కేవలం కార్తీక మాసమే కాదు, వారాంతరపు సెలవుల్లో కుటుంబాలు సహా సరదాగా గడపడానికి వెళ్తుంటారు. అక్కడే భోజనాలు చేసి నీటిలో ఈత కొడతారు. ఈతరాని వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అధికారులు సుడిగుండాలున్న చోట బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంది. చాలా మంది సరదాగా లోపలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ రాళ్లు ఉన్నాయో తెలియదు. సెల్ఫీల కోసం బండల మీద, నీటి మధ్యలో నిలబడి మృత్యువాతపడుతున్నారు. అధికారులు ఇక్కడ కూడా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రదేశం ప్రమాదకరమంటూ ప్రజలకు తెలిసేలా పెద్ద పెద్ద బోర్డులుంచాలి.

కార్తీక మాసం మరో రెండు వారాల పాటు ఉంటుంది. కాల్వలు, నదుల వద్ద, తరచూ ప్రమాదాలు జరిగే చోట అప్రమత్తం కావాల్సి ఉంది. అవసరమైన చోట పోలీసులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఉంచితే ప్రాణాలను కాపాడవచ్ఛు

చిన్నపిల్లల విషయంలో అప్రమత్తం

నదులు, వంకలు, వాగులు, చెరువులు, కాలువలు, జలాశయాలన్ని నీటితో కళకళలాడుతున్నాయి. నీటిని చూస్తే అందరికీ సంతోషం. నీటిలో దిగి ప్రమాదానికి గురవుతుంటారు. చిన్నపిల్లల విషయంలో దగ్గరుండి లోతు ఎక్కువగా లేని చోట స్నానాలు చేయాలి. నదుల వద్ద అయితే ఒడ్డు వద్దనే ఉండడం ఎంతో ఉత్తమం. వారాంతరపు సెలవులు వచ్చినప్పుడు పిల్లలతో కలిసి సరదాగా చెరువుల వద్దకు వెళ్తుంటారు. పిల్లలపై నిఘా ఉంచాలి.

విషాద గుర్తులివి

2018 నవంబరు 24న గాలివీడులో మహమ్మద్‌ తోఫిక్‌, తాహీర్‌, మహమ్మద్‌ బాషా, సుబహాన్‌ నలుగురు చెరువులో పడి మృతి చెందారు.

2018 నవంబరు 26న వాటర్‌గండిలో పడి అక్కా తమ్ముడు సాదియా, బిలాల్‌ మృతి చెందారు.

2109 మే 3న సోమశిల జలాల్లో మునిగి ప్రసన్న (15), అంజలి (11) మృతి.

2019 ఆగస్టు కమలాపురంలో కుందూనదిలో పడి నలుగురు గల్లంతు.

2019 సెప్టెంబరు 9న జమ్మలమడుగు మండలం గండికోట సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి సంజయ్‌ (9), డింభూ (10) ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చనిపోయారు.

2019 నవంబరు 12న పుష్పగిరి పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్నానం చేసేంతుకు పెన్నానదిలో దిగి మైకేల్‌ (12) అనే బాలుడు మృతి చెందాడు.

2019 నవంబరు 12న కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధవటం మండలం కడపాయపల్లెకు చెందిన మైసూరారెడ్డి (22) పెన్నానదిలో పడి మృతి చెందాడు.

2019 నవంబరు 13న పుష్పగిరి పెన్నానదిలో విష్ణు అనే విద్యార్థి గల్లంతయ్యాడు.

ఒడ్డున మాత్రమే స్నానాలు చేయాలి

ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈత వచ్చిన వారు, రాని వారు ఒడ్డున కూర్చుని స్నానాలు చేయాలి. చాలా మంది ఏమీకాదనే అత్యుత్సాహంతో నీటిలోకి దిగుతారు. సుడిగుండాలు తెలియక నీటి చిక్కుకుని ప్రాణాలు పోతాయి. ఈత వచ్చిన వారు కూడా సుడిగుండాల్లో చిక్కుకుంటే బయటికి రాలేరు. పిల్లల విషయంలో పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలి. - భూపాల్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, కడప

జిల్లాలో పుణ్యస్నానాలు, ఈతకని వెళ్లి ప్రతినెలా ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. ఏడాదికి ఈ సంఖ్య 60కి చేరుతోంది. అంటే దాదాపు అన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. గత నాలుగేళ్లలో ఇలా జలసమాధి అయిన వారి సంఖ్య 264. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే... పాలకులు పట్టించుకుంటే... మానవత్వాన్ని ప్రదర్శిస్తే ప్రతినెలా ఐదుగురి ప్రాణాలను కాపాడవచ్ఛు ఏటా 60 కుటుంబాలను విషాదం నుంచి గట్టెక్కించవచ్ఛు ఇప్పటికైనా స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పుణ్యం కట్టుకుంటారో.. పోయేది మన ప్రాణాలు కాదు కదాని వదిలేసి పాపం మూటగట్టుకుంటారో వారికే తెలియాలి. జిల్లాలో ప్రాణాలతో ఆడుతున్న జలగాటం ఇది.

సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం

కార్తీక మాసం మరో రెండు వారాలున్నాయి. ప్రమాదకరమైన నదులు, చెరువులు, వాగుల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే అక్కడ తమ సిబ్బందిని బందోబస్తు ఉంచుతాం. సుడిగుండాలున్న చోటకి వెళ్లరాదు. ఒడ్డునే స్నానాలు ఆచరించడం ఉత్తమం. - అన్బురాజన్‌, ఎస్పీ, కడప

జిల్లాలో నీట మునిగి మృతి చెందిన వారి సంఖ్య

 

పుష్పగిరి వద్ద గల్లంతైన వారికోసం పోలీసుల అన్వేషణ

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.