నివాస సూచిలో హైదరాబాద్ షాపది అంశాల్లో భాగ్యనగరమే మేటి
ప్రజారవాణా, పచ్చదనంలో వెనుకబాటు
నగర పాలక సంస్థ తలసరి వ్యయంలో నేలచూపు
ఈనాడు, హైదరాబాద్
దేశంలోని పెద్ద నగరాలు బహుళ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ముంబయిలో సొంతిల్లు కొనలేని పరిస్థితి. అద్దెకు ఉండాలన్నా సంపాదన సరిపోదు. మిగతా మెట్రో నగరాలు రవాణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నిత్యం తీవ్ర ట్రాఫిక్ జాంలతో చెన్నై, కోల్‌కతా, బెంగళూరు సతమతమవుతున్నాయి. ఈ సంక్షోభాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విధాలా నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ లైవ్‌మింట్ ఇండెక్స్‌లో మొదటిస్థానంలో నిల్చింది. అన్ని నగరాలను వెనక్కి నెట్టి ముందు వరసలో నిలవడానికి ముఖ్యంగా పది అంశాలు దోహదం చేశాయి. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే పది అంశాల్లో మొత్తమ్మీద మెరుగ్గా ఉండటంతో అగ్రపథం దక్కిందని ఆ సంస్థ నివేదిక పేర్కొంది. అదే సమయంలో పది అంశాల్లో కొన్నింట్లో మన సూచి అధ్వానంగా ఉంది. ఆయా అంశాల్లో గణనీయంగా మెరుగుపడితే తప్ప నివాసయోగ్య స్థానాన్ని నిలబెట్టుకోలేమనే సంగతిని గుర్తించాలి. ఆ మేరకు మౌలిక వసతులు మరింత మెరుగుపర్చాల్సి ఉంది.
వేగంగా రవాణా..
నగరంలో వాహనాల సగటు వేగం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువే. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రధాన రహదారుల్లో మెరుగ్గానే ఉంది.
* ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. పనిరోజుల్లో పరిస్థితి అధ్వానంగా మారకముందే మౌలిక వసతులను మెరుగుపర్చాలి. |
కాలుష్యం
వాతావరణంలో కాలుష్యం పెరిగితే ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఎస్వోటూ, సీవోటూ, పీఎం10, పీఎం2.5 వంటి కాలుష్య ఉద్గారాల పరిమాణాల సగటును పరిశీలించగా హైదరాబాద్ పరిస్థితి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
* వాహనాలు, నిర్మాణాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వంటి చర్యలు చేపట్టాలి.
* స్వచ్ఛమైన గాలి ఇండెక్స్‌లో 72.5 పాయింట్లతో మనది నాలుగో స్థానం.
హైదరాబాద్ కంటే బెంగళూరు, ముంబయి, చెన్నై మెరుగ్గా ఉన్నాయి. |
ప్రజారవాణా
రైలు, మెట్రో సాంద్రత, బస్సులు అందుబాటు వంటి అంశాలు ప్రజారవాణాలో ముఖ్యమైనవి. సిటీలోని ప్రధానమైన ప్రాంతాలన్నింటికి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ ప్రస్తుతం 45 కి.మీ. మేర రెండు మార్గాల్లో అందుబాటులో ఉంది. 95 కి.మీ. రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. 56 కి.మీ మేర మెట్రో సేవలందిస్తోంది. మరో 10 కి.మీ. ఈ ఏడాది ఆఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మెట్రో మరింత విస్తరణ ప్రణాళికలూ ఉన్నాయి.
* ఆరు నగరాల్లో మనది ఐదో స్థానం. చాలా మెరుగుపడాల్సి ఉంది.
* ఎంఎంటీఎస్ రెండోదశకు ప్రభుత్వం నిధులు కేటాయించి సత్వరం పూర్తయ్యేలా చూడాలి. మెట్రో విస్తరణ, ఇతర ప్రత్యామ్నాయ ప్రజారవాణా వెంటనే పట్టాలెక్కెలా చూడాలి. |
ఆహారం..
నగరంలో హైదరాబాదీ రుచులతో పాటూ తెలుగు వంటకాలు, దక్షిణాది, ఉత్తరాది, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్ ఇలా ఏ రుచులైనా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు గానీ, ఉపాధి రీత్యా వచ్చినా కావాల్సిన రుచులకు కొదవలేదు. స్ట్రీట్ ఫుడ్ మొదలు, రెస్టారెంట్లు, స్టార్‌హోటళ్ల వరకు.. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు వారి బడ్జెట్లోనే మెచ్చే వంటకాలు ఇక్కడ ఉన్నాయి. బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ గురించి చెబుతుంటూనే చాలామందికి నోరూరుతుంది. ఇక్కడి నుంచి విమానాల్లో తమ వెంట బిర్యానీ పార్సిల్ తీసుకెళుతుంటారు. ఇటీవల ఈ విభాగంలో యునెస్కో సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది.
* రుచి బాగున్నా ఆహారశాలల్లో శుభ్రతపై దృష్టిపెట్టాల్సి ఉంది. వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. కేఫ్‌లు, బండ్లపైన ఇప్పటికీ చేతితోనే ఆహారపదార్థాలను వడ్డిస్తున్నారు. చేతులకు గ్లౌజులు ధరించడం వంటి శుభ్రత విషయాలపై జీహెచ్ఎంసీ అవగాహన పెంపొందించాల్సి ఉంది. |
అద్దెలు తక్కువ
నగరంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవనవ్యయం తక్కువ. ఇంటి అద్దెలు సైతం తక్కువ. శివార్లలో రూ.3 వేలకు కూడా ఒక పడగ గది అద్దెకు దొరుకుతోంది. నెలకు రూ.5వేల సంపాదనతోనూ నగరంలో బతికే వారు ఉన్నారు. విలాసవంతంగానూ జీవించేవారూ ఉన్నారు. పైగా ఇక్కడ మిగతా నగరాలతో పోలిస్తే ఆరునెలల అద్దె అడ్వాన్స్ ఇచ్చే పద్ధతి లేదు. రెండు నెలల అడ్వాన్స్ ఇస్తే చాలు. కొందరు ఒక నెల అడ్వాన్స్తోనూ ఇల్లు ఇచ్చేస్తున్నారు. మిగతా నగరాలతో పోలిస్తే ఇంటి ధరలు అందుబాటులో ఉన్నాయని సూచి చెబుతోంది. |
సామాజిక వనరులు
నగరంలో నివసించాలంటే అందుబాటులో మంచి పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు, క్రీడల శిక్షణ కేంద్రాలు ఉండటం అవసరం. వీటి పరంగా భాగ్యనగరి మెరుగ్గా ఉంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. పేరున్న పాఠశాలలు, కళాశాలలు ఎన్నో ఉన్నాయి. క్రీడా శిక్షణ కేంద్రాలు విస్తరించాయి. శిక్షణ కోసం ఇక్కడికి వేర్వేరు నగరాల నుంచి వస్తుంటారు.
* ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్రీడా సదుపాయాలు మెరుగుపర్చాలి. నగరం నలువైపులా వీటిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. |
వైవిధ్యం..
హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఇలా ఎంతో వైవిధ్యం కన్పిస్తోంది. ఎవరైనా ఇక్కడ స్వేచ్ఛగా నివసించవచ్చు. వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ ఎంతోమంది ఆనందంగా నివసిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల వారు సైతం ఉపాధి పొందుతున్నారు. పదవీ విరమణ తరవాత ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. విదేశీయులు ఎంతోమంది ఇక్కడ వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్నారు.
* మనకంటే దిల్లీ, ముంబయి ముందు వరసలో ఉన్నాయి. |
ఉపాధి అవకాశాలు
నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటేనే వలస వచ్చేవారు పెరుగుతారు. సిటీలో ఐటీ, ఫార్మా, ఆహార, నిర్మాణ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండటంతో ఇక్కడికి వలసలు పెరుగుతున్నాయి. 2001 నుంచి 2011 వరకు వలస నిష్పత్తి హైదరాబాద్ నగరానికి అధికంగా ఉంది. ఈ దశాబ్దంలోనూ అది కొనసాగుతోంది. జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కర్ని అక్కున చేర్చుకుంటోంది. |
పచ్చదనం..
నగరాల్లో పచ్చదనం లేకపోతే జీవించడం కష్టమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. హైదరాబాద్‌లో పచ్చదనం తక్కువే. వేగంగా విస్తరిస్తున్న నిర్మాణాలు, అభివృద్ధి పనుల వల్ల చెట్లను కొట్టేస్తున్నారు. హరితహారంలో కోట్లాది మొక్కలు నాటుతున్నా వాటిలో బతుకుతున్నవి ఎన్ని అనేది చెప్పడం కష్టం.
* చెన్నై, కోల్‌కతా, బెంగళూరు కంటే వెనుకంజలో ఉన్నాం. |
తలసరి వ్యయం
నగరంలో సగటు పౌరుడిపై నగరపాలకసంస్థ ఖర్చు చేస్తున్న తలసరి వ్యయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
* మున్సిపల్ ఫైనాన్సెస్లో నూటికి మనకు సున్నా పాయింట్లే వచ్చాయి. మొత్తం పది అంశాల్లో ఒక్కో దాంట్లో వంద పాయింట్ల ప్రాతిపదికన ఆరు మెట్రో నగరాలతో పోల్చగా హైదరాబాద్ అత్యధికంగా 67.07 పాయింట్లు సాధించింది. |