ఆదివారం, డిసెంబర్ 08, 2019
సీనియర్ అధ్యాపకుడికి ప్రత్యేకంగా తర్ఫీదు
తొలి విడతగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో..
ఈనాడు, హైదరాబాద్
తీవ్రమైన ఒత్తిడి.. మార్కులు తక్కువగా రావడం.. ఉత్తీర్ణత సాధించలేకపోవడం.. కారణాలు ఏవైనా విద్యాసంబంధ విషయాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పదో తరగతి ముగించుకుని ఎన్నో కలలతో కళాశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థులు.. అక్కడ ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. పోటీతత్వంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల ధోరణులతో మానసికంగా కుంగిపోయి తనువు చాలిస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తీరని శోకం అనుభవిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడం, బోర్డు చేసిన తప్పిదాల కారణంగా మార్కులు తారుమారై ఉత్తీర్ణులు కాకపోవడంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రతి కళాశాలలో కౌన్సెలర్‌ను ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. కళాశాలలోని సీనియర్ అధ్యాపకుడు లేదా లైబ్రేరియన్ ఈ బాధ్యతలు చేపడతారు. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కౌన్సెలర్లను ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ కౌన్సెలర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలర్‌గా వ్యవహరిస్తున్న అధ్యాపకులు విద్యార్థులకు ఎప్పటికప్పుడు విద్యా సంబంధ ఒత్తిడిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైతే సమాజంలోని వ్యక్తిత్వ వికాస లేదా మనస్తత్వ నిపుణులను ప్రత్యేకంగా కళాశాలకు ఆహ్వానించి తరగతులు నిర్వహించే వీలుంటుందని మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాస్కర్ ‘ఈనాడు’కు వివరించారు.
19, 20 తేదీల్లో కార్యశాల
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలున్నాయి. ఆయా కళాశాలల్లో 44 మంది అధ్యాపకులు కౌన్సెలర్లుగా వ్యవహరిస్తారు. వీరికి ఈ నెల 19, 20 తేదీల్లో నాంపల్లిలో కార్యశాల నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మనస్తత్వ నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు పాల్గొని పలు సూచనలు చేస్తారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఏ విధంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి.. కళాశాల స్థాయిలో ఎలాంటి సూచనలు, సలహాలు అందించాలి.. విద్యార్థులకు పరీక్షల భయం లేకుండా ఎలా సన్నద్ధం చేయాలి.. అన్న కోణంలో తర్ఫీదు ఇవ్వనున్నారు. తదనుగుణంగా కళాశాలల్లో అధ్యాపకులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. అయితే.. నేరుగా మనస్తత్వ విశ్లేషకులు లేదా నిపుణులను నియమించకుండా అధ్యాపకులకే ఆ బాధ్యతలు అప్పగించడంతో కౌన్సెలింగ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తాజా వార్తలు
జిల్లా వార్తలు