ఆదివారం, డిసెంబర్ 08, 2019
కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి వర్సిటీ వాలీబాల్ టోర్నీకి ఎంపికయ్యారు. క్రీడాకారులు సురేశ్, నవీన్, రాకేశ్, గోపాల్, పవన్‌లు ఈ నెలాఖరున చెన్నైలో జరిగే పోటీల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. వారిని ప్రిన్సిపల్ చంద్రకాంత్, వైస్ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్, అధ్యాపకుల బృందం అభినందించారు.
విలువిద్య పోటీల్లో ఇద్దరికి వెండి పతకాలు
దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలోని విలువిద్య అకాడమీలో శిక్షణ పొందుతున్న బోరెడ్డి నిఖిత అనే పేరు గల ఇద్దరు క్రీడాకారిణులు ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో వెండి పతకాలు సాధించారు. ఒకరు రికర్వు రౌండ్ 70 మీ. విభాగంలో ద్వితీయ స్థానం, మరొకరు ఇండియన్ రౌండ్ 50 మీ., 30మీ. విభాగాల్లో (ఓవరాల్) ద్వితీయ స్థానంతో వెండి పతకాలు సాధించారు. ఈ నెల 13న వరంగల్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో వారిద్దరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడాకారిణులు కామారెడ్డిలోని శ్రీ సాందీపని జూనియర్ కళాశాలలో సీనియర్ ఎంపీసీ చదువుతున్నారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి వెండి పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడంతో శిక్షకుడు ప్రతాప్దాసు, అకాడమీ నిర్వాహకులు కామినేని అనిల్‌కుమార్‌లు వారిని అభినందించారు.
బాలల హక్కులను పరిరక్షించాలి
దోమకొండ, న్యూస్‌టుడే: బాలల హక్కులను పరిరక్షించాలని కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్ అన్నారు. దోమకొండలోని గడీ కోటలో గురువారం గడీ కోట ట్రస్టు, ఐసీడీఎస్ సంయుక్తంగా బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీవో రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. బాలల హక్కులకు భంగం కలగకుండా ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులలో ముగ్గురికి వీల్ ఛైర్స్, ఇద్దరికి ట్రై సైకిళ్లను ఎంపీపీ సదానంద, ఆర్డీవో చేతుల మీదుగా అందజేశారు. వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు సతీష్‌రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో రోచిష్మ, ఎస్సై రాజేశ్వర్‌గౌడ్, ఏఎస్సై ఉమేశ్, బాల రక్ష భవన్ సమన్వయకర్త జానకి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ యాదగిరిరెడ్డి, ఛైల్డ్ లైన్ ఎన్జీవో జిల్లా సమన్వయకర్త సవిత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్, గడీ కోట ట్రస్టు సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు గణేశ్, రాధిక, మానస, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు