close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

నిధులున్నా పనులు కావన్నా!

కలగా పాఠశాలల్లో క్రీడాసౌకర్యాలు ●

ఏడాదిన్నరగా సాగుతున్న పనులు


ప్రహరీ లేని పెళ్లకూరు పాఠశాల క్రీడా ప్రాంగణం

న్యూస్‌టుడే, పెళ్లకూరు : జిల్లాలోని పాఠశాలల్లో ఆట స్థలాల అభివృద్ధి అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. నిధులు కేటాయించినా పాలకుల నిర్లక్ష్యంతో పనుల్లో తీవ్ర జాప్యం రాజ్యమేలుతోంది. ఉపాధి హామీ పథకంలో ఏడాదిన్నర కిందట ఈ పనులకు నిధులు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో నిధులు మంజూరు కాగా పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇందుకు కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమే ప్రధానకారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఆట స్థలాలు ఏర్పాటుచేపట్టాల్సి ఉంది. ఇందుకు ముందుగా ప్రహరీతోపాటు ఆట స్థలం అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో నిధులున్నా ఉపయోగం లేకుండాపోతోంది.

జిల్లాలోని ఆరు క్లస్టర్ల పరిధిలో 140 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు రూ. 4.45 కోట్ల నిధులు విడుదల చేశారు. గత ఏడాది పనులు ప్రారంభం కాగా రూ.98.44 లక్షలు మాత్రమే వెచ్చించారు. ఇలా మొత్తం పనుల్లో 22 శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు. ఉపాధి హామీ పథకం నిధులతో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ప్రహరీ, క్రీడా వేదిక మైదానాలు వంటి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆత్మకూరు క్లస్టర్‌ పరిధిలో 32 పనులకు గాను 12 పనులు పూర్తి చేశారు. గూడూరు క్లస్టర్‌ పరిధిలో 28 పనులు మంజూరు కాగా 12 పూర్తి చేసి వదిలేశారు. కావలి క్లస్టర్‌ పరిధిలో 16 పనులకు గాను ఆరు మాత్రమే పూర్తి చేశారు. కోవూరు క్లస్టర్‌ పరిధిలో 18 పనులకు గాను ఏడు మాత్రమే పూర్తి చేయగలిగారు. అలాగే పొదలకూరు క్లస్టర్‌ పరిధిలో 31 పనులు మంజూరు కాగా 13 పనుల్లో పురోగతి ఉంది. ఉదయగిరి క్లస్టర్‌ పరిధిలో 15 పనులకు గాను ఒకటి మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.

నీరుగారుతున్న లక్ష్యం

పాఠశాలల్లో క్రీడా వికాసానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ నుంచి నిధులు పెద్దగా అందని పరిస్థితి. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ క్రీడా వికాసానికి ప్రభుత్వ బడుల్లో ఆట స్థలాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పనులు మంజూరు చేయించారు. ఇలా పెద్దఎత్తున నిధులు విడుదల చేసినా ఆశించిన ప్రయోజనం కనిపించడంలేదు. నిధుల కోసం ఆరాటపడే అధికారులు వీటి గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. వచ్చిన నిధులు సద్వినియోగం చేసే ఏర్పాట్లు చేయడం లేదు. వ్యక్తిగత ప్రయోజనం కలిగే పనుల్లో చురుగ్గా ఉండే క్షేత్ర సిబ్బంది ప్రజాప్రయోజన పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పనుల్లో కదలిక ఉండడం లేదు. అందుకు నిదర్శనమే ఈపనులు. మంచి పథకం అయినా దీనిని పూర్తి చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దగా ఆసక్తి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే పాఠశాలల్లో ఆటల మైదానాలు మెరుగుపడే అవకాశముంది.

ఇదీ పరిస్థితి

వెంకటాచలం మండలంలోని పూడిపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆట స్థలం అభివృద్ధికి రూ.3.96 లక్షల నిధులు మంజూరయ్యాయి. గత ఏడాది పనులు ప్రారంభించగా రూ.27 వేలు ఖర్చు చేసి వదిలిపెట్టేశారు. ఇలా ఈ మండలంలో ఎనిమిది పాఠశాలల్లో ఆట స్థలాల నిర్మాణాలకు రూ. 22.29 లక్షలు విడుదల కాగా ఇప్పటివరకు ఒక్క పాఠశాలలో మాత్రమే పనులు మొదలుపెట్టారు. ● పెళ్లకూరు మండలంలో శిరసనంబేడు, చెంబేడు, రోసనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 9.12 లక్షలు విడుదల కాగా ఇప్పటివరకు రూ.5.4 లక్షలు వెచ్చించినా ఎక్కడా ప్రాంగణాల ఆనవాళ్లు కనిపించడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూల్యంగా పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ● అనుమసముద్రంపేట మండలంలో ఆరు క్రీడా ప్రాంగణాల నిర్మాణాల కోసం రూ. 18.46 లక్షలు మంజూరయ్యాయి. అయితే మూడు చోట్ల పూర్తి చేసి రూ. 7.92 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన చోట్ల పనులు పూర్తి చేయడంలో స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోకపోవడంతో పనుల్లో కదలిక లేకుండాపోయింది.

పట్టాలపై యోగా చేస్తున్న విద్యార్థులు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.