close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

తనిఖీలతో సరి.. మార్పేది!

ఆగని నిల్వ మాంసం వంటకాల తయారీ

ప్రజారోగ్య, ఆహారభద్రత శాఖ దాడుల తర్వాతా అదే తీరు

జిల్లాలో అడుగడుగునా ప్రమాణాలకు పాతర


పురుగులు పట్టిన మాంసం

రంగులు పూసి నిల్వ చేసిన మాంసంనెల్లూరు నగరం చిల్డ్రన్స్‌పార్కు రోడ్డులోని ఓ హోటల్‌ను అధికారులు తనిఖీ చేసి జిల్లాలో వినియోగంలో లేని రూపురేఖలు మారిపోయి నిల్వ ఉన్న నాలుగు ఆక్టోపస్‌లు, డ్రాగన్‌ రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నిరచగా అమ్మకానికి కాదని.. తమ యజమాని కోసం నిల్వ చేశామని చెప్పడం గమనార్హం. దీంతో కల్తీ ఆహార నియంత్రణ, ప్రజారోగ్యశాఖ అధికారులు రూ.20 వేలు జరిమానా వేసి సీజ్‌ చేశారు.

నగరం నడిబొడ్డున మద్రాసు బస్టాండు ప్రాంతంలోని బిరియాని హోటల్‌లో పురుగులు పట్టి, కుళ్లిపోయిన మాంసం నిల్వలు పెద్దఎత్తున బయటపడ్డాయి. ఆ మాంసానికే రంగులు అద్ది వినియోగదారులకు వడ్డిస్తుండటం గమనార్హం.

హరనాథపురంలోని ఓ కోడిమాంసం విక్రయ దుకాణాన్ని అధికారులు తనిఖీ చేయగా వందల కేజీల నిల్వ మాంసం బయటపడింది. ఫ్రిజ్‌లలో లెగ్‌ పీసులు, లాలీపాప్‌లు, కందనకాయలు, గుండెకాయలు వేరు చేసి నిల్వ ఉంచడం గమనార్హం. అక్కడ శీతలయంత్రాలను స్వాధీనం చేసుకుని మాంసాన్ని నిర్వీర్యం చేశారు.

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : యటకు వెళ్లి తాగే నీళ్ల నుంచి పాల వరకు.. టీ కొట్టు నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా ఆహార కల్తీయే.. ఇది ప్రజల ప్రాణాలకు సవాల్‌గా మారుతోంది. ఘుమఘుమలాడే వాసనలు.. నోరూరించే రుచులు.. భోజన శాలల్లో.. ఫుట్‌పాత్‌లపై ఉండే ఆహార శాలల్లో.. రంగులు పూసిన వంటకాలను చూస్తే ఆగలేని పరిస్థితి. తింటున్న మాంసం ముక్క పురుగులు పట్టిందా.. బూజు పట్టిందా.. అనేది చూడకుండా ఆరగించేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, బిరియాని అంగళ్లలో కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దానికి రంగులద్ధి. మళ్లీ మళ్లీ నూనెలో వేయించి వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తూ మాంసప్రియుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజారోగ్య, ఆహారభద్రతశాఖల అధికారులు తనిఖీలు చేసి జరిమానాలు విధించి చేతులు దులుపుకొంటున్నారు. ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడంతో మూడు రోజులకే పరిస్థితి మళ్లీ యథా స్థితికి చేరుకుంటుంది.

సింహపురీయులు మాంసాహారమంటే లొట్టలేసుకుని ఆరగిస్తారు. నెల్లూరు వంటకాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు. ఇదే అదనుగా కొందరు హోటళ్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి నెల్లూరు మాంసాహారానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. మరోవైపు మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అధిక శాతం మంది బయటి తిళ్లకు మక్కువ చూపుతున్నారు. అన్ని రోజుల్లోనూ మాంసాహారానికి గిరాకీ ఉంటోంది. ఇదే అదనుగా రోగాల బారిన పడిన జీవాలు, రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసి కుళ్లిన, పురుగులు పట్టిన మాంసాన్ని సైతం వంటకాల్లో కలిపేస్తున్నారు. జిల్లాలో నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట పట్టణాల్లో ఈ అడ్డగోలు వ్యాపారానికి అడ్డూ ఆపు లేకుండాపోతోంది. నిల్వ మాంసంతో పాటు నాసిరకం నూనెలు, అనుమతి లేని రంగులు మితిమీరి మరీ వాడటం రివాజైంది.

నాణ్యత దేవుడెరుగు..

మాంసాన్ని కోసిన వెంటనే నాలుగు డిగ్రీలకంటే తక్కువ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో శీతల యంత్రాల్లో ఉంచాలి. అనంతరం శుభ్రంగా కడిగి ఆరబెట్టాక మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. లేదంటే ఆ మాంసంపై బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా జాగ్రత్తలు తీసుకున్నా.. వేయించి భద్రపరిచినా.. 48 గంటల తర్వాత దాన్ని వినియోగించడం మంచిది కాదు. సాధారణ స్థితిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాంసం 12 నుంచి 16 గంటల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. రెండు గంటలకు మించి బయట ఉంచితే క్రమేపీ బ్యాక్టీరియా చేరుతుంది. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం పదేపదే వేడి చేసి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసిరకం మాంసం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రసాయనాలు, రంగులు కలిపిన మాంసాహారం అధికంగా తినడం వల్ల న్యూమోనియా, క్షయ, సెప్సిస్‌, క్యాన్సర్‌ వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది.

పడని కళ్లెం!

ప్రజల్లో అవగాహన లేకపోవడం, కల్తీలు, నాణ్యత లోపం కళ్ల ముందు కనిపించినా ఎందుకులే గొడవ అన్న ఆలోచనతో చాలా మంది ఫిర్యాదుల వరకు వెళ్లడం లేదు. ఇదే అలుసుగా కొందరు వ్యాపారులు విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు వారోత్సవాలు, మాసోత్సవాల సమయంలో హడావుడి చేయడం, కరపత్రాలు పంచి మమ అనిపిస్తున్నారు. దీంతో ఎంతో మంది వినియోగదారులు దగాకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు విక్రయించే వారు తప్పనిసరిగా ఆహార భద్రత అధికారి వద్ద లైసెన్స్‌ తీసుకోవాలి. టర్నోవర్‌ రూ.12 లక్షల్లోపు ఉంటే ఏడాదికి రూ.100 లైసెన్సు ఫీజుగా చెల్లించి ఏటా అనుమతి పునరుద్ధరించుకోవాలి. అంతకు మించితే రూ.2 వేలు చెల్లించాలి. దుకాణం రిజిస్టర్‌ చేసుకోవాలి. లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తే సెక్షన్‌ 63 ప్రకారం ఆరు నెలలు జైలు, రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్ఛు కానీ జిల్లాలో లైసెన్సు తీసుకున్న వారు పది శాతం మంది కూడా లేకపోవడం గమనార్హం.

చెన్నై, బెంగళూరు నుంచి దిగుమతి

నెల్లూరులోని కొందరు వ్యక్తులు చెన్నై, బెంగళూరు నుంచి మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఆ నగరాల్లో నిల్వ ఉన్న కోడిమాంసం కేజీ రూ.50, మటన్‌ రూ.300 వంతున తీసుకొచ్చి జిల్లాలోని హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, బిరియాని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుండటంతో కక్కుర్తి పడిన కొందరు హోటళ్ల నిర్వాహకులు పెద్దఎత్తున ఆ మాంసాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కుళ్లి, పురుగులు పట్టిన మాంసానికి మసాలా పూసి, రంగులు వేసి వడ్డించేస్తున్నారు. సముద్రంలో దొరికే ఆక్టోపస్‌, డ్రాగన్‌ రొయ్యలను చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటికి జిల్లాలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో నెలల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతున్నారు. అవి రూపురేఖలు మారిపోయి దుర్వాసన వస్తున్నా.. అడిగిన వారికి వండి పెడుతున్నారు.

నిల్వ మాంసంపై దృష్టి పెట్టాం - శ్రీనివాస్‌, గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

జిల్లాలో పలు ఆహార శాలల్లో మాంసం నిల్వలో ప్రమాణాలు పాటించడం లేదు. కొన్నిచోట్ల మాంసం బూజు పట్టడం.. నిషేధిత రంగుల వాడడాన్ని గుర్తించాం. మితిమీరి రసాయనాలు, రంగులు వాడినా, నాసిరకం మాంసం అమ్ముతున్నట్లు గుర్తించినా చర్యలు తప్పవు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నాం. ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తేలితే నిర్వాహకులపై కేసులు పెడతాం. ఇలాంటివి గుర్తించిన వారు 99896 88699 నెంబరుకు తెలియజేయవచ్ఛు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.