close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

ఆధ్యాత్మికం.. ఆనందం..

కార్తీక మాసం ప్రత్యేక యాత్రలకు టీఎస్‌టీడీసీ సిద్ధం
వారాంతాలతో పాటు సోమవారం ప్రయాణం
ఈనాడు - హైదరాబాద్‌

కార్తీకమాసం అంటే కార్తీక దీపాలు.. శివనామస్మరణతో మారుమోగే శైవక్షేత్రాలు.. ఉపవాస దీక్షలు.. వనభోజనాలు.. ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. శైవక్షేత్రాలను సందర్శించడంతో పాటు.. వినోద, విహారయాత్రలకు ఎక్కువమంది వెళ్తుంటారు. ఇక సోమవారం శైవక్షేత్రాలను సందర్శించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ఈసారి ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకొచ్చింది. ఆధ్యాత్మికం, ఆనందం, వినోదం, విహారం.. ఉండేలా యాత్రలను సిద్ధం చేసింది. శాతవాహన, కాకతీయ ప్రాంతాలలోని శైవక్షేత్రాలతోపాటు, ఆంధ్రా ప్రాంతంలోని పంచారామాలకు కూడా మూడు రోజుల యాత్రలను నిర్వహిస్తోంది. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నాన్‌ ఏసీ హైటెక్‌ బస్సుల్లోనే యాత్రికులను తీసుకెళ్తోంది. సోమవారం దైవదర్శనం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం.. 5 నుంచి 12 ఏళ్లు లోపు చిన్నారులకు కొంత సబ్సిడీ కల్పించారు.

శాతవాహన యాత్ర...
శాతవాహన ప్రాంతంలో వెలసిన దేవాలయాలను కలుపుతూ ఒక రోజు యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి.. నేరుగా కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, గోదావరి తీరంలోని ధర్మపురి దేవాలయానికి తీసుకెళ్తారు. దేవాలయాల దర్శనమనంతరం తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. ఇందుకుగాను పెద్దలకు రూ. 1300, పిల్లలకు రూ. 1040 టిక్కెట్‌ ధరను నిర్ణయించారు.

రెండు రోజుల కాకతీయ యాత్ర..
ప్రాణహిత - గోదావరి నదుల సంగమస్థలిగా విలసిల్లుతున్న కాళేశ్వరం, రామప్ప ఆలయం, తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచే హన్మకొండలోని వేయిస్తంభాల గుడి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కీసరగుట్ట సందర్శనం ఉంటుంది. రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర ప్రతి శనివారం నగరం నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు రాత్రి 9.30 గంటలకు బస్సు బయలుదేరి రెండో రోజు తిరిగి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. టిక్కెÆట్‌ ధర పెద్దలకు రూ. 1650, చిన్నారులకు రూ.1320లుగా నిర్ణయించారు.

నగరానికి చేరువలో అనంతగిరి యాత్ర..

నగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్‌ జిల్లాలో ఉండే అనంతగిరి అందరికీ సుపరిచితమే.. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం నయనమనోహరంగా మారింది. ఇలాంటి సమయంలో అనంతగిరులను చూసి తీరాల్సిందే. ఈ యాత్రను ఒక్కరోజులో ముగించేయవచ్చు. అక్కడికి దగ్గర్లోని పద్మనాభస్వామి దేవాలయం సందర్శన, స్థానిక అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ కూడా ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 8 గంటలకు నగరానికి చేర్చుతారు. ఇందుకు గాను పెద్దలకు రూ.900లు, చిన్నారులకు రూ. 720లు చెల్లించాల్సి ఉంటుంది.

3 రోజుల పంచారామాల దర్శనం..

పంచారామాల దర్శనానికి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆంధ్రాప్రాంతంలో సాగే ఈ యాత్ర గడువును 3 రోజుల పాటు నిర్వహిస్తోంది. నగరం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరి.. నేరుగా అమరావతికి బస్సు చేరుకుంటుంది. అక్కడ స్నానాలు పూర్తి చేసుకుని అమరావతి.. పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట దేవస్థానాల సందర్శన ఉంటుంది. మూడో రోజు ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకుంటారు. ఛార్జీలు పెద్దలకు రూ. 3,500, చిన్నారులకు రూ. 2800లు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలకు...
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహించే యాత్రల పూర్తి వివరాలకు.. టోల్‌ ఫ్రీ నంబరు 180042546464కు ఫోను చేయడంతో పాటు.. ‌www.telanganatourism.gov.in వెబ్‌సైట్లో పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే బషీర్‌బాగ్‌లోని ప్రధాన రిజర్వేషన్‌ కార్యాలయం 040-29801039/40, 9848540371, 9848306435, యాత్రి నివాస్‌ 9848126947, ట్యాంక్‌బండ్‌ రోడ్డులోని రిజర్వేషన్‌ కార్యాలయంలో 040-23450165, 9848125720, బేగంపేటలోని టూరిజం ప్లాజా 040-23414334, 9848306435, నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.